తీరంలో సా‘రాజ్యం’

ABN , First Publish Date - 2020-07-16T14:41:02+05:30 IST

తీర ప్రాంతంలో కాపుసారా గుప్పుమంటోంది..

తీరంలో సా‘రాజ్యం’

అధికారపార్టీ కనుసన్నల్లో సారా మాఫియా

మద్యం ధరల పెంపుతో ఊపందుకున్న తయారీ

రోజుకు రూ.అరకోటి విలువైన సారా విక్రయాలు

లీటరు సారా రూ.1000కి పైనే

పేదల ప్రాణాలకు పొంచి ఉన్న ముప్పు

సారారహిత గ్రామాలంటూ ఆర్భాటపు ప్రకటనలు

ఆ గ్రామాల్లోనే వేల లీటర్లలో సారా తయారీ


(ఆంధ్రజ్యోతి, నెట్‌వర్క్‌): సముద్రతీరం కాపుసారా మత్తులో జోగుతోంది. తీర గ్రామాలు బెల్లపు ఊట, కాపుసారా వాసనతో గుప్పుమంటున్నాయి. మడ అడవులు, చేపల చెరువులు, కాల్వ గట్టులు, చిక్కటి పొదలు కాపుసారా బట్టీలకు నెలవుగా మారుతున్నాయి. రాత్రీపగలు తేడాలేకుండా ఇక్కడ కాపుసారా నిరంతరాయంగా తయారవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం కొత్త మద్యం పాలసీ పేరుతో మద్యం దుకాణాలను తగ్గించేసి, మద్యం ధరలను పెంచేసిన తరువాత సారా తయారీ మళ్లీ ఊపిరిపోసుకుంది. సారాపై రాష్ట్రవ్యాప్తంగా నిషేధం ఉన్నా జిల్లాలోని తీర ప్రాంతాల్లో అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే సారా మాఫియా చెలరేగిపోతోంది.


తీర ప్రాంతంలో కాపుసారా గుప్పుమంటోంది. మాఫియా కనుసన్నల్లో ఇక్కడ తయారైన సారాను పొరుగు జిల్లాలకు తరలిస్తున్నారు. అధికార పార్టీ నాయకులు కొందరు పోలీసుస్టేషన్ల వద్దే ఉండి కాపుసారా తయారు చేస్తూ ఎవరైనా పట్టుబడితే కేసులు నమోదు కాకుండా చూస్తున్నారు. పెడన, మచిలీపట్నం నియోజకవర్గాల్లో అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే సారా తయారవుతోంది. మచిలీపట్నం, బంటుమిల్లి, గూడురు, కృత్తివెన్ను, పెడన, దివిసీమలోని పలు మండలాల్లో నిత్యం ఐదు నుంచి 10 వేల లీటర్ల సారా విక్రయాలు జరుగుతాయి. దీని విలువ రూ.అరకోటి పైనే!


డిమాండ్‌ పెరిగింది.. ధరా పెరిగింది!

మద్యం ధరలకు రెక్కలు రావటం, ప్రభుత్వ మద్యం దుకాణాల్లో నాసిరకం బ్రాండ్లు అందుబాటులో ఉండటంతో సారాకు డిమాండ్‌ పెరిగిపోతోంది. గతంలో లీటరు సారా 300 లోపే ఉండేది. ఇప్పుడు లీటరు రూ.వెయ్యి నుంచి 1200 వరకు పలుకుతోంది. ఆదాయం దండిగా ఉండటంతో అధికార పార్టీ నేతలు సైతం తమ అనుచరులను సారా తయారీ, పర్యవేక్షణకు పురమాయిస్తున్నారు. ఒక్క బట్టీ సారా కాచి, అమ్మితే 50 వేల వరకు ఆదాయం వస్తున్నట్లు తెలుస్తుంది. 


అవనిగడ్డ నియోజకవర్గంలోని నాగాయలంక, కోడూరు మండలాల్లోని తీర గ్రామాల్లో పలువురు సారా తయారీని ఓ ఆదాయ వనరుగా మార్చుకున్నారు. ఎక్సైజ్‌ శాఖలో సిబ్బంది కొరత కారణంగా వీరిని అడ్డుకునేవారే కరువయ్యారు. మహిళా పోలీసు మిత్రల సహకారంతో అప్పుడప్పుడు దాడులు నిర్వహిస్తున్నా, పక్కా సమాచారంతో తయారీదారులు మద్యాన్ని పక్కకు మళ్లిస్తున్నారు. నాగాయలంక, కోడూరు మండలాలకు నదీ మార్గాన గుంటూరు జిల్లాలోని తీర గ్రామాల నుంచి పెద్దఎత్తున నాటుసారా దిగుమతి చేసుకుంటూ లీటరు రూ.800 మేర విక్రయిస్తున్నారు. అదే సమయంలో కొన్ని లంక గ్రామాల నుంచి గుంటూరుకూ సారా తరలుతోంది. గత నెలలో నాగాయలంక మండల పరిధిలోని నాలి గ్రామంలో ఎక్సైజ్‌ అధికారులు నిర్వహించిన దాడుల్లో 20 లీటర్ల నాటు సారా 1800 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేయటం మినహా పెద్దగా దాడులు నిర్వహించలేదు. 


 ‘పరివర్తన’ ఓ ఫార్సు..!

రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా జిల్లాలోని కృత్తివెన్ను మండల తీరంలోని సారా తయారీదారులే స్వచ్ఛందంగా ముందుకొచ్చి సారా తయారీని, విక్రయాలను వదిలేశారంటూ జిల్లా అధికారులు ప్రకటనలతో హడావిడి చేశారు. దీనికి పరివర్తన అని పేరు పెట్టారు. కృత్తివెన్ను మండలాన్ని రాష్ట్రంలోనే తొలి సారారహిత మండలంగా జిల్లా ఎస్పీ ప్రకటించారు. దీంతో అధికారులు ఆ పేరును చెడగొట్టడం ఎందుకన్న ఉద్దేశంతో సారా తయారీ విషయంలో చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. అడపాదడపా దాడులు చేసినా బయటకు రానివ్వడం లేదు. ఈ నెల ఏడో తేదీన ముగ్గురు సారా విక్రయదారులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. గుట్టుచప్పుడు కాకుండా కోర్టులో హాజరుపరిచారు. రిమాండ్‌కు పంపే సమయంలో వారిలో ఒకరికి కరోనా పాజిటివ్‌ రావడంతో ఈ విషయం వెలుగుచూసింది.  


కల్తీ సారాతో ముప్పు..!

సారాకు విపరీతంగా డిమాండ్‌ పెరిగిపోవటంతో తక్కువ సమయంలో ఎక్కువ సారా తయారు చేసేందుకు కొందరు పక్కదారులు తొక్కుతున్నారు. మందుబాబులకు అధిక కిక్కుతోపాటు అనారోగ్యాన్ని అందిస్తున్నారు. గతంలో సారా తయారీకి బెల్లం, పటిక, సున్నం, కరక్కాయ, నల్లతుమ్మ, మోదుగబెరడు, కుళ్లిన అరటిపళ్లు, బ్యాటరీ పొడిని వినియోగించేవారు. ఊటగా 10 రోజులు, బట్టీ పద్ధతిలో సారా తయారైన తర్వాత మరో 15 రోజుల వరకు భూమిలో గోతులు తవ్వి నిల్వ ఉంచి, తర్వాత విక్రయించేవారు. ఇప్పుడు గిరాకీ విపరీతంగా ఉండటంతో ఏ రోజుకు ఆ రోజు సారాను తయారు చేసేస్తున్నారు. ఇది పూర్తిగా కల్తీ పద్ధతి. మందుబాబులకు అధిక నిషాను ఇచ్చేందుకు యూరియా, అమ్మోనియా గుళికలతో పాటు నిద్రమాత్రలు, అధిక మోతాదులో ఇతర రసాయనాలు వాడుతున్నారు.


కేసుల నమోదు ఇలా

మచిలీపట్నం డివిజన్‌లో గడిచిన రెండు నెలల్లో కాపుసారా తయారీదారులపై 86 కేసులు నమోదు చేసి 127 మందిని అదుపులోకి తీసుకున్నారు. 18,775  లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేశారు. 19 వాహనాలను, 826 లీటర్ల కాపుసారాను స్వాధీనం చేసుకున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. కాపుసారా తయారవుతున్న గ్రామాలను గుర్తించిన పోలీసులు ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించినట్లు ఎస్పీ రవీంద్రనాథ్‌ తెలిపారు. 350 కుటుంబాలు కాపుసారా తయారీకి దూరంగా ఉంటామని ప్రకటించాయని, వారికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు మచిలీపట్నం, బంటుమిల్లి, చాట్రాయి మండలాల్లో ఇంటర్వ్యూలు నిర్వహించి, 150 మందికి వివిధ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించామని తెలిపారు. 

Updated Date - 2020-07-16T14:41:02+05:30 IST