సంతలో సడేమియా

ABN , First Publish Date - 2022-08-04T05:30:00+05:30 IST

సందట్లో సడేమియాలా రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని దోచుకుంటున్నారు.

సంతలో సడేమియా
ఆదోని సంతలో విక్రయానికి వచ్చిన పశువులు

అందినకాడికి దోచుకుంటున్న కాంట్రాక్టర్లు
గెజిట్‌ నిబంధనకు విరుద్ధంగా వసూళ్లు
అన్నదాత దోపిడీకి గురవుతున్నా పట్టని అధికారులు


ఆదోని(అగ్రికల్చర్‌), ఆగస్టు 4: సందట్లో సడేమియాలా రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని దోచుకుంటున్నారు. ఆదోని సంత మార్కెట్‌కు వస్తున్న అన్నదాతలను నిలువుదోపిడీ  చేస్తున్నారు. 2022-23 సంవత్సరానికి  పశువులు, గొర్రెల సంత,  ఝాన్సీలక్ష్మీబాయి కూరగాయల మార్కెట్‌కు వేలం నిర్వహించారు. వారం వారం జరిగే పశువుల సంత రూ.16.70 లక్షలు,  గొర్రెల సంత రూ.6.45 లక్షలు, రోజూ జరిగే ఝాన్సీలక్ష్మీబాయి కూరగాయల మార్కెట్‌ రూ.72.50 లక్షలకు  వేలంలో అధికార పార్టీకి చెందిన కాంట్రాక్టర్‌లు దక్కించుకున్నారు. అయితే వీరు గెజిట్‌ కనుగుణంగా వసూలు చేయాల్సిన చోట అధిక వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.

పట్టణంలో హిందూ శ్మశాన వాటిక పక్కన ఖాళీ స్థలంలో ప్రతి శుక్రవారం పశువుల సంత జరుగుతుంది. ఆదోని, ఎమ్మిగనూరు, పత్తికొండ, ఆలూరు, మంత్రాలయం, డోన్‌, కోడుమూరు, గుత్తి ప్రాంతాల నుంచి ఎద్దులు, ఆవులు, బర్రెలు, దూడలు ప్రతి వారం విక్రయానికి వస్తాయి. ప్రతి వారం వెయ్యి నుంచి 1500 పశువుల విక్రయాలు జరుగుతాయి. సంతకు వచ్చే పశువులకు సదరు కాంట్రాక్టర్‌ అన్ని సౌకర్యాలు కల్పించాలి. పశువులకు తొట్లు ఏర్పాటు చేసి తాగునీరు, మేత అందించాలి. వాహనం ద్వారా తెచ్చే పశువులను ఎక్కించేందుకు, దించేందుకు ర్యాంపులు ఏర్పాటు చేయాలి. వీటన్నింటికి సౌకర్యాలు కల్పించేందుకు పురపాలక వేలం ద్వారా దక్కించుకున్న సదరు కాంట్రాక్టర్‌ ఒక్క పశువుకు రూ.15, దూడకు రూ.5 మాత్రమే వసూలు చేయాలి. అలా కాకుండా గెజిట్‌ నిబంధనలకు విరుద్ధంగా ఒక్కో పశువుకు రూ.150 వసూలు చేస్తున్నారు. తెచ్చిన రైతుతో, కొనుగోలు చేసిన వారితో రాను, పోను వసూలు చేసి సొమ్ము చేసుకుంటున్నారు. పశువులు తెచ్చిన వాహనానికి సైతం రూ.150 నుంచి 200 వసూలు చేస్తున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే ఇది ఇంతే అలా అయితేనే విక్రయించుకో.. లేకుంటే వెనక్కి తీసుకెళ్లు అంటూ సమాధానం చెబుతున్నారు.

కూరగాయల మార్కెట్‌లో మరీ దారుణం:

అధికార పార్టీకి చెందిన వ్యక్తి రూ.72.50 లక్షలకు కాంట్రాక్టర్‌ దక్కించుకున్నాడు. నిబంధనలకు ప్రకారం కూరగాయల మార్కెట్‌ పరిధిలో మాత్రమే వసూలు చేయాల్సి ఉండగా పట్టణమంతా వసూళ్లకు పాల్పడుతున్నాడు. తోపుడు బండ్లపై అమ్మే వారిని, రోడ్డుపై పెట్టిన వ్యాపారం చేసుకుంటున్న వారిని కూడా వదలడం లేదు. కూరగాయలు అమ్మే వారితో రూ.3 వసూలు చేయాల్సి ఉండగా రూ.20 వసూలు చేస్తున్నాడు. తోపుడు బండిపై వ్యాపారం చేసుకునే వారికి బండికి రూ.4 తీసుకోవాల్సి ఉండగా రూ.30 వరకు తీసుకుంటున్నాడు. జేఎల్‌బీ కూరగాయల మార్కెట్‌ ప్రాంతంలో సైకిల్‌ స్టాండ్‌కు రూ.2 వసూలు చేయాల్సి ఉండగా ఐదు రూపాయలు, ద్విచక్ర వాహనానికి రూ.10 తీసుకుంటున్నారు.

 గొర్రెల సంతలోనూ ఇదే పరిస్థితి
 
పురపాలక అధికారులు నిర్దేశించిన ఫీజు వసూలు చేయాలని గెజిట్‌లో ఉంది. సదరు కాంట్రాక్టర్‌ మాత్రం ఇవేమీ పాటించడం లేదు. ప్రతి శుక్రవారం బొబ్బిలమ్మ గుడి వద్ద జరిగే గొర్రెల సంతకు వచ్చే జీవానికి రూ.2 వసూలు చేయాలి. అలా కాకుండా రూ.40 వసూలు చేస్తున్నారు. ఇక్కడ కూడా ఇద్దరి వద్ద వసూలు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.

పర్యవేక్షించాల్సిన పురపాలక అధికారులు కన్నెత్తి చూసిన దాఖలు లేవు:
 
అధికార పార్టీకి చెందిన వారు కావడంతో పుర అధికారులు సైతం మిన్నకుండిపోతున్నారని తెలుస్తోంది. బహిరంగంగానే కిస్తుల పేరుతో దోపిడీ చేస్తున్నా పట్టించుకోకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.  
 
ఏ సంతలోనూ ఇంత వసూలు చేయరు

చుట్టుపక్కల ఎమ్మిగనూరు, పత్తికొండ, నందికొట్కూరు సంతల్లో ఇంత వసూలు చేయరు. ఇక్కడే ఒక్కో పశువుకు రూ.150 పైగా వసూలు చేస్తున్నారు. అధికారులు ఎవరైనా పట్టించుకుంటే కదా. ఇప్పటివరకు ఎవరూ తనిఖీలు చేసిన దాఖలు లేవు.

-హుసేన్‌పీరా, పలుకూరబండ

దోపిడీని అరికట్టాలి

నిబంధనలకు విరుద్ధంగా రైతుల నుంచి కిస్తుల పేరుతో జరుగుతున్న దోపిడీని అరికట్టాలి. సంతలో కనీసం తాగేందుకు నీళ్లు ఉండవు. పశువులకు మేత ఉండదు. సౌకర్యాలు లేకుండానే రైతుల నుంచి వసూలు చేస్తున్నారు. సంబంధిత అధికారులు చర్యలు తీసుకుంటే దారికి వస్తారు.

-భాస్కర్‌, రైతు పలుకూరబండ

నిబంధనలు పాటించకుంటే చర్యలు

గెజిట్‌ నిబంధనలకు విరుద్ధంగా పశువుల సంతలో కూరగాయల మార్కెట్‌లో ఫీజు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటాం. వారిపై ఇక నుంచి నిఘా ఉంచి కచ్చితంగా గెజిట్‌ ప్రకారం వసూలు చేసేలా చూస్తాం. అధిక వసూళ్లకు పాల్పడినట్లు తెలిస్తే నోటీసులు జారీ చేసి కాంట్రాక్టర్‌ రద్దు చేస్తాం                         

-అనుపమ, పురపాలక సహాయ కమిషనర్‌, ఆదోని

Updated Date - 2022-08-04T05:30:00+05:30 IST