సెంట్రల్‌ వర్సిటీగా సంస్కృత విద్యాపీఠం

ABN , First Publish Date - 2020-03-30T11:19:02+05:30 IST

తిరుపతిలోని రాష్ర్టీయ సంస్కృత విద్యాపీఠాన్ని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం (నేషనల్‌ సాంక్ర్కిట్‌ యూనివర్సిటీ)గా మార్పు చేస్తూ కేంద్ర ప్రభుత్వ గెజిట్‌ విడుదలయింది.

సెంట్రల్‌ వర్సిటీగా సంస్కృత విద్యాపీఠం

తిరుపతి సిగలో నాలుగో జాతీయ విద్యాసంస్థ

 

తిరుపతి(విద్య), మార్చి 29: తిరుపతిలోని రాష్ర్టీయ సంస్కృత విద్యాపీఠాన్ని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం (నేషనల్‌ సాంక్ర్కిట్‌ యూనివర్సిటీ)గా మార్పు చేస్తూ కేంద్ర ప్రభుత్వ గెజిట్‌ విడుదలయింది. ఈ మేరకు కేంద్ర న్యాయ మంత్రిత్వశాఖ కార్యదర్శి జి.నారాయణరాజు ఈనెల 25న విడుదల చేసిన గెజిట్‌ పత్రం శనివారం సాయంత్రం వర్సిటీ అధికారులకు చేరింది. దేశవ్యాప్తంగా మూడు సంస్కృత విద్యాపీఠాలను కేంద్రీయ యూనివర్సిటీలుగా అప్‌గ్రేడ్‌ చేయగా అందులో తిరుపతిలోని విద్యాపీఠం ఒకటి కావడం విశేషం. దీంతో ఇప్పటికే తిరుపతిలో ఉన్న ఐఐటీ, ఐసర్‌, పాకశాస్త్ర వర్సిటీ లాంటి మూడు జాతీయ విద్యాసంస్థలు ఉండగా,  ఇది నాలుగోదిగా వాటి సరసన చేరింది. విద్యాపీఠంలో ప్రస్తుతం  ప్రాక్‌శాస్ర్తి, శాస్ర్తి, ఆచార్య, విశిష్టాచార్య, విద్యావారధి లాంటి రెగ్యులర్‌ కోర్సులతోపాటు వివిధ విభాగాల్లో పీజీ డిప్లొమా కోర్సులు, సర్టిఫికెట్‌, సాయంత్రపు కోర్సులు ఆఫర్‌ చేస్తున్నారు. వివిధ కోర్సుల్లో దాదాపు 1000 మంది విద్యార్థులు చదువుతున్నారు.    


సెంట్రల్‌ హోదాతో ప్రయోజనాలు 

ఇప్పటివరకు డీమ్డ్‌ యూనివర్సిటీగా నడుస్తున్న వర్సిటీ.. సెంట్రల్‌ హోదా ద్వారా తన ప్రతిష్ఠను మరింతగా పెంచుకోనుంది. స్వయం ప్రతిపత్తి హోదానుంచి చట్టబద్ధ వ్యవస్థలోకి వస్తుంది. కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి రావడం వల్ల ప్రొఫెషనలిజమ్‌ పెరుగుతుంది. నిర్ణయాలు చట్టబద్ధంగా తీసుకోవాల్సి ఉంటుంది. యూనివర్సిటీకి ఇప్పటివరకు ఛాన్సలర్‌ సర్వోన్నత అధికారిగా, జాతీయ మానవవనరుల మంత్రి  సొసైటీ అధ్యక్షుడిగా ఉండేవారు. ఇకనుంచి వర్సిటీకి భారత రాష్ట్రపతి విజిటర్‌గా వ్యవహరిస్తారు. ఛాన్సలర్‌, వైస్‌ఛాన్సలర్లను కేంద్రమానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ ద్వారా అపాయింట్‌ చేస్తారు. వర్సిటీ యూజీసీ పరిధిలోకి వస్తుంది. కేంద్రీయ హోదా ద్వారా దేశంలో వివిధ ప్రాంతాల్లో అనుబంధ కళాశాలలు, అధ్యయన కేంద్రాలు ఏర్పాటు చేసుకునే అవకాశం వస్తుంది. కొత్త కోర్సులతోపాటు అభివృద్ధికి నిధులు బాగా వస్తాయి. అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంటుంది.

Updated Date - 2020-03-30T11:19:02+05:30 IST