సంక్రాతి సందడి

ABN , First Publish Date - 2022-01-15T06:40:25+05:30 IST

జిల్లాలో ఏ ఊరువాడ చూసినా సంక్రాంతి సందడే కనిపిస్తోంది. ఇంటి వాకిళ్లు, రంగులముగ్గులు, గుమగుమలాడే పిండివంటకాలు సంక్రాంతికి ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. పట్టణాల నుంచి పల్లెలకు చేరుకున్న ప్రజలు వారివారి బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు, స్నేహితులతో ఉత్సాహంగా సంబరాలు జరుపుకుంటున్నారు. శుక్రవారం బోగి పండుగతో ప్రారంభమైన సంక్రాంతి

సంక్రాతి సందడి
మార్కెట్లో చెరకుగడలు, రంగులను కొనుగోలు చేస్తున్న మహిళలు, యువతులు

జిల్లాలో మొదలైన సంబురాలు

పిండివంటకాల తయారీలో మహిళలు బిజీబిజీ 

గాలిపటాలతో యువకులు, చిన్నారుల కేరింతలు 

సరిహద్దు గ్రామాల్లో  కోడి పందేల జోరు 

పండుగ వేల కరోనాతో జరజాగ్రత్త

ఆదిలాబాద్‌, జనవరి 14(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఏ ఊరువాడ చూసినా సంక్రాంతి సందడే కనిపిస్తోంది. ఇంటి వాకిళ్లు, రంగులముగ్గులు, గుమగుమలాడే పిండివంటకాలు సంక్రాంతికి ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. పట్టణాల నుంచి పల్లెలకు చేరుకున్న ప్రజలు వారివారి బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు, స్నేహితులతో ఉత్సాహంగా సంబరాలు జరుపుకుంటున్నారు. శుక్రవారం బోగి పండుగతో ప్రారంభమైన సంక్రాంతి ఆదివారం కనుమతో ముగ్గుస్తుంది. మూడు రోజుల పాటు వరుసగా జరుపుకునే సంక్రాంతిని.. ఈ యేడు ప్రజలు ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. పండుగ నేపథ్యంలో మార్కెట్‌లన్నీ సందడిగా మారాయి. కొనుగోలు, అమ్మకందారులతో మార్కెట్‌లు కిటకిటలాడుతున్నాయి. ఇంటి ముంగిట్లో ముగ్గులు వేసేందుకు రంగులు, పూజా, వంట సామగ్రిని కొనుగోలు చేస్తున్నారు. వాకిట్లో  గొబ్బెమ్మలను పెట్టి ప్రత్యేకంగా పూజలు చేస్తున్నారు. అయితే జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగడంతో పండుగ వేల ప్రజలు జరజాగ్రత్త అంటూ వైద్య అధికారులు హెచ్చరికలు చేస్తున్నారు. అలాగే, జిల్లాలో చలి తీవ్రత కూడా అధికంగానే కనిపిస్తోంది. రాత్రి, పగలు అనే తేడా లేకుండా చలి ప్రభావం ఉంటుంది. మారుమూల గిరిజన గ్రామాల్లో ని ప్రజలు సైతం బోగి మంటలు వేసుకుంటూ సంక్రాంతి సంబరాలను ఘనంగా జరుపుకుంటున్నారు.

చకినాల వంటకాలు ప్రత్యేకం

సంక్రాంతి పండుగకు చకినాల వంటకాలు ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. సంక్రాంతి అంటేనే అందరికీ గుర్తుకొచ్చేది చకినాల గుమగుమలు. వీటి తయారీకి అవసరమయ్యే బియ్యం పిండి, నువ్వులు, ఓమా, మంచినూనె లాంటి పదార్థాలను మహిళలు కొనుగోలు చేస్తూ తయారు చేస్తున్నారు. గత నాలుగైదు రోజులుగా ఒకరికొకరు చకినాల తయారీలో సహకరించుకుంటూ  పిండివంటకాలను తయారు చేసుకుంటూ బిజీబిజీగా ఉన్నారు. 

గాలి పటాల జోష్‌

పల్లె, పటణం అనే తేడా లేకుండా ఎక్కడచూసినా రంగురంగుల గాలిపటాల జోష్‌ కనిపిస్తోంది. యువకులు, చిన్నారులు గాలిపటాలను ఎగురవేస్తూ ఆనందంగా గడుపుతున్నారు. గత వారం రోజుల నుంచే జిల్లాలో గాలిపటాల విక్రయాలు జోరందుకున్నాయి. ఈసారి విభిన్నమైన విభిన్న రంగుల్లో బొమ్మలతో కూడిన గాలిపటాలు చిన్నారులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. రంగురంగులు, వివిధ రకాల దృశ్యాలతో గాలిపటాలు మార్కెట్‌లో సందడి చేస్తున్నాయి. చోటాభీమ్‌, స్పైడర్‌మ్యాన్‌, న్యూఇయర్‌, సినీ ప్రముఖుల గాలిపటాలు మార్కెట్‌లో లభ్యమవుతున్నాయి. వీటిని వ్యాపారులు హైదరాబాద్‌, నాగ్‌పూర్‌ లాంటి పట్టణాల నుంచి తీసుకొచ్చి రూ.10 నుంచి రూ.300 వరకు ఒక్కో గాలిపటాన్ని విక్రయిస్తున్నారు. కొందరు చిరు వ్యాపారులకు గాలిపటాల అమ్మకం మంచి ఉపాధి మార్గంగా మారింది. 

రహస్యంగా కోడి పందేలు!!

జిల్లాలో పెద్దగా కోడిపందేల సంప్రదాయం లేకపోయినా.. కొందరు మహారాష్ట్ర జూదరులు సరిహద్దు గ్రామాల్లో కోడిపందేలను నిర్వహిస్తున్నారు. ప్రధానంగా బేల, జైనథ్‌, భీంపూర్‌, నార్నూర్‌ మండలాల సరిహద్దు గ్రామాల్లో జోరుగా కోడిపందేల పోటీలు జరుపుతున్నారు. సంప్రదాయం పేరిట కోడిపందేలను నిర్వహిస్తున్న వీటి మోజులో పడి కొందరు జేబులు గుళ్ల చేసుకుంటున్నారు. సంప్రదాయం ప్రకారం ఏడాదికి ఒకసారి నిర్వహించే కోడి పందేలకు అధికారులు కూడా పెద్దగా అభ్యంతరాలు చెప్పినట్లు కనిపించకపోవడం గమనార్హం. 

Updated Date - 2022-01-15T06:40:25+05:30 IST