సంస్కృతమూ - లాటినూ

ABN , First Publish Date - 2020-12-14T06:36:01+05:30 IST

ప్రపంచ సాహిత్యంలో కొన్ని యాదృచ్ఛిక సారూ ప్యాలు ఆశ్చర్యకరంగా ఉంటాయి. సమాచార సౌకర్యాలుగానీ, వేగవంతమైన...

సంస్కృతమూ - లాటినూ

‘‘...ఏ భాషకైనా మార్పు సర్వసాధారణం. మన సంస్కృతం అటువంటి మార్పుని ఆహ్వానించకా, అంగీకరించకా, కాలగర్భంలో కలిసిపోవలసి వస్తున్నది. ఇది మన సంస్కృతీ సంపదకు మాయని గాయం.’’

ఠాగోర్‌

ప్రపంచ సాహిత్యంలో కొన్ని యాదృచ్ఛిక సారూ ప్యాలు ఆశ్చర్యకరంగా ఉంటాయి. సమాచార సౌకర్యాలుగానీ, వేగవంతమైన ప్రయాణసాధనాలు గానీ, లేనిరోజుల్లో సుదూరంగావున్న వేర్వేరు దేశాల్లోని, వేర్వేరు భాషలకుచెందిన సుప్రసిద్ధ రచయితల ఆలోచన ల్లోని సామ్యం, కుతూహలాన్ని రేకెత్తిస్తుంది.


మన దేశంలో సంస్కృతాన్ని ఋగ్వేదకాలపు (క్రీ.పూ. 1500) ప్రాచీన భాషగా అంగీకరిస్తాం. అలాగే పాశ్చాత్త్య దేశాల్లో లాటిన్‌ని విర్జిల్‌, సిసిరో (క్రీ.పూ.300-200) కాలపు ప్రాచీన భాషగా గౌరవిస్తారు. ఏ భాషయినా మాతృ భాషగా వుండి ప్రజల నాల్కల మీద అనునిత్యమూ నలుగుతూ వుంటేనే బ్రతికి బట్టకట్టగలుగుతుంది. జీవభాష అనిపించు కొంటుంది. వేలమైళ్ళ దూరంలోవుండి ఒకనాడు ఉజ్వలంగా వెలిగిన సంస్కృతం, లాటిన్‌ల ప్రాధాన్యత సుమారుగా ఒకే కాలంలో సన్నగిల్లిపోవడం విడ్డూరంగా ఉంటుంది. కానీ అదే జరిగింది. రెండు దేశాల్లో రెండు భాషలకు చెందిన ఇద్దరు విశిష్ట రచయితల రచనల్లో అందుకు ప్రామాణిక ప్రవస్తావనలు కనపడుతున్నాయి. 


యుగకర్త గురజాడ అప్పారావుగారు (1862-1915) మన వాడుక భాష తెలుగులో రచించిన ప్రసిద్ధ ‘కన్యాశుల్కం’ నాటకంలో సంస్కృతాన్ని గూర్చి ఒక ప్రస్తావన కనబడు తుంది: బాలిక సుబ్బిని లుబ్దావధాన్లు అనే ముసలాడికిచ్చి పెళ్ళి చేయాలని తండ్రి అగ్నిహోత్రావధాన్లు నిర్ణయిస్తాడు. సుబ్బి మేనమామ కరటకశాస్త్రి ఆ పెళ్లిని తప్పించడానికి రంగంలోనికి దిగుతాడు. అతగాడు ఒక సంస్కృత పండి తుడు. సంస్కృత నాటకాల్లో విదూషకుడి వేషాలు వేస్తుం టాడు. శిష్యుడి చేతనూ ఆడవేషాలు వెయ్యిస్తుంటాడు. తీరుబాటుగా వున్నప్పుడు శిష్యుడికి సంస్కృత పాఠాలు చెబుతుంటాడు. సంస్కృతం డైలాగులు భట్టీయం పట్టి స్తుంటాడు. కానీ ఆ శిష్యుడు గిరీశాన్నీ, అతని వద్ద ఇంగ్లీషు చదువుకొంటున్న వెంకటేశాన్నీ చూసి, ఇంగ్లీషు మీద మోజు పెంచుకుంటాడు. కరటకశాస్త్రి ఆ శిష్యుడి చేత ఆడవేషం వేయించి వాడ్ని లుబ్ధావధాన్లుకు ఇచ్చి పెళ్లి చేసి తన మేనకోడల్ని రక్షించాలని పథకంపన్నుతాడు. ఆ సందర్భంలో శిష్యుడ్ని ఆడవేషానికి ఒప్పించే ప్రయత్నంలో గురు శిష్యుల మధ్య సంభాషణ ఇలాసాగుతుంది: 

కరటకశాస్త్రి- చదువెందుకు? పొట్టపోషించుకోవడానికేగదా?

శిష్యుడు- అవును.

కరటకశాస్త్రి- ఈ రోజుల్లో నీ సంస్కృతం చదువెవడిక్కావాలి?

శిష్యుడు- దరిద్రుడిక్కావాలి. 


ఇదీ మన గురజాడవారి కాలంనాటి సంస్కృతం పరిస్థితి. ఈ సందర్భంలో సంస్కృతం గురించి రవీంద్ర నాథ్‌ ఠాగూర్‌ (1861-1941)మాటల్ని గుర్తుచేసుకోవడం అప్రస్తుతం కాదు: ‘‘జీవభాష జీవనది వంటిది. నది తన ప్రవాహంలో చిన్నచిన్న పిల్ల కాలువలను కలుపుకొంటూ జీవనదిగా గమిస్తుంది. అలాగే భాష కూడా ఇతర భాషా పదాలను సముచితంగా తనలో కలిపేసుకుంటూ తన జీవలక్షణాలను కాపాడుకొంటూ ఉండాలి. ఏ భాషకైనా మార్పు సర్వసాధారణం. మన సంస్కృతం అటువంటి మార్పుని ఆహ్వానించకా, అంగీకరిం చకా, కాలగర్భంలో కలిసిపోవలసి వస్తున్నది. ఇది మన సంస్కృతీ సంప దకు మాయని గాయం.’’ (టాగూరూ గురజాడా సమకాలికులు కావడం ఇక్కడ గమనించదగ్గ విశేషం.)


గై. డి. మొపాసా (1850-1893) ప్రఖ్యాత ఫ్రెంచ్‌ రచయిత. ఆయన రచించిన ‘ది క్వశ్చన్‌ ఆఫ్‌ లాటిన్‌’ కథలో పిక్విడెంట్‌ ఒక స్కూల్‌ టీచరు. ఏ డిగ్రీ లేకపోయినప్పటికీ లాటిన్‌ మీద ప్రత్యేకమైన అనురక్తితో ఆ భాషని అదేపనిగా అధ్యయనం చేస్తుం టాడు. ఒక స్కూల్లో పిల్లలకూ లాటిన్‌ భాషాబోధన చేస్తుంటాడు. ఆ బోధనలో మంచి గుర్తింపు కూడా తెచ్చుకుంటాడు. బడి యాజమాన్యం అతని లాటిన్‌ పిచ్చిని చక్కగా వినియోగించుకొని బాగా డబ్బుచేసు కొంటుంది. కానీ అతనికిచ్చింది, గౌరవించింది తక్కువ. ఎదుగూ బొదుగూ లేని జీవితంలో ఒంటరితనం, ఇంక వేరే ఏ వృత్తీ చేతకానితనం, అతన్ని సదా బాధిస్తుం టాయి. ఈలోగా నడి వయస్సు వచ్చేసింది. ఈ స్థితిలో ఆ టీచరు వద్దనే లాటిన్‌ నేర్చుకొంటున్న ఒక విద్యార్థి ఆ గురువుగారి పైన ఒక ప్రాక్టికల్‌ జోక్‌ చేస్తాడు. ఫలితంగా పిక్విడెంట్‌ లోకజ్ఞానం లేకా, అమాయకత్వం చేతా, ఒక సాదా సీదా లాండ్రీ నడిపే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. ఆ విద్యార్థి కూడా పై చదువుల కోసం దూరంగా వెళ్ళిపోతాడు. ఆమె ఆ లాటిన్‌ టీచరు పిక్వి డెంట్‌ చేత ఒక కిరాణా కొట్టు పెట్టిస్తుంది. ఆ కొట్టు దినదిన ప్రవర్ధమానమై ఆ దంపతులు బాగా డబ్బు కూడా సంపాదించుకుంటారు. కొద్ది సంవత్సరాల తరు వాత అదే విద్యార్థి తిరిగి వస్తాడు. కిరాణాకొట్టునడుపు తున్న ఒకనాటి తన విఖ్యాత లాటిన్‌ టీచరు పిక్విడెంట్‌ని చూస్తాడు. నిర్ఘాంతపోతాడు. వారి మధ్య సంభాషణ ఇలా సాగుతుంది: 

విద్యార్థి- సారూ! మీరు అంతగా ఇష్టపడి మధించిన లాటిన్‌ సంగతేమిటి?

టీచరు- అయ్యో అబ్బాయీ! లాటినా? లాటిన్‌ పొట్టపోషించుకోవడానికి పనికి రాదయ్యా!


ఇదీ ఫ్రాన్సు దేశానికి చెందిన మొపాసా కాలంనాటి లాటిన్‌ పరిస్థితి. గురజాడ కరటకశాస్త్రి శిష్యుడి చేత సంస్కృతం గురించి చెప్పించిన మాటా, మొపాసా కిరాణాకొట్టు పెట్టుకున్న టీచరు పిక్విడెంట్‌చేత లాటిన్‌ గురించి చెప్పించిన మాటా ఒకే అర్థాన్ని ధ్వనింపచేస్తున్నాయి. అలనాడు వెలిసి వర్ధిల్లిన రెండు ప్రాచీనభాషల ప్రాశస్త్యం ఇంచుమించుగా ఒకే కాలంనాటికి తగ్గుముఖం పట్టినట్లు స్పష్టమౌతున్నది. ఈ చారిత్రక సత్యాన్ని ఇద్దరు సమకాలికులైన ప్రసిద్ధ రచయి తల రాతల్లో ప్రతిబింబిస్తున్నది. ఈ సాదృశ్యం యాదృచ్ఛి కమే కానీ సర్వదా ఆసక్తిదాయకం. 

టి. షణ్ముఖ రావు, 99493 48238


Updated Date - 2020-12-14T06:36:01+05:30 IST