సంస్కృతంపై ముందుకే..

ABN , First Publish Date - 2021-08-06T08:48:08+05:30 IST

కాలేజీ స్థాయిలో రెండో భాషగా సంస్కృతాన్ని ప్రవేశపెట్టడానికే రాష్ట్ర ప్రభుత్వం మొగ్గు చూపిస్తున్నట్టు కనిపిస్తోంది.

సంస్కృతంపై  ముందుకే..

రెండో భాషగా అమలుకు రాష్ట్ర ప్రభుత్వం మొగ్గు

సంస్కృత అధ్యాపకుల పోస్టుల వివరాలు పంపండి

విద్యాశాఖ మెమో జారీ


హైదరాబాద్‌, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): కాలేజీ స్థాయిలో రెండో భాషగా సంస్కృతాన్ని ప్రవేశపెట్టడానికే రాష్ట్ర ప్రభుత్వం మొగ్గు చూపిస్తున్నట్టు కనిపిస్తోంది. దీనిపై గతంలో లెక్చరర్లు, ఇతర సంఘాల నుంచి వ్యతిరేకత వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఉన్నత విద్యా శాఖ తాజాగా జారీ చేసిన మెమోతో ఈ విషయంపై ప్రభుత్వ వైఖరి దాదాపు స్పష్టమైందని నిపుణులు అంటున్నారు. సంస్కృతాన్ని రెండో భాషగా ప్రవేశపెట్టడానికి వీలుగా అధ్యాపక పోస్టుల వివరాలను పంపించాలని సంబంధిత విభాగాలకు విద్యాశాఖ మెమో జారీ చేసింది. జూనియర్‌, డిగ్రీ కాలేజీలతోపాటు గురుకులాలు, ఇతర ప్రభుత్వ కళాశాలల్లో సంస్కృత అధ్యాపకుల ఖాళీల వివరాలను కూడా అందించాలని ఆయా విభాగాలను కోరారు.


ఈ మేరకు విద్యాశాఖ సంయుక్త కార్యదర్శి సుమలత మెమో జారీ చేశారు. ఈ నిర్ణయం ద్వారా సంస్కృతం అమలు దిశగానే ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు స్పష్టమవుతోంది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో రెండో భాషగా సంస్కృతాన్ని ప్రవేశపెట్టాలని ఇటీవల ఇంటర్‌ బోర్డు అధికారులు ఒక మెమోను జారీచేసిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయం పట్ల లెక్చరర్ల సంఘాలు, ఇతర వర్గాలు కూడా అభ్యంతరం వ్యక్తం చేశాయి. కాలేజీల్లో బోధనా సిబ్బంది కొరతను పట్టించుకోకుండా ఇంటర్‌ బోర్డు నిర్ణయం తీసుకోవడాన్ని వ్యతిరేకించాయి. అదనపు తరగతి గదులు, ఇతర సౌకర్యాలు సమకూర్చకుండా మెమో విడుదల చేయడంపై నిరసన తెలిపాయి. ఈ నేపథ్యంలోనే సంస్కృత అధ్యాపకుల ఖాళీల వివరాలను పంపాలని విద్యాశాఖ ఆయా విభాగాలను కోరింది. దీన్ని బట్టి సంస్కృతం అమలుకే ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. తాజా మెమోపై కూడా లెక్చరర్ల సంఘాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వం ఏకపక్షంగా ఇలాంటి కీలక నిర్ణయం తీసుకోవడం సరికాదని సంఘాలు అంటున్నాయి.

Updated Date - 2021-08-06T08:48:08+05:30 IST