Abn logo
Sep 9 2021 @ 00:20AM

పద్మవ్యూహంలో ఈటల

సం’కుల’ సమరం

ఎన్నికలు లేవని తేలినా ఆగని ప్రచారం

దూకుడు పెంచుతున్న టీఆర్‌ఎస్‌


(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌): టీఆర్‌ఎస్‌ అధినేత పన్నిన పద్యవ్యూహంలో ఈటల రాజేందర్‌ అభిమన్యుడు అవుతున్నాడా అంటే ఔననే సమాధానమే వినిపిస్తున్నది. నవంబరు వరకు ఎన్నికలు లేవని కేంద్ర ఎన్నికల సంఘం తేల్చేసినా టీఆర్‌ఎస్‌ రోజురోజుకూ ప్రచారంలో దూకుడు పెంచుతూ ముందుకు సాగుతున్నది. ప్రగతిభవన్‌ కేంద్రంగా కేసీఆర్‌ వేస్తున్న స్కెచ్‌లు, క్షేత్రస్థాయిలో హరీశ్‌రావు అమలు చేస్తున్న వ్యూహాలు టీఆర్‌ఎస్‌ గ్రాఫ్‌ను పెంచుతుంటే ఈటల రాజేందర్‌ ఏకాకి అవుతున్నారని ప్రచారం జరుగుతున్నది. తన శాసనసభ్యత్వానికి, టీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలో తేల్చుకుందామని టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌కు సవాల్‌ విసిరి వచ్చిన ఈటల రాజేందర్‌ వెంట ఆరోజు ఉన్న పార్టీ నేతలు ఇప్పుడు ఒక్కరొక్కరుగా జారుకుంటున్నారు.


టీఆర్‌ఎస్‌కు చెందిన మున్సిపల్‌ చైర్మన్లు, కౌన్సిలర్లు, మండల పరిషత్‌ అధ్యక్షులు, జడ్పీటీసీలు, సర్పంచులు, సహకార సంఘాల నేతలు, పార్టీలో వివిధ పదవుల్లో ఉన్న నేతలు ఈ రెండు నెలల్లో ఈటలను వీడి మళ్లీ టీఆర్‌ఎస్‌ నీడన చేరారు. ప్రజాబలం, ప్రజల సానుభూతి తనకే ఉందని ఈటల విశ్వసిస్తుండగా ఆ బలం, సానుభూతి ఓటుగా మారి పోలింగ్‌ బూత్‌కు వచ్చేలా చేసే శక్తి ఆయనవెంట లేకుండా చేసేందుకు టీఆర్‌ఎస్‌ స్కెచ్‌ వేసింది. ఈటల సామాజిక వర్గానికి చెందిన నేతలూ ఆయనను వీడుతున్నారు.


ఒక్కొక్కరుగా జారుకుంటున్ననేతలు

సొంత పార్టీ నేతలను కొంటున్న చరిత్ర టీఆర్‌ఎస్‌కే దక్కిందని ఈటల విమర్శిస్తున్నా మంత్రి హరీశ్‌రావు చేస్తున్న విస్తృత ప్రయత్నాలు నేతలను తిరిగి సొంత గూటికి చేరుస్తున్నాయి. టీఆర్‌ఎస్‌ నేతలనే కాకుండా ప్రస్తుతం ఈటల పోటీ చేస్తున్న బీజేపీ నేతలను కూడా ఆకర్షించేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఒక్కటొక్కటిగా ఫలించి ఇరు పార్టీల నుంచి నేతలు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారు. చివరికి ఈటల రాజేందర్‌ సొంత సామాజిక వర్గానికి చెందిన ముదిరాజ్‌ నేతలు కూడా ఆయనను వీడుతున్నారు. ఈటల మంత్రిగా ఉన్న కాలంలో ఆయన వెంట ఉంటూ వివిధ పదవులను నిర్వహించిన నేతలు ఆయనను వీడి బుధవారం టీఆర్‌ఎస్‌ గూటికి చేరారు.


ఉమ్మడి జిల్లాలో మత్స్య పారిశ్రామిక సంఘానికి అధ్యక్షుడిగా వ్యవహరించిన పోలు లక్ష్మణ్‌ సుమారు 1500 మందితో కలిసి బుధవారం మంత్రి హరీశ్‌రావు సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. జమ్మికుంట మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌, ప్రస్తుత జిల్లా కేంద్ర సహకార బ్యాంకు వైస్‌ చైర్మన్‌, గతంలో రెండుసార్లు విలాసాగర్‌  సర్పంచ్‌గా పనిచేసిన పింగిలి రమేశ్‌ మందీమార్బలంతో హరీశ్‌రావు సమక్షంలోనే జమ్మికుంటలో జరిగిన ఒక కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. వీణవంక ఎంపీటీసీ, మండలపరిషత్‌ ఉపాధ్యక్షురాలు రావిశెట్టి లతాశ్రీనివాస్‌ ఈటలను వీడి వారం క్రితం టీఆర్‌ఎస్‌లో చేరారు. వీరంతా ఈటల సొంత సామాజికవర్గమైన ముదిరాజ్‌ కులానికి చెందినవారు.


ఈటల వెంట ఉంటూ ప్రజాప్రతినిధులుగా ఆ సామాజికవర్గంలో కొంత పేరు సంపాదించుకున్న వీరు ఇంతకాలం ఈటలకు అండగా ఉంటూ వచ్చి ప్రస్తుతం అధికార పార్టీ చెంతన చేరడాన్ని ప్రజలు చర్చించుకుంటున్నారు. సొంత సామాజికవర్గానికి చెందిన నేతలను ఈటల వెంట లేకుండా చూసి ఆయనను నైతికంగా బలహీనుడిగా మార్చేందుకు హరీశ్‌రావు పన్నిన వ్యూహంలో భాగంగానే ఈ వ్యవహారమంతా నడుస్తున్నదని అనుకుంటున్నారు. నియోజకవర్గంలో ముదిరాజ్‌ల ఓట్లు 23,200 ఉండగా ఆ ఓటు బ్యాంకులో చీలిక తీసుకురావడానికి వీరి చేరిక తోడ్పడుతుందని అంచనా వేస్తున్నారు. 


కులాల వారీగా సమావేశాలు

హుజూరాబాద్‌ ఎన్నిక ఇప్పటికే సంకుల సమరంగా మారింది. నియోజకవర్గంలో 2,26,553 ఓట్లు ఉండగా వీటిలో 46,700 ఓట్లు దళిత సామాజికవర్గానికి చెందినవి కావడం గమనార్హం. ఈ ఓటర్లందరికి చెందిన సుమారు 23 వేల కుటుంబాలకు దళితబంధు పథకం కింద పదేసి లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందుతున్నది. వీరిలో ఇప్పటికే సగం మంది ఖాతాల్లో ఆ డబ్బు జమ అయింది. దళిత సామాజికవర్గ ఓట్లపై దళితబంధు పథకం తప్పకుండా ప్రభావం చూపిస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. రెడ్డి, కాపు, వైశ్య, యాదవ, పద్మశాలి, గొల్ల, గౌడ కులాలవారీగా సమావేశాలు ఏర్పాటు చేసి ఆ కుల సంఘాలకు చెందిన నాయకులతో చర్చించి వారికి అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేసేందుకు టీఆర్‌ఎస్‌ ప్రయత్నిస్తున్నది. ఇప్పటికే వైశ్య, కాపు, రెడ్డి, యాదవ, ముదిరాజ్‌, పద్మశాలి కుల సంఘాలకు భవన నిర్మాణాల కోసం స్థలం కేటాయించడంతోపాటు ఒక్కో సంఘ భవనానికి 50 లక్షల నుంచి కోటి రూపాయల మేరకు నిధులు మంజూరు చేసి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఈటల స్వంత సామాజికవర్గంపై దృష్టిసారించి ముదిరాజ్‌లను కూడా ఆయనకు దూరం చేసే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ప్రధానంగా ఆయనవెంట ఉన్న నేతలే ఆయనను వీడడం ఇప్పుడు నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. ఈటల పక్షాన ఇంటింటికి వెళ్లి ఓటు అడగడానికి, వారిని పోలింగ్‌ బూత్‌కు తీసుకువచ్చి ఓటు వేయించడానికి నాయకులు లేని పరిస్థితి నెలకొంటున్నది.


అధికార పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ ఇందుకు బాటలు వేస్తున్నదని అనుకుంటున్నారు. ఎన్నికలు ఇప్పట్లో లేవని తేలినా మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్‌, కొప్పుల ఈశ్వర్‌ తమ పర్యటనలను యథావిధిగా కొనసాగిస్తూ ఈ పట్టును మరింతగా బిగించే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి కౌంటర్‌గా ఈటల రాజేందర్‌, బీజేపీ రాష్ట్రనాయకత్వం ఏ రకమైన ప్రయత్నాలు చేస్తుందో, టీఆర్‌ఎస్‌ ఎత్తుగడలను ఎలా తిప్పి కొడుతుందోనన్నది ఆసక్తికరమైన చర్చనీయాంశంగా మారింది.