Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Fri, 14 Jan 2022 23:28:54 IST

సంక్రాంతి లక్ష్మికి స్వాగతం!

twitter-iconwatsapp-iconfb-icon
సంక్రాంతి లక్ష్మికి స్వాగతం!

మన సంప్రదాయంలో ప్రతి ఆచారం, సంప్రదాయం వెనుక భౌతికం, మానసికం, ఆధ్యాత్మికం అనే మూడు ప్రయోజనాలు ఇమిడి ఉన్నాయి. సంక్రాంతి అంటే పిండివంటలు చేసుకోవడం, దేవాలయాలకు వెళ్లి దండం పెట్టుకోవడమే కాదు. మన పెద్దలు అనుసరించే సంప్రదాయాల వెనకున్న మర్మం ఏమిటి? వాటి నుంచి మనమేం నేర్చుకోవాలి? వాటిని శాస్త్రీయంగా ఎలా అర్థం చేసుకోవాలి అనేది తెలుసుకోవడం అవసరం. 


ఇంటి ముందు లోగిళ్లలో ఒక పెద్ద రథం ముగ్గో, నక్షత్రం ముగ్గో వేస్తే చాలు. గంటసేపు వ్యాయామం చేసిన శ్రమకు సమానం. ముగ్గు వేయడం అంటే.. బోలెడన్ని చుక్కలు పెట్టాలి. వాటన్నిటినీ కలుపుతూ గీతలు గీయాలి. ఒక ఆకారాన్ని తీసుకురావాలి. ఆ క్రమంలో లెక్కపెట్టుకోలేనన్నిసార్లు కదలాల్సి వస్తుంది. పైటచెంగును సరి చేసుకుంటూ, జడను వెనక్కు వేసుకుంటూనే ముగ్గు మీద బోలెడంత ఏకాగ్రతను సంధించాలి. ముగ్గు మనసుకు, శరీరానికి ఓర్పును, నేర్పును అందించే సమస్యాపూరణం లాంటిది. ముగ్గులు మనకో తాత్విక దృక్పథాన్ని తెలియజేస్తాయి.


గంగిరెద్దులు...  హరిదాసులు... భిక్షానికీ ఓ ధర్మం...

గంగిరెద్దుల వాడైనా, హరిదాసైనా ఏదో ఒక మంచి విషయాన్ని చెప్పే బిచ్చమెత్తుకుంటారు. గంగిరెద్దుల వాడైతే ఇల్లు కలవాళ్లు ఏదిచ్చినా గంగిరెద్దు మీదే వేస్తాడు తప్ప చేతికి తీసుకోడు. హరిదాసు కూడా ఏడాదికి ఒకసారే వచ్చి హరినామ సంకీర్తనలు పాడి.. గిన్నెడు బియ్యం తీసుకుని సంతృప్తిగా ఇంటికెళ్లిపోతాడు. పండగ పోయాక మళ్లీ ఏ వీధిలోనూ కనిపించడు.


అసహ్యం నుంచి అద్భుతాల గొబ్బెమ్మ

కృష్ణ భక్తురాలైన గోపెమ్మ అనే పేరు నుంచి పుట్టిందే గొబ్బెమ్మ. ఈ భూమ్మీదున్న దేన్నీ అసహ్యించుకోకూడదు. ప్రతిదీ ప్రకృతి ప్రసాదితం. పేడను అద్భుతంగా మలిస్తే అది గొబ్బెమ్మ అవుతుంది.

 

జీవితం దారం వంటిదని చెప్పే పతంగం

మనిషికి ఆత్మనిగ్రహం లేకపోతే జీవితంలో ఎన్నో సమస్యల్ని కొని తెచ్చుకోవాల్సి వస్తుంది. సన్నని దారంతో ఆకాశంలో ఎగిరే గాలిపటాన్ని అదుపులో పెట్టగలిగినట్లు.. మనల్ని మనం అదుపులో పెట్టుకోవాలని చెబుతుంది గాలిపటం. లాగితే తెగిపోతుంది. వదలకుంటే ఎగరలేదు. రెండింటినీ సమన్వయం చేసుకుంటూ ఆడిస్తేనే గాలిపటమైనా, జీవితమైనా! 


కోడిపందేలు యుద్ధనీతిని  గెలిపించే పందెం

పండగ పరమార్థాన్ని మరిచిపోయి దాన్ని పరహింసగా మార్చాం. నేడు జరుగుతున్న కోడిపందేలే అందుకు నిదర్శనం. కోడిపందేలకు తరాల చరిత్ర ఉంది. కాని ఆ రోజుల్లో కోళ్లకు కత్తులు కట్టి ఆనందించేవారు కాదు. ఇప్పుడు కత్తులు కట్టి, డబ్బు కట్టలు పెట్టి జూదంగా మార్చేశారు. పాతరోజుల్లో ఇద్దరి మధ్య వైరం ఏర్పడితే దాన్ని కోడిపందెం ద్వారా పరిష్కరించేవారు మధ్యవర్తులు. పల్నాటి కాలంలో మాచర్ల, గురజాల మధ్య గొడవ యుద్ధానికి దారితీసింది. అలాంటి సమస్యను కోడిపందెమే పరిష్కరించింది. యుద్ధనీతిని తెలియజేసింది.


పశు పూజలు...  శ్రమకు కృతజ్ఞత చెల్లింపులు

సంక్రాంతికి ఇంటినిండా ధాన్యం వచ్చిందంటే.. అది పశువుల పుణ్యం. ఏడాది పొడవునా పశువులతో చాకిరీ చేయించడమే కాదు. పండగరోజైనా వాటిని పూజించి కృతజ్ఞత చెప్పుకోవాలంటుంది పశువుల పూజ. ఆ రోజు రైతులు నాగలి కట్టరు. ఎద్దుల మీద కాడి మోపరు. బండ్లు తోలరు. అందుకే ’కనుమ రోజు కాకైనా కదలదు‘ అంటారు. కనుమును పశువుల పండుగ అంటారు. ఈ రోజున పితృదేవతలకు తర్పణాలు వదులుతారు. 

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.