సంక్రాంతి సంబరాలు

ABN , First Publish Date - 2022-01-17T05:47:42+05:30 IST

జిల్లా వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు శనివారం ఘనంగా జరిగాయి.

సంక్రాంతి సంబరాలు
రామేశ్వరాలయంలో గోదాదేవి కల్యాణం నిర్వహిస్తున్న అర్చకులు

- ఘనంగా కనుమ

కరీంనగర్‌ కల్చరల్‌, జనవరి 16: జిల్లా వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు శనివారం ఘనంగా జరిగాయి.  కరోనా, ఒమైక్రాన్‌ తీవ్రత దృష్ట్యా జనం భయంతో ఇళ్లకే పరిమితమయ్యారు. సంక్రాంతి రోజు ఉదయమే తలంటు స్నానాలాచరించి నూతన వస్త్రాలు ధరించి దైవ సందర్శనం చేశారు. గురువులు, పెద్దల ఆశీస్సులు తీసుకున్నారు. మహిళలు, యువతులు, చిన్నారులు విభిన్న ముగ్గులతో వాకిళ్లను అలంకరించారు. పిండి వంటలతో పాటు విందులు వినోదాల్లో మునిగి తేలారు. ముత్తైదువలు, యువతులు నోములు పంచుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పెద్ద వారినుంచి ఆశీస్సులు పొందారు. జిల్లాలోని అన్ని మండలాలు, గ్రామాలు పండుగ సందడితో కళకళలాడాయి. నగరవాసులు స్వగ్రామాలకు తరలి వెళ్లగా వీధులన్నీ బోసిపోయి కన్పించాయి. దుకాణాలు కూడా తెరుచుకోలేదు. చిన్నారులు, యువత భవనాలపైకి ఎక్కి, మైదానాలు, పార్కుల్లో చేరి పోటీతత్వంతో విభిన్నమైన గాలిపటాలెగరేస్తూ ఆనందంగా గడిపారు. 

ఆదివారం రైతుల ప్రత్యేక పండుగ కనుమను ఘనంగా జరుపుకున్నారు. గ్రామాల్లో రైతులు పశువులను అలంకరించి పొలాల వద్ద పూజలు చేశారు. ధాన్యపు రాశులను ఇంటికి తీసుక వచ్చి కొత్త అల్లుళ్ళు, మిత్రులు, బంధువులతో సందడిగా గడిపారు. ఆలయాల్లో అర్చనలు జరిపి సంవత్సరమంతా సుఖశాంతులతో సంతోషంగా గడవాలని ఆకాంక్షించారు. కొందరు ఇళ్లలో బొమ్మల కొలువులు ఏర్పాటు చేసి మిత్రులు, బంధువులను, పిల్లలను ఆహ్వానించి వేడుక జరిపారు.

ఫ గిద్దెపెరుమాళ్ల ఆలయంలో...

కోతిరాంపూర్‌లోని గిద్దెపెరుమాళ్ల ఆలయంలో సంక్రాంతి, కనుమ వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. టీఆర్‌ఎస్‌ నాయకుడు, ఆలయ సేవకుడు కలర్‌ సత్తన్నతో పాటు కార్పొరేటర్లు నేతికుంట యాదయ్య, మర్రి భావనాసతీశ్‌, ఈవో ఎండపెల్లి మారుతి, భక్తులు పాల్గొన్నారు. 

ఫ వేంకటేశ్వర స్వామి ఆలయంలో....

మార్కెట్‌రోడ్‌ వేంకటేశ్వరస్వామి ఆలయంలో అర్చకులు చెన్నోజ్వల నాగరాజాచార్యులు, చక్రవర్తుల లక్ష్మీనారాయణాచార్యుల ఆధ్వర్యంలో కూడారై నోము నిర్వహించారు. పలువురు మహిళలు పాల్గొని నోములు పంచుకొని దీపారాధనలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.

Updated Date - 2022-01-17T05:47:42+05:30 IST