సంక్రాంతి సంబరాలు

ABN , First Publish Date - 2022-01-17T05:04:52+05:30 IST

జిల్లా వ్యాప్తంగా సంక్రాంతి, కనుమ పండుగలను ప్రజలు శని, ఆది వారాల్లో ఘనంగా జరుపుకున్నారు. ప్రజలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు, మహిళలు వివిధ రకాల నోములు, వ్రతాలను ఆచరించి సంక్రాంతి పండుగను జరుపుకున్నారు.

సంక్రాంతి సంబరాలు
మంథనిలో సామూహిక కలియుగ వైకుంఠ నోములో పాల్గొన్న మహిళలు

- ఘనంగా కనుమ
- ఆలయాల్లో భక్తుల పూజలు, మహిళల నోములు, వ్రతాలు

మంథని, జనవరి 16: జిల్లా వ్యాప్తంగా సంక్రాంతి, కనుమ పండుగలను ప్రజలు శని, ఆది వారాల్లో ఘనంగా జరుపుకున్నారు. ప్రజలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు, మహిళలు వివిధ రకాల నోములు, వ్రతాలను ఆచరించి సంక్రాంతి పండుగను జరుపుకున్నారు. మహిళలు ఇళ్ల ముందు రంగు వల్లలు తీర్చి దిద్దారు. గొబ్బమ్మలు పెట్టి వేడుకలు నిర్వహించారు. ప్రజలు వివిధ రకాల పిండి వంటలతో సంక్రాంతిని ఘనంగా నిర్వహించుకున్నారు. చిన్న పిల్లలు, యువకులు, యువతులు పతంగులను ఎగురవేస్తూ సంబరాలు జరుపుకున్నారు. కనుమ నోము వాయినాలను మహిళలు, చిన్నారులకు ఇచ్చి వైభవంగా జరుపుకున్నారు. మకర సంక్రాంతి పండుగ సందర్భంగా స్థానిక శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక శ్రీలక్ష్మినారాయణస్వామి ఆలయంలో రేపాల ఉమాదేవీ-రమేష్‌, వొడ్నాల ప్రవళిక-శ్రీనివాస్‌, రాచర్ల తిరుమల-నాగరాజు, రేపాల నిర్మల -నాగన్నలు సామూహికంగా కలియుగ వైకుంఠ నోమును వేద పండితులు అవధానుల శ్రీకాంత్‌శర్మ ఆధ్వర్యంలో నోచుకున్నారు. అనంతరం మహిళా భక్తులకు వాయినాలు ఇచ్చి ఆశీర్వచనం తీసుకున్నారు. కలియుగ వైకుంఠ నోముతో ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. మంథని మున్సిపల్‌ పరిధిలోని గంగాపురిలో నిర్వహించిన బోయినిపేటలోని శ్రీలక్ష్మిదేవర బోనాల వేడుకల్లో మంథని మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ పుట్ట శైలజ, బీజేపీ రాష్ట్ర నేత చంద్రుపట్ల సునీల్‌రెడ్డి వేర్వురుగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.  పట్టణంలోని రావుల చెరువుకట్టలోని హనుమాన్‌ ఆలయంలో, శ్రీ అయ్యప్ప ఆలయంలో ఘనంగా మెట్ల పూజ కార్యక్రమాన్ని దీక్షా పరులు, భక్తులు నిర్వహించారు. అలాగే పట్టణంలోని బోయినిపేటలో ముదిరాజ్‌లు లక్ష్మిదేవర జాతరను శనివారం వైభవంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో ముదిరాజ్‌ కులస్థులు లక్ష్మిదేవరకు బోనాలను సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. డప్పు చప్పుళ్లతో మహిళలు బోనాలతో ఆలయ ప్రదక్షణలు చేసి నైవేద్యం సమర్పించడం, లక్ష్మిదేవర ఈర కోలాటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈకార్యక్రమంలో ముదిరాజ్‌ సంఘం నేతలు పోతరవేని క్రాంతకుమార్‌, కిరణ్‌, అట్టెం రాజు తదితరులు పాల్గొన్నారు.
కళ్యాణ్‌నగర్‌/మార్కండేయకాలనీ:  రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో మూడు రోజుల పండుగ సంక్రాంతిని సంబరంగా జరుపుకున్నారు. శుక్రవారం భోగి జరుపుకోగా శనివారం సంక్రాంతి, ఆదివారం కనుమ జరుపుకున్నారు. వేకువజూమునే మహిళలు, యువతులు ఇళ్ల ముందు రంగురంగుల అందమైన ముగ్గులు వేసి ఆవుపేడతో చేసిన గొబ్బెమ్మలను ముగ్గుల్లో పెట్టి పూలు, ధాన్యాలు వేసి అలంకరించారు. ఎక్కడ చూసినా పల్లె వాతావరణం తలపించింది. ఇళ్లలో పిండివంటలు చేసుకున్నారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. గంగిరెద్దుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. చిన్న పెద్ద తేడా లేకుండా ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. గాలిపటాలను ఎగురవేసి సందడి చేశారు. సామూహికంగా నోములు నోచుకున్నారు. కళ్యాణ్‌నగర్‌లోని వ్యాపార కూడలిలో జరిగిన నోముల్లో పాలకుర్తి జడ్పీటీసీ కందుల సంధ్యారాణి పాల్గొని సంక్రాంతి నోములు, వాయినం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ధాన్యం, గోవులు, కంచు, బంగారం లాంటివి దానం చేయడం వల్ల పుణ్యం కలుగుతుందని, అవి దానం చేసే శక్తి లేని  వారు నువ్వులు, నెయ్యి, వస్త్రాలు, ఫలాలు దానం చేయడం వల్ల పుణ్యం దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో భవాని, మమత, రేణుక పాల్గొన్నారు.
సుల్తానాబాద్‌: సంక్రాంతి పండుగు ను ప్రజలు అత్యంత భక్తి శ్రద్దలతో జరుపుకున్నారు తెల్లవారుఝామున నుంచే మహిళలు ఇళ్ల ముందు అందమైన ముగ్గులు వేశారు. పట్టణానికి చెందిన నీతూ ప్రసాద్‌ అనే ప్రైవేట్‌ ఆద్యాపకురాలు మాత్రం తన ఇంటి ముందు వినూత్న రీతిలో రైతులకు సంబందించిన ముగ్గును వేసి ఆకట్టుకున్నారు.
జూలపల్లి: మండలంలోని అన్ని గ్రామాల్లోను సంక్రాంతి పర్వదినవేడుకలను ప్రజలు సంతోషంగా జరుపుకున్నారు. చిన్నారులు గాలి పటాలను ఎగరేస్తూ సందడి చేసారు. మండలంలోని తెలుకుంట గ్రామంలో జడ్పీటీసీ బొద్దుల లక్ష్మినర్సయ్య మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులను అందజేశారు.

Updated Date - 2022-01-17T05:04:52+05:30 IST