జిల్లాలో అంబరాన్నంటిన సంక్రాంతి సంబురాలు

ABN , First Publish Date - 2022-01-15T06:33:36+05:30 IST

మకర సంక్రాంతి పర్వదినం పురస్కరించుకొని మూడు రోజుల పండుగలో భాగంగా మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తన నివాసంలో తొలిరోజు భోగిని శుక్రవారం కుటుంబసభ్యులతో కలిసి జరుపుకున్నారు.

జిల్లాలో అంబరాన్నంటిన సంక్రాంతి సంబురాలు
జిల్లా కేంద్రంలోని సునందిని అపార్ట్‌మెంట్‌లో భోగి సంబురాలు

జిల్లా అంతటా సంక్రాంతి సంబురాలు అంబరాన్ని అంటాయి. ఘనంగా భోగివేడుకలను జరుపుకున్నారు. ఉదయాన్నే భోగి మంటలను వేశారు. నువ్వులపిండితో స్నానాలు చేసి, వాకిళ్లలో రంగవల్లులద్దారు. ఇంటి ద్వారాలకు మంగళతోరణాలు కట్టారు.  చిన్నారులను వాకిళ్లలో కూర్చోబెట్టి భోగిపండ్లను పోశారు. అనంతరం చిన్నాపెద్దా కలిసి గాలిపటాలను ఎగురవేశారు. 

నిర్మల్‌ కల్చరల్‌, జనవరి 14 : మకర సంక్రాంతి పర్వదినం పురస్కరించుకొని మూడు రోజుల పండుగలో భాగంగా మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తన నివాసంలో తొలిరోజు భోగిని శుక్రవారం కుటుంబసభ్యులతో కలిసి జరుపుకున్నారు. సంబురా ల్లో గంగిరెద్దులు చేసిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. తెలంగాణ సంస్కృతి సంప్ర దాయాలకు అద్దంపట్టే సంక్రాంతి వేడుకల్లో కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మున్సిపల్‌ చైర్మన్‌ జి.ఈశ్వర్‌, ఎంపీపీ రామేశ్వర్‌రెడ్డితో పాటు పలువురు కౌన్సి లర్లు, నాయకులు హాజరయ్యారు. అలాగే పట్టణంలోని అపార్ట్‌మెంట్‌లలోనూ పండుగసందడి నెలకొంది. ఆదర్శ్‌నగర్‌ కాలనీలోని జేబీ సునందిని అపార్ట్‌మెంట్‌లో మహిళలు, చిన్నారులు భోగిమంటలు వేశారు. అంతా మూకుమ్మడిగా భోగి, సంక్రాంతి పండుగలను ఆనందంగా జరుపుకున్నారు. ఈ సంబురాల్లో అపార్ట్‌మెంట్‌ వాసులు పెద్దసంఖ్యలో పాల్గొని.. సందడి చేశారు.

కుంటాల : సంక్రాంతి పండుగను ప్రజలు ఘనంగా నిర్వహించుకున్నారు. మహిళలు ఉదయాన్నే ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు వేశారు. ముగ్గుల మధ్యలో గొబ్బిమ్మలను ఉంచారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం నోములను పంచుకున్నారు. సంక్రాంతిని పురష్కరించుకొని మండల కేంద్రంలోని ప్రాచీన శ్రీకృష్ణ ఆలయంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. మండలంలోని ఓల గ్రామంలో నిర్వహించిన కబడ్డి పోటీల్లో యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఖానాపూర్‌ రూరల్‌ : ఖానాపూర్‌ మండలంలోని గోసంపల్లె, పాత ఎల్లాపూర్‌, దిలావర్‌పూర్‌, బావాపూర్‌ (కె), సోమారిపేట్‌, బీర్నంది, సత్తనపెల్లి, తర్లపాడ్‌, రాజూర, సింగాపూర్‌, సుర్జాపూర్‌, బాధనకుర్తి, మస్కాపూర్‌ గ్రామాల్లో శుక్రవారం బోగి పర్వదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. చిన్నారులకు రేగుపళ్లు, నవధాన్యాలు పోసి ఆయురారోగ్యాలతో ఉండాలని పూజలు చేసారు. బోగి మంట లు వేసుకున్నారు. పల్లెల్లో గంగిరెద్దుల సందడి నెలకొంది. ఉదయమే మహిళలు తమ ఇంటి ముందర కల్లాపి చల్లి ముగ్గులు వేసారు. పిల్లలు పతంగుల ఎగుర వేసి సందడి చేసారు. ఈ సందర్బంగా ఆలయాలకు వెళ్లి ప్రత్యేకపూజలు చేసారు. 

ముథోల్‌ : మండల కేంద్రమైన ముథోల్‌తో పాటు మండలంలోని ఆయా గ్రామాల్లో శుక్రవారం బోగి వేడుకలను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా మహిళలు రంగు రంగుల రంగవళ్లులు వేసి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. అలాగే వేకువజామున భోగి మంటలు వేశారు. కుటుంబ సభ్యులందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని పాడిపంటలు సమృద్దిగా పండాల ని పూజలు చేశారు. గాలిపటాలు ఎగురవేయడంలో చిన్న పెద్దలు పాల్గొన్నారు. సాయంత్రం వేళల్లో చిన్న పిల్లలకు బోగిపళ్లు పోశారు. ఈ వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. 

Updated Date - 2022-01-15T06:33:36+05:30 IST