కన్నుల పండువగా సంక్రాంతి

ABN , First Publish Date - 2021-01-16T05:53:51+05:30 IST

అటు కరోనా భయం.. ఇటు అధిక ధరల భారం. కొంచెం కష్టంగా ఉన్నా జిల్లావాసులు ఉన్నంతలో ఇష్టంగా సంక్రాంతి సంబరాలు చేసుకున్నారు. గంగిరెద్దుల ఆటలు లేకపోయినా రంగవల్లులు వెల్లివిరిశాయి. అక్కడక్కడా గొబ్బెమ్మలు ఉంచారు.

కన్నుల పండువగా సంక్రాంతి
చిన్నమండెంలో చిట్లాకుప్పకు నిప్పు అంటించి పశువులను బెదిరిస్తున్న దృశ్యం

కనుమ రోజున గోపూజ

సంప్రదాయ దుస్తుల్లో పోలీసులు

శిల్పారామంలో చిన్నారుల పతంగుల సందడి

పల్లెల్లో కాటమరాజు వద్ద సంబరాలు

పలుచోట్ల ఆలయాల్లో గోపూజలు


సంక్రాంతి అంటేనే సంబరాల పండుగ. అలాంటి పండుగ కరోనా కారణంగా కళ తప్పుతుందనుకున్నారు. అయితే ఆర్భాటం కాసింత తగ్గినా ఆనందం మాత్రం వంద శాతం అనుభవించారు. అయినవారికి విందులు ఏర్పాటు చేశారు. భోగి మంటల వెలుగులు, రంగుల హరివిల్లుల్లా రంగవల్లులు, గోపూజలు, చిట్లాకుప్పల వెలుగులతో సంక్రాంతి కన్నులపండువగా సాగింది.


కడప (సిటి), జనవరి 15 : అటు కరోనా భయం.. ఇటు అధిక ధరల భారం. కొంచెం కష్టంగా ఉన్నా జిల్లావాసులు ఉన్నంతలో ఇష్టంగా సంక్రాంతి సంబరాలు చేసుకున్నారు. గంగిరెద్దుల ఆటలు లేకపోయినా రంగవల్లులు వెల్లివిరిశాయి. అక్కడక్కడా గొబ్బెమ్మలు ఉంచారు. కొన్నిచోట్ల యువతుల గొబ్బెమ్మ పాటలు వినిపించాయి. నృత్యాలు క నువిందు చేశాయి. నిత్యావసర ధరలు మండిపోతున్నా వంటకాల పరిమాణం తగ్గించుకుని ఉన్నంత వరకూ తృప్తిగా ఆరగించారు. పొరుగు రాసా్ట్రల్లో ఉంటున్న విద్యార్థులు, ఉద్యోగులు సొంతూర్లకు చేరుకోగానే  అప్పటివరకు వారు పడ్డ వ్యయ ప్రయాసాలను మరిచి సంక్రాంతి సంబరాల్లో మునిగిపోయారు. జిల్లా పోలీసు అధికారి నుంచి కానిస్టేబులు వరకూ సంప్రదాయ దుస్తుల్లో కనిపించి అందరినీ కనువిందు చేశారు. 


గోపూజ చేసిన ఉప ముఖ్యమంత్రి

కనుమ సందర్భంగా శుక్రవారం కడప నగరంలోని మృత్యుంజయేశ్వరాలయంలో ఉప ముఖ్యమంత్రి అంజద్‌బాషా సంప్రదాయ దుస్తులు ధరించి గోపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. సంప్రదాయాలు కనుమరుగు కాకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం గోమాత పూజా కార్యక్రమం నిర్వహించిందన్నారు. ఈ కార్యక్మంలో మాజీ మేయర్‌ సురేష్‌బాబు, ఆలయ ఛైర్మన నాగేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సంక్రాంతి సందర్భంగా కనుమరోజైన శుక్రవారం జిల్లాలోని ఆలయాల్లో దేవదాయ శాఖ ఆదేశాల మేరకు గోపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. కొన్ని చోట్ల స్వామి, అమ్మవార్లకు పార్వేట ఉత్సవం వేడుకగా జరిగింది.


శిల్పారామంలో చిన్నారుల సందడి

సంక్రాంతి నేపధ్యంలో శుక్రవారం సాయంత్రం శిల్పారామానికి సందర్శకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. శిల్పారామం పరిపాలనాధికారి పర్యవేక్షణలో పర్యాటకులకు సందర్శకులకు మరిన్ని వసతులను కల్పించారు. గాలిపటాలు ఉచితంగా పంపిణీ చేశారు. చిన్నారులు గాలిపటాలు ఎగురవేస్తూ సందడి చేశారు. వారిని పెద్దలు ఉత్తేజపరుస్తూ గంతులు వేస్తుండడంతో శిల్పారామం సంక్రాంతి సందడిని నింపుకుంది. 


చిట్లాకుప్పల వద్ద సందడి

మూడు రోజుల సంక్రాంతి పండుగలో ముఖ్యమైనది కనుమ. దీనికే పశువుల పండగని కూడా పేరు. సంవత్సరం పాటు పొలాల్లో పనిచేసి పంటలు ఇంటికి వచ్చేవరకు కష్టంలో పాలు పంచుకున్న పశువులను గౌరవించుకోవడం ఈ పండగ ప్రత్యేకత. పల్లెల్లో ఈ పండుగను ఘనంగా చేస్తారు. ముఖ్యంగా రాజంపేట రెవెన్యూ డివిజనలో కనుమ పండుగను బాగా చేస్తారు. ప్రస్తుతం పశువులు తగ్గినా.. ఉన్నవాటికి పొద్దున్నే చెరువులు, కాలువల్లో స్నానం చేపించి, కొమ్ములకు కుప్పెలు చెక్కి, రంగురంగుల బూరలు కట్టి, నడుముకు మువ్వల పట్టిలు చుట్టారు. వీటిని తీసుకుని సాయంత్రం ఊరు ముందున్న కాటమరాజు వద్దకు మేళతాళాలతో చేరుకున్నారు. కొత్త బియ్యం, కొత్త బెల్లంతో పొంగలిచేసి అందరికీ పంచారు. ముందే ఏర్పాటు చేసిన చిట్లాకుప్పను చీకటిపడే సమయంలో వెలిగించి దాని చుట్టూ పశువులను తిప్పి ఊర్లకు చేరుకున్నారు. ఈ సందర్భగా ఊర్లకు ఊర్లు చిట్లాకుప్పల వద్దకు చేరుకుని సందడి చేశాయి.



Updated Date - 2021-01-16T05:53:51+05:30 IST