పందెం బరిలో..

ABN , First Publish Date - 2022-01-17T06:47:54+05:30 IST

నగరాల నుంచి తరలివచ్చిన బంధుమిత్రులతో పల్లె లోగిళ్లు కళకళలాడగా, పందేల కోసమే వచ్చిన జనంతో శివారు ప్రాంతాల్లో బరులు కిక్కిరిశాయి.

పందెం బరిలో..

మూడు రోజుల్లో చేతులు మారిన సొమ్ము రూ.180కోట్లు

కోడి పందేలకు తోడు పేకాట, గుండాటలు

మహిళల కోసం ప్రత్యేకంగా పేకాట శిబిరాలు

రాజకీయాలను మరిచిన వైసీపీ, టీడీపీ నేతలు

శిబిరాల ఏర్పాటుకు పరస్పర సహకారం

తెలంగాణ నుంచి భారీగా రాక

గుడివాడలో గోవా సంస్కృతి

మంత్రి కన్వెన్షన్‌ హాల్లో క్యాసినో

ఆటగాళ్లకు వినోదంగా చీర్‌ గర్ల్స్‌

ఈడుపుగల్లులో సరసాల భవనం


నగరాల నుంచి తరలివచ్చిన బంధుమిత్రులతో పల్లె లోగిళ్లు కళకళలాడగా, పందేల కోసమే వచ్చిన జనంతో శివారు ప్రాంతాల్లో బరులు కిక్కిరిశాయి. నగరం.. పల్లె తేడా లేదు. ఎక్కడ ‘బరి’ గీస్తే అక్కడికి కారులు బారులు తీరాయి.. సంక్రాంతి ముసుగులో జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పోటాపోటీగా కోడిపందేలు, పేకాట, గుండాటలను నిర్వహించారు. జూదం విచ్చలవిడిగా సాగింది. రాజకీయాలను తాత్కాలికంగా పక్కనపెట్టి, అధికార, ప్రతిపక్ష నేతలు పోటాపోటీగా శిబిరాలను ఏర్పాటు చేసుకున్నారు. రెండు పార్టీల నేతలూ దోస్తీలు కట్టి ఈ జూద క్రీడలను నిర్వహించారు. గుడివాడలో గోవా సంస్కృతికి తెర తీశారు. క్యాసినో ఆడేవారికి ఆహ్లాదాన్ని పంచేందుకు చీర్‌ గర్ల్స్‌తో ప్రదర్శనలు చేయించారు. ఈడుపుగల్లులో సరసాల వేదికను ఏర్పాటు చేసి విచ్చలవిడితనానికి కొత్త దారులను తెరిచారు.


(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : జిల్లాలో కోడిపందేలు, పేకాట, గుండాటల మీద మూడు రోజుల్లో రూ.180 కోట్లు చేతులు మారినట్టు తెలుస్తోంది. ఒక్క భోగి రోజునే రూ.10కోట్ల పందేలు నిర్వహించారు. తొలిరోజు వేలల్లో మొదలైన పందేలు సంక్రాంతి రోజు లక్షల్లోకి వెళ్లాయి. ఒక్కో పందెం రూ.లక్ష నుంచి ఆరంభమయ్యాయి. గుడివాడలో జరిగిన కోడిపందేల్లో అధిక మొత్తంలో బెట్టింగ్‌ జరిగింది. ఇక్కడ ఒక్కో బరిలో రూ.80లక్షల నుంచి పందేలు ప్రారంభించారు. సంక్రాంతి రోజు రూ.8లక్షల నుంచి మొదలైన పందేలు కనుమ రోజు ఏకంగా రూ.80లక్షలకు వెళ్లడం గమనార్హం. జిల్లా అంతటా కోడి పందేలు జోరుగా సాగినా, గుడివాడ, గన్నవరం నియోజకవర్గాల్లో హైటెక్‌ హంగులతో సంక్రాంతి ముసుగులో జూద క్రీడలను విచ్చలవిడిగా నిర్వహించారు. విజయవాడకు చెంతనే ఉన్న ఈడుపుగల్లు, ఉప్పులూరు, నున్న, అజిత్‌సింగ్‌ నగర్‌, ఇబ్రహీంపట్నంలలో భారీగా బరులు వెలిశాయి. జిల్లాలో ఈసారి కొత్తగా ముసుగు పందేలను నిర్వహించారు. బరిలో రెండు పుంజులు దిగిన తర్వాత ఒక పుంజు మాత్రమే గెలుస్తుంది. ఇక్కడితో పందెం పూర్తయినట్టు కాదు. రెండు పుంజుల యజమానులు వెంటనే మరో రెండు పుంజులను బరిలోకి దింపాల్సి ఉంటుంది. ఇలా ఒక్కో పందెంపై రూ.5 - 10లక్షల వరకు బెట్టింగ్‌లు పెట్టారు. జిల్లాలో నిర్వహించిన బరుల వద్ద యువతులు కోడి పుంజులతో పందేలకు వచ్చారు. 


గుడివాడలో క్యాసినో

ఇప్పటి వరకు కోడి పందేలు, పేకాట, గుండాటలకే పరిమితమైన జిల్లాలో ఈ ఏడాది కొత్తగా గోవా సంస్కృతి ప్రవేశించింది. అత్యధికంగా పందేలు నిర్వహించిన గుడివాడకు కొత్తగా గోవాలో ఉండే క్యాసినోను తీసుకొచ్చారు. ఇక్కడ మంత్రి కొడాలి నానికి చెందిన ‘కే’ కన్వెన్షన్‌ హాల్లో హైటెక్‌ హంగులతో ఏర్పాటు చేశారు. ఇందులో ఆడాలంటే ముందుగా ప్రవేశానికి రూ.10వేలు చెల్లించాలని నిబంధనలు పెట్టారు. ప్రైవేటు వ్యక్తులు లోపలకు రాకుండా హైదరాబాద్‌కు చెందిన బౌన్సర్లను ఏర్పాటు చేశారు. క్యాసినో ఆడేవారికి టెన్షన్‌ లేకుండా ఉల్లాసం కలిగేలా చీర్‌ గర్ల్స్‌తో ప్రదర్శనలు చేయించారు. 


మహిళలకు ప్రత్యేకం

ఇక గన్నవరం నియోజకర్గం అంపాపురంలో మహిళల పేకాట కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కోడి పందేలను తిలకించడానికి ఇక్కడికి పురుషులతో పోటీపడి మరీ కొందరు మగువలు బరుల వద్దకు చేరుకున్నారు. వారితో పందేలు కలిపారు. అంపాపురంలో ఓ ప్రముఖ పారిశ్రామికవేత్త కనుసన్నల్లో మహిళల కోసం ప్రత్యేకంగా పేకాట శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఓపక్క పందెం బరులు, మరోపక్క  పేకాట, ఇంకోపక్క గుండాటను భారీ మొత్తంలో నిర్వహించారు. ఈ శిబిరాల వెనుక భాగంలో ప్రత్యేకమైన సదుపాయల మఽధ్య మగువలకు పేకాట శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఇందులోకి మహిళలను తప్ప ఇంకెవరినీ అనుమతించలేదు. ఇక్కడ మహిళల కోసం అన్ని రకాల సదుపాయాలను కల్పించారు. అంపాపురంలో నిర్వహించిన పందేలను వీక్షించడానికి హైదరాబాద్‌ నుంచి బుల్లితెర నటీనటులు వచ్చారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వారంతా అంపాపురంలోనే గడిపారు. 


ఈడుపుగల్లులో సరసాల వేదిక

సంక్రాంతి సంబరాలకు ఈడుపుగల్లు ఎప్పుడూ ప్రత్యేకం. అయితే ఈ ఏడాది ఇక్కడ విచ్చలవిడితనం చోటుచేసుకుంది. ఇక్కడ బెట్టింగ్‌ బాబుల సరసాలకు ఒక రహస్య వేదికను ఏర్పాటు చేశారు. పందెం బరులకు సమీపంలో నిర్మాణ దశలో ఉన్న భవనాన్ని బెట్టింగ్‌ బాబుల సరసాల కోసం వినియోగించుకున్నారు. 


చిట్యాలలో రూ.లక్ష కోడిపందెం టై

వత్సవాయి : వత్సవాయి మండలం చిట్యాలలో కోడి పందెం రెండు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. ఆదివారం మధ్యాహ్నం ఇక్కడ రూ.లక్షతో జరిగిన కోడి పందెం టై అయింది. దీంతో బరి నిర్వాహకులకు, సందర్శకులకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. నిర్వహణ ఇన్‌చార్జ్‌గా ఉన్న చిల్లకల్లుకు చెందిన వేల్పుల విజయకుమార్‌ (40)ను పలువురు తీవ్రంగా కొట్టటంతో గాయాలయ్యాయి. నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించి, గాయపడిన విజయకుమార్‌ను విజయవాడ ఆసుపత్రికి తరలించారు. అదే సమయంలో విజయకుమార్‌ అనుచరులు పందెం బరి వద్దకు చేరుకున్నారు. విజయకుమార్‌పై దాడి చేసిన తెలంగాణ ప్రాంతవాసులపై దాడికి దిగారు. ఈ ఘర్షణపై సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరగటంతో జగ్గయ్యపేట పోలీసులు రంగంలోకి దిగి, పందెం బరులను ఖాళీ చేయించారు. 



Updated Date - 2022-01-17T06:47:54+05:30 IST