4 వరకు ఈడీ కస్టడీకి సంజయ్‌ రౌత్‌

ABN , First Publish Date - 2022-08-02T08:51:21+05:30 IST

శివసేన(ఉద్ధవ్‌ వర్గం) అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు సంజయ్‌ రౌత్‌ను ఈడీ కస్టడీకి అప్పగిస్తూ..

4 వరకు ఈడీ కస్టడీకి సంజయ్‌ రౌత్‌

ముంబై, ఆగస్టు 1: శివసేన(ఉద్ధవ్‌ వర్గం) అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు సంజయ్‌ రౌత్‌ను ఈడీ కస్టడీకి అప్పగిస్తూ.. మనీలాండరింగ్‌ నిరోధక చట్టం(పీఎంఎల్‌ఏ) కేసుల ప్రత్యేక న్యాయస్థానం సోమవారం ఆదేశాలు జారీ చేసింది. రూ. 1,034 కోట్లు విలువ చేసే పాత్రాచాల్‌ భూ కుంభకోణం కేసులో.. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి సంజయ్‌ రౌత్‌ను ఆయన ఇంట్లో విచారించిన ఈడీ అధికారులు.. సాయంత్రం దక్షిణ ముంబైలోని ఈడీ కార్యాలయానికి తరలించిన విషయం తెలిసిందే. అర్ధరాత్రి దాటాక.. ఆయనను అరెస్టు చేసినట్లు అధికారికంగా ప్రకటించా రు. సోమవారం ఉదయం నుంచి నాటకీయ పరిణామాలు కొనసాగగా.. మధ్యాహ్నం ఆయనను కోర్టులో హాజరుపరిచారు.


పీఎంఎల్‌ఏ ప్రత్యేక కోర్టు జడ్జి ఎంజీ దేశ్‌పాండే ముందు ఈడీ, రౌత్‌ తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించాయి. సంజయ్‌ రౌత్‌ విచారణకు సహకరించడం లేదని, ఆయనను ఎనిమిది రోజులపాటు ఈడీ కస్టడీకి అ ప్పగించాలని దర్యాప్తు సంస్థ తరఫున వాదనలు వినిపించిన పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ హితేన్‌ వెనెగౌంకర్‌ కోర్టును కోరారు.  సంజయ్‌ రౌత్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది అశోక్‌ ముందార్గీ వాదనలు వినిపించారు.  


ఇది గవర్నర్‌ కోశ్యారీ కుట్రే: ఉద్ధవ్‌

సంజయ్‌ అరెస్టు మహారాష్ట్ర గవర్నర్‌ భగత్‌ సింగ్‌ కోశ్యారీ, కేంద్రంలోని బీజేపీ కుట్రలో భాగమేనని తాజా మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే ఆరోపించారు. సోమవారం ఉదయం ఆయన సంజయ్‌ రౌత్‌ కుటుంబ సభ్యులను కలిశారు. ఆయన వెంట పార్టీ ఎంపీ అర్వింద్‌ సావంత్‌, ఎమ్మెల్యే రవీంద్ర వాయ్‌కర్‌, శివసేన నేత మిలింద్‌ నర్వేకర్‌ ఉన్నారు. 


ఆధారాలతోనే ఈడీ చర్యలు: ఫడణవీస్‌

అన్ని ఆధారాలు సేకరించాకే సంజయ్‌ రౌత్‌పై ఈడీ చర్యలు ప్రారంభించిందని ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ అన్నారు. ‘‘ఈడీ అనేది కేంద్రం పరిధిలోని దర్యాప్తు సంస్థ. ఆధారాలు లేకుండా చర్యలు తీసుకోదు.’’ అని ఆయన వ్యాఖ్యానించారు.


శివసైనికుల ఆందోళనలు

సంజయ్‌ రౌత్‌ అరెస్టును నిరసిస్తూ శివసేన(ఉద్ధవ్‌ వర్గం) కార్యకర్తలు మహారాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించారు.

Updated Date - 2022-08-02T08:51:21+05:30 IST