Jail inmates: ఒకే జైలులో ఆ ముగ్గురు నేతలు..

ABN , First Publish Date - 2022-08-14T23:55:53+05:30 IST

ముగ్గురూ ప్రముఖ నేతలే. ముగ్గురూ మనీలాండరింగ్ కేసుల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చేతిలో అరెస్టు అయిన..

Jail inmates: ఒకే జైలులో ఆ ముగ్గురు నేతలు..

ముంబై: ముగ్గురూ ప్రముఖ నేతలే. ముగ్గురూ మనీలాండరింగ్ కేసుల్లో (Money laundering cases) ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) చేతిలో అరెస్టు అయిన వారే. ప్రస్తుతం ఈ ముగ్గురు నేతలు ఒకే జైలులో వేర్వేరు గదుల్లో ఉంటున్నారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నేతలు అనిల్ దేశ్‌ముఖ్ (Anil deshmukh), నవాబ్ మాలిక్ (Nawab Malik), శివసేన నేత సంజయ్ రౌత్ (Sanjay Raut)లను ఆర్దర్ రోడ్డు జైలులో కట్టుదిట్టమైన పహారా మధ్య ఉంచారు. భద్రతా కారణాల రీత్యా టీవీ, పుస్తకాలు, ఇతర అత్యవసరాల వారివారి గదుల్లోనే ఏర్పాటు చేశారు. గది బయట సీసీటీవీ కెమెరాలతో గట్టి నిఘా ఉంచారు.


పట్రా చావల్ భూ కుంభకోణంలో...

పట్రా చావల్ భూ కుంభకోణంలో సంజయ్ రౌత్‌ను గత ఆగస్టు 1న ఈడీ అరెస్టు చేసింది. 8959 నెంబర్‌ అండర్‌ట్రయిల్‌గా ఆయన ఆర్దర్ రోడ్డు జైలులో ఉంటున్నారు. భద్రతా కారణాల రీత్యా ఆయనను ప్రత్యేక బ్యారక్‌లో ఉంచారు. ఆయన కోరిక మేరకు జైలు అధికారులు నోట్‌పుస్తకాలు, పెన్నులు సమకూర్చారు. లైబ్రరీ నుంచి ఆయన పుస్తకాలు తీసుకుని చదువుకునే వీలుంది. ముంబై హైకోర్టు అనుమతించడంతో ఆయనకు ఇంటి నుంచే భోజనం అందుతోంది. ఆగస్టు 22వ తేదీ వరకూ ఆయనను జ్యుడిషియల్ కస్టడీలోకి తీసుకోవాలని కోర్టు ఇటీవల ఆదేశించింది.



దావూద్ ఇబ్రహీంతో లింకులున్న ఆస్తుల డీల్‌లో..

ఎన్‌సీపీ నేత నవాబ్ మాలిక్ ఫిబ్రవరి 23న ఆస్తుల డీల్‌లో అరెస్టయ్యారు. గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీం అనుచరులతో ముడిపడిన ల్యాండ్ డీల్స్ కేసులో ఆయనను ఈడీ అరెస్టు చేసింది. ఖైదీ 4622 నంబర్‌తో ఆయన ఆర్దర్ రోడ్డు జైలులో ఉంటున్నారు. ఆరోగ్య కారణాల రీత్యా ప్రస్తుతం కుర్లాలోని ప్రైవేటు ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. జైలులో మంచం, కుర్చీ ఏర్పాటుతో పాటు ఇంటి భోజనం తెప్పించుకునే వెసులుబాటు ఆయనకు కల్పించారు. టీవీ, కేరమ్స్, బుక్స్ వంటి సౌకర్యాలు కల్పించారు.


బలవంతపు వసూళ్లు, మనీలాండరింగ్ కేసులో...

కాగా, మహారాష్ట్ర మాజీ హోం మంత్రి అయిన అనిల్ దేశ్‌ముఖ ఖైదీ నెంబర్ 2225గా జైలులో ఉన్నారు. తొమ్మిది నెలలుగా ఆయన ఈ జైలులోనే ఉంటున్నారు. ముంబై మాజీ పోలీస్ కమిషనర్ పరమ్ బీర్ సింగ్ చేసిన ఫిర్యాదుతో ఆయనను బలవంతపు వసూళ్లు, మనీ లాండరింగ్ కేసులో 2021 నవంబర్ 1న ఈడీ అరెస్టు చేసింది. జైలులో ఆయనకు మంచం, క్యారమ్స్, టీవీ ఏర్పాటు చేశారు. జైలులోని ఇతర ఖైదీల తరహాలోనే, సంజయ్ రౌత్, నవాబ్ మాలిక్, అనిల్ దేశ్‌ముఖ్‌లు ప్రతినెలా రూ.6,000 వరకూ తమ అవసరాల నిమిత్తం ఇంటి నుంచి తెప్పించుకోవచ్చు.

Updated Date - 2022-08-14T23:55:53+05:30 IST