పబ్బం గడుపుకోవడానికే సంజయ్‌ పాదయాత్ర

ABN , First Publish Date - 2021-09-17T05:24:42+05:30 IST

పబ్బం గడుపుకోవడానికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పాదయాత్ర చేస్తున్నారని ఆ పాదయాత్రతో ప్రజలను ఉద్ధరించేది ఏమీ లేదని లేనిపోని అపోహలు సృష్టించి ప్రజలను రెచ్చగొట్ట వద్దని ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ అన్నారు.

పబ్బం గడుపుకోవడానికే సంజయ్‌ పాదయాత్ర
కామారెడ్డిలో కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతున్న ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌

కామారెడ్డి, సెప్టెంబరు 16: పబ్బం గడుపుకోవడానికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పాదయాత్ర చేస్తున్నారని ఆ పాదయాత్రతో ప్రజలను ఉద్ధరించేది ఏమీ లేదని లేనిపోని అపోహలు సృష్టించి ప్రజలను రెచ్చగొట్ట వద్దని ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ అన్నారు. గురువారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో టీఆర్‌ఎస్‌ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్‌ పుణ్యమా అని బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి బండి సంజయ్‌కి, కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్ష పదవి రేవంత్‌రెడ్డికి వచ్చాయని అన్నారు. దమ్ముంటే బీజేపీ, కాంగ్రెస్‌ పరిపాలించే రాష్ట్రాలలో రైతుబంధును, రైతు బీమాను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. 67 సంవత్సరాలుగా పార్టీని నమ్ముకున్న వారికి రాష్ట్ర అధ్యక్ష పదవి రాలేదని, కాంగ్రెస్‌ పార్టీలో చేరిన మూడు సంవత్సరాలకే రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్ష పదవిని రేవంత్‌రెడ్డి ఎలా తెచ్చుకున్నాడో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసనని అన్నారు. కాంగ్రెస్‌, బీజేపీలకు చెందిన అధ్యక్షులుగా నియామకమైన నుంచి లేనిపోని అవాకులు చెవాకులతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. తెలంగాణ ప్రజలు వీరి మాటలకు పడిపోయే స్థితిలో లేరన్నారు. కేసీఆర్‌పై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడం బండి సంజయ్‌కు రేవంత్‌రెడ్డికి తగదని అన్నారు. కామారెడ్డి జిల్లా ఇన్‌చార్జ్‌ నిజామాబాద్‌ జడ్పీ చైర్మన్‌ దాదాన్నగారి విఠల్‌రావు మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ పార్టీ స్థాపించినప్పుడు కేసీఆర్‌ ఒక్కరే ఉన్నారని ఇప్పుడు 60 లక్షల మంది కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో ఉన్నారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణలో ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. కామారెడ్డి నియోజకవర్గంలో 32,500 సాధారణ పార్టీ సభ్యత్వం చేయించగా 17,500 క్రియాశీలక సభ్యత్వాలను చేయించి రాష్ట్రంలోనే ముందుగా సభ్యత్వానికి చెందిన డబ్బులు 22 లక్షలను పార్టీకి అప్పగించినట్లు తెలిపారు.  ఈ సమావేశంలో టీఆర్‌ఎస్‌ మైనార్టీ సెల్‌ అధ్యక్షుడు ముజీబోద్దిన్‌, రాష్ట్ర నాయకుడు నిట్టు వేణుగోపాల్‌రావు, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ నిట్టు జాహ్నవి, వైస్‌ చైర్‌పర్సన్‌ గడ్డం ఇందుప్రియా, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ పున్న రాజేశ్వర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-09-17T05:24:42+05:30 IST