బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ కంగనా రనౌత్ (Kangana Ranaut) వరుస సినిమాలు చేస్తూ కెరీర్లో దూసుకుపోతోంది. జయలలిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘తలైవి’తో హిట్ కొట్టిన ఈ బ్యూటీ.. తాజాగా నటించిన చిత్రం ‘ధాకడ్’. ఈ మూవీలో అర్జున్ రాంపాల్, దివ్యా దత్తా ముఖ్యపాత్రల్లో నటించారు. మే 20న విడుదలైన ఈ మూవీ డివైడ్ టాక్ సొంతం చేసుకుంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో కంగన మాట్లాడుతూ.. బాలీవుడ్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ (Sanjay Leela Bhansali) గురించి పలు విషయాలు చెప్పింది.
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌కి కంగనకి మంచి రిలేషన్ ఉన్న విషయం తెలిసిందే. కెరీర్ ప్రారంభంలో పోర్ట్‌ఫోలియోతో సల్లు భాయ్‌ని కలవగా.. కంగనని సంజయ్ లీలా భన్సాలీని కలవమని సలహా ఇచ్చాడు. అంతేకాకుండా నీలాంటి వాళ్లు ఆయన సినిమాలో కరెక్ట్‌గా ఫిట్ అవుతుందని కంగనకి సల్మాన్ చెప్పాడు. దీంతో పొర్ట్ఫోలియోతో సంజయ్‌ని కలవడానికి కంగనా వెళ్లింది.
దీని గురించి కంగన మాట్లాడుతూ.. ‘‘వివిధ రకాలుగా ఉన్న నా పోర్ట్‌ఫోలియోతో నేను సంజయ్‌ని కలవడానికి వెళ్లాను. ఆయన నా పిక్స్‌ని చూసిన తర్వాత ఎంతో ఉత్సుకతతో నువ్వు ఊసరవెల్లిలా ఉన్నావు ఏంటి? ఒక్కోసారి ఒక్కోలా కనిపిస్తున్నావు. దానికి నేను.. ‘సర్ ఇది నాకు మంచి చేస్తుందా లేక చెడు చేస్తుందా?’ అని అడిగాను. అయితే ఆయన నాకు తెలియదు. కానీ నువ్వే భవిష్యత్తులో తెలుసుకుంటావు’’ అని చెప్పుకొచ్చింది.