Advertisement

‘గాడ్‌ఫాదర్’ లో ‘కేజీఎఫ్2’ విలన్ ?

మెగాస్టార్ చిరంజీవి 153వ చిత్రంగా తమిళ దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కిస్తున్న పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ‘గాడ్‌ఫాదర్’. మలయాళ ‘లూసిఫర్’ చిత్రానికిది రీమేక్ అన్న సంగతి తెలిసిందే. తెలుగు నేటివిటీకి అనుగుణంగా, చిరు ఇమేజ్ కు తగ్గట్టుగా స్ర్కిప్ట్ లో స్వల్ప మార్పులు చేశారు. ప్రస్తుతం సెట్స్ మీదున్న ఈ సినిమాకి సంబంధించిన ప్రతీ అప్డేట్ అభిమానుల్ని ఊరిస్తోంది. ఈ నేపథ్యంలో ‘గాడ్‌ఫాదర్’ చిత్రానికి సంబంధించిన ఓ రూమర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘గాడ్‌ఫాదర్’ చిత్రంలో ఓ ముఖ్యమైన పాత్రలో నయనతార ఎంపికైన సంగతి తెలిసిందే. అలాగే.. ఆమె సోదరుడి పాత్రకు సత్యదేవ్ ను సెలెక్ట్ చేసినట్టు వార్తలొస్తున్నాయి. 


ఇక ఇందులోని అతి ముఖ్యమైన పాత్ర నయనతార భర్త గానూ, ఈ సినిమాకి విలన్ గానూ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ఆల్రెడీ సంజూ భాయ్ .. ‘కేజీఎఫ్2’ లో అధిరా అనే పవర్ ఫుల్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఆయన లుక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అందుకే ‘గాడ్‌ఫాదర్’ చిత్రంలో కూడా ఆయన్ను విలన్ గా ఎంపికచేసినట్టు తెలుస్తోంది. ఒరిజినల్ వెర్షన్ లో ఆ పాత్రను వివేక్ ఒబెరాయ్ పోషించారు. నాగార్జున ‘చంద్రలేఖ’ లో అతిథిగా ఒక చిన్న పాత్రలో  మెరిసిన సంజయ్ దత్ మళ్ళీ ఇన్నాళ్ళకు తెలుగులో ఫుల్ లెంత్ రోల్ చేయనుండడం ఆసక్తిని రేపుతోంది. మరి ఈ వార్తల్లో నిజానిజాలేంటో చూడాలి. 

Advertisement
Advertisement