Blue Origin: ‘న్యూ షెపర్డ్’ రాకెట్ తయారీలో భారత మహిళ కీలక పాత్ర

ABN , First Publish Date - 2021-07-17T00:36:34+05:30 IST

అపర కుబేరుడు బ్లూ ఆరిజిన్ అధినేత జెఫ్ బెజోస్ అంతరిక్ష యాత్రకు మార్గం సుగమం అయింది. జెఫ్ బెజోస్ సహా మరో ముగ్గురి అంతరిక్ష విహారానికి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. దీంతో వచ్చే మంగళ

Blue Origin: ‘న్యూ షెపర్డ్’ రాకెట్ తయారీలో భారత మహిళ కీలక పాత్ర

వాషింగ్టన్: అపర కుబేరుడు బ్లూ ఆరిజిన్ అధినేత జెఫ్ బెజోస్ అంతరిక్ష యాత్రకు మార్గం సుగమం అయింది. జెఫ్ బెజోస్ సహా మరో ముగ్గురి అంతరిక్ష విహారానికి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. దీంతో వచ్చే మంగళవారం జూలై 20న పశ్చిమ టెక్సాస్ నుంచి ‘న్యూ షెపర్డ్’ రాకెట్ ద్వారా ‘సబ్ ఆర్బిటల్’ యాత్ర చేయనున్నారు. న్యూ షెపర్డ్’ రాకెట్ ద్వారా అంతరిక్ష యాత్రకు వెళ్లే వారి జాబితాలో జెఫ్ బెజోస్, ఆయన సోదరుడు, 82ఏళ్ల వాలీ ఫంక్‌తో 18ఏళ్ల కుర్రాడు ఉన్నాడు. కాగా.. బ్లూ ఆరిజిన్ అధిపతి జెఫ్ బెజోస్ సహా మరో ముగ్గురిని స్పేస్‌లోకి తీసుకెళ్లే ‘న్యూ షెపర్డ్’ రాకెట్ అభివృద్ధిలో ఓ భారతీయ మహిళ కీలక పాత్ర పోషించారనే విషయం చాలా మందికి తెలియదు. భారత్‌లో పుట్టి పెరిగిన 30ఏళ్ల సంజల్ గవాండే అనే మహిళ ‘న్యూ షెపర్డ్’ రాకెట్‌ను అభివృద్ధి చేసిన బృందంలో ఉన్నారు. 



మహారాష్ట్రలోని కల్యాణ్‌ ప్రాంతంలో పుట్టిన సంజాల్ గవాండే.. ముంబై యూనివర్సిటీలో మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. అనంతరం అమెరికాకి వెళ్లి, మిచిగాన్ టెక్నాలజీ యూనివర్సిటీలో మాస్టర్స్ పూర్తి చేశారు. చదువు పూర్తైన వెంటనే మెర్యూరీ మెరైన్‌లో ఆమె ఉద్యోగం సాధించారు. రెండేళ్ల తర్వాత ఆమె.. కాలిఫోర్నియాలోని టొయోటా రేసింగ్ డెవలప్‌మెంట్‌లో పని చేశారు. అంతరిక్ష రంగంలో పని చేయాలనే కలతో.. జెఫ్ బెజోస్‌కు చెందిన బ్లూ ఆరిజిన్ సంస్థలో చేరి, ‘న్యూ షెపర్డ్’ రాకెట్‌ను తయారు చేసిన బృందంలో పని చేశారు. ‘న్యూ షెపర్డ్’ రాకెట్ ఈ నెల 20న లాంచింగ్‌కు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో సంజాల్ గవాండే మీడియాతో మాట్లాడుతూ సంతోషం వ్యక్తం చేశారు. ‘నా చిన్న నాటి కల నెరవేరినందుకు చాలా సంతోషంగా ఉంది. బ్లూ ఆరిజిన్‌ బృందంలో భాగమైనందుకు గర్వపడుతున్నాను’ అని అన్నారు. ఇదిలా ఉంటే.. వీఎస్ఎస్ యూనిటీ 22 ద్వారా రిచర్డ్ బ్రాన్‌సన్ బృందంలో భాగంగా తెలుగు మహిళ శిరీష బండ్ల ఇటీవల అంతరిక్ష యానం చేసి, చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. 


Updated Date - 2021-07-17T00:36:34+05:30 IST