20 మంది ప్రాణాలు తీసిన శానిటైజర్.. ఇక్కడిదే..!

ABN , First Publish Date - 2020-08-04T15:49:51+05:30 IST

ఇప్పటికే నకిలీలు, కల్తీల మకిలి అంటుకున్న నరసరావుపేట పేరు మరోమారు రాష్ట్ర వ్యాప్తంగా మార్మోగుతోంది. ప్రకాశం జిల్లా కురిచేడులో రెండు రోజుల క్రిందట శానిటైజర్ తాగి 20 మంది మృత్యువాత

20 మంది ప్రాణాలు తీసిన శానిటైజర్.. ఇక్కడిదే..!

నరసరావుపేట సమీపంలోని ఫ్యాక్టరీలో శానిటైజర్ తయారు

దాన్ని తాగే ప్రకాశం జిల్లాలో 20 మంది మృతి

ప్రాథమిక దర్యాప్తులో వెల్లడి

అధికార పార్టీ నేత ఆర్డర్లపై సరఫరా..!

స్థానిక వ్యాపార వర్గాల్లో కలకలం


నరసరావుపేట (గుంటూరు): ఇప్పటికే నకిలీలు, కల్తీల మకిలి అంటుకున్న నరసరావుపేట పేరు మరోమారు రాష్ట్ర వ్యాప్తంగా మార్మోగుతోంది. ప్రకాశం జిల్లా కురిచేడులో రెండు రోజుల క్రిందట శానిటైజర్ తాగి 20 మంది మృత్యువాత పడిన విషయం తెలిసిందే. నరసరావుపేటకు సమీపంలోని ఫ్యాక్టరీలో ఈ శానిటైజర్ తయారైనట్టు కేంద్ర నిఘా వర్గాలు ధృవీకరించినట్లు సమాచారం. అధికార పార్టీకి చెందిన వ్యక్తి ఈ శానిటైజర్ తయారీలో కీలక పాత్ర పోషించినట్లు ప్రచారం జరుగుతోంది. ఆ నేత మున్సిపాల్టీలకు ఆర్డర్లపై సరఫరా చేసినట్లు తెలిసింది. ఐసీఎంఆర్ నిబంధనల మేరకు సదరు కంపెనీలో శానిటైజర్ తయారు చేయడం లేదని చెబుతున్నారు. కొవిడ్ కేసులు ప్రారంభమయ్యాకే ఈ ఫ్యాక్టరీకి హడావిడిగా అనుమతులిచ్చారు. దీనిలో నాసిరకం స్పిరిట్ వినియోగించి శానిటైజర్ తయారు చేశారు. నరసరావుపేటలోని ఓ ప్రముఖ మందుల వ్యాపారిని డీలర్ గా నియమించుకుని రాష్ట్ర వ్యాప్తంగా విక్రయాలు చేస్తున్నారు. రెక్టిఫైడ్ స్పిరిట్ ను వినియోగించి శానిటైజర్ ను తయారు చేయడం వల్లనే దీనిని సేవించి అనేక మంది మృతి చెందినట్లు నిపుణులు ధృవీకరిస్తున్నారు. 


నాసిరకం స్పిరిట్ ను వినియోగించి ఆల్కాహాల్ శాతాన్ని తగ్గించి నకిలీ శానిటైజర్లను తయారు చేసి రాష్ట్ర వ్యాప్తంగా సరఫరా చేస్తున్నట్లు నిఘా వర్గాల ప్రాధమిక దర్యాప్తులో వెల్లడైనట్లు తెలిసింది. ఇటువంటి శానిటైజర్ కరోనా వైరస్ సోకకుండా నివారిస్తుందో లేదో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నకిలీ శానిటైజర్ గుట్టు రట్టు అవడంతో నరసరావుపేటలోని వ్యాపారవర్గాల్లో కలకలం సృష్టించింది. ఆ కంపెనీలో తయారయ్యే శానిటైజర్ శాంపిల్స్ ను సేకరించి పరీక్షల కోసం కర్ణాటకలోని సెంట్రల్ ల్యాబ్ కు సిట్ అధికారులు పంపారు. 

Updated Date - 2020-08-04T15:49:51+05:30 IST