పారిశుధ్య పనులను ముమ్మరం చేయాలి

ABN , First Publish Date - 2020-05-24T09:35:07+05:30 IST

వానాకాలానికి ముందే అన్నిగ్రామాల్లో పారిశుధ్య పనులను ముమ్మరంగా చేపట్టాలని గ్రామీణాభివృద్ధి శాఖమంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు

పారిశుధ్య పనులను ముమ్మరం చేయాలి

ఊళ్లల్లో డ్రెయినేజీలను శుభ్రం చేయాలి

వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి ఎర్రబెల్లి


జనగామ, మే 23 (ఆంధ్రజ్యోతి) :  వానాకాలానికి ముందే అన్నిగ్రామాల్లో పారిశుధ్య పనులను ముమ్మరంగా చేపట్టాలని గ్రామీణాభివృద్ధి శాఖమంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సూచించారు. శనివారం హైదరాబాద్‌ నుంచి జిల్లా కలెక్టర్‌, జడ్పీచైర్మన్‌, ఎంపీపీలు, సంబంధిత అధికారులతో నిర్వహించిన కాన్ఫరెన్స్‌లో జనగామ జిల్లాలో పల్లెప్రగతి కార్యక్రమంపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వానాకాలానికి ముందే మురుగునీటి కాలువలను శుభ్రం చేయాలన్నారు. ఖాళీగా ఉన్న ప్లాట్లలో చెత్తను తొలగించేందుకు యజమానులకు నోటీసులు ఇవ్వాలన్నారు. పంటకాలువల్లో పిచ్చిమొక్కలను తొలగించాలని ఆదేశించారు. సర్పంచ్‌లు, గ్రామకార్యదర్శులు గ్రామా ల్లో పర్యటించి మురుగునీటి గుంతలు పూడ్చాలన్నారు. ప్రతినెలా 1, 11, 21 తేదీలలో ప్రతీ పది రోజులకొకసారి తాగునీటి ట్యాంక్‌లను శుభ్రం చేయాలన్నారు. దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.


ఆశా కార్యకర్తలు, వైద్యసిబ్బంది గ్రామాల్లో పర్యటించి, ప్రజల ఆరోగ్య పరిస్థితులను పరిశీలించాలన్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా పెద్దఎత్తున నర్సరీలలో మొక్కలను నాటి సంరక్షించాలన్నారు. ఉపాధిహామీ పథకం కింద రైతులు వారి పంటపొలాల్లో కల్లాలు ఏర్పాటు చేసుకునేందుకు అనుమతి ఇవ్వడం జరుగుతుందన్నారు. ఇం దుకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. సమీక్షలో కలెక్టర్‌ కె.నిఖిల, డీఆర్‌డీవో రాంరెడ్డి, జడ్పీచైర్మన్‌ పాగాల సంపత్‌రెడ్డి, సీఈవో రమాదేవి, డీపీవో వెంకటేశ్వర్లు, అధికారులు పాల్గొన్నారు.


సీజనల్‌ వ్యాధుల పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు వీడియో కాన్పరెన్స్‌ ద్వారా అధికారులకు సూచించారు. వర్షాకాలం దృష్ట్యా వచ్చే సీజనల్‌ వ్యాధులు రాకుండా ముందస్తు జాగ్రత్తలు చేబట్టాలన్నారు. ఎంపీపీ కందుల రేఖ, ఎంపీడీవో కుమారస్వామి, ఈవోపీఆర్డీ మహబూబ్‌అలీ, కంజర్ల మోహన్‌, కిశోర్‌, శ్రీనివాస్‌, సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు.


Updated Date - 2020-05-24T09:35:07+05:30 IST