సూరంపల్లిలో పడకేసిన పారిశుధ్యం

ABN , First Publish Date - 2021-05-12T06:30:20+05:30 IST

సూరంపల్లిలో పడకేసిన పారిశుధ్యం

సూరంపల్లిలో పడకేసిన పారిశుధ్యం
డ్రెయిన్‌లో నిలిచిన వ్యర్థాలు

ఫ అడుగడుగునా దర్శనమిస్తున్న మురుగు

ఫ డ్రెయిన్లలో పేరుకుపోయిన వ్యర్థాలు

ఫపాజిటివ్‌లు పెరుగుతున్నా పట్టించుకోని అధికారులు 

 సూరంపల్లి, (గన్నవరం) మే 11 : మండలంలోని సూరంపల్లిలో పారిశుధ్యం అధ్వానంగా మారింది. గ్రామంలోని ప్రధాన రహదారితో పాటు అంతర్గత రహదారులకు ఇరువైపులా మురుగునీరు, చెత్త, వ్యర్థాలు దర్శనమిస్తున్నాయి. ఈ గ్రామంలో 5 వేల మందికిపైగా జనాభా ఉన్నారు. సూరంపల్లికి మహిళా పారిశ్రామికవాడతో పాటు, పరిసరాల్లో అనేక పరిశ్రమలు, గోడౌన్‌లు 150కి పైగా ఉన్నాయి. ఇంతగా అభివృద్ధి చెంది, ఆదాయం ఉన్న ఈ గ్రామంలో పరిసరాల పరిశుభ్రత మచ్చుకు కూడా కనిపించని దుస్థితి నెలకొంది.

 సాక్ష్యాత్తూ పంచాయతీ కార్యాలయం ఎదుట ఉన్న మెయిన్‌ డ్రెయిన్‌లో గ్రామం పొడవునా మురుగునీరు, దానిలో నిలిచిపోయిన వ్యర్థాలు, వాటర్‌ బాటిళ్లు ఆర్‌సీఎం చర్చి సమీపంలో గుట్టలు గుట్టలుగా  ఉన్నాయి. రామచంద్రాపురం రోడ్డులో చెరువు దగ్గర చెత్త డంపింగ్‌ ఉంది. కరోనా విలయతాండవం ఒకవైపు చేస్తుంటే, మరోవైపు పారిశుధ్య కార్యక్ర మాలు నిరంతరం నిర్వహించాల్సిన పంచాయతీ పాలకులు, అధికారులు చర్యలు తీసుకోవటం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. గ్రామం చుట్టూ ఉన్న పరిశ్రమల్లో పని చేస్తున్న వందలాది మంది కార్మికులకు సైతం పారిశుధ్య కార్యక్రమాలు అందటం లేదని పారిశ్రామిక ప్రాంతం నివాసులు గగ్గోలు పెడుతు న్నారు. పరిశ్రమల్లో పని చేస్తున్న అనేక మంది ఈ గ్రామంలో అద్దెలకు ఉంటున్న నేపఽథ్యంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అధికారులు ఆ విషయాన్ని విస్మరించారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక సుగాలీ కాలనీ సమీపంలో విజయవాడ నుంచి వలస వచ్చిన అనేక కుటుంబాలు నివాసాలు ఏర్పాటు చేసుకుని ఉంటున్నారు. ఆ ప్రాంతంలో పందుల బెడద అధికంగా ఉందని, బ్లీచింగ్‌, సున్నం చల్లిం చాలని కోరుతున్నారు.

 అన్ని గ్రామాల్లో పారిశుధ్య చర్యలు ముమ్మరంగా చేపడుతున్న సూరంపల్లిలో మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదని పంచాయతీ పాలకవర్గ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో సుమారు 30 కరోనా కేసులు ఉన్నప్పటికీ పంచాయతీ కార్యదర్శి పట్టించుకోవటం లేదని విమర్శలు వస్తున్నాయి. కార్యదర్శి ఎప్పుడు వస్తారో, వెళతారో కూడా తెలియటం లేదని పాలకవర్గ సభ్యులు ఆరోపించటం గమనార్హం. ఈ పంచాయతీ పాలకవర్గం ఉన్నప్పటికీ గ్రామంలో పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టకపోవటంపై గ్రామస్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. 20 రోజుల క్రితం తూతూ మంత్రంగా హైపోక్లోరైడ్‌ పిచికారీ చేసి చేతులు దులుపుకున్నారని గ్రామస్తులు అంటున్నారు. ఇప్పటికైనా గ్రామంలో పారిశుధ్య చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 

Updated Date - 2021-05-12T06:30:20+05:30 IST