తనిఖీలు చేయకపోతే కఠిన చర్యలు

ABN , First Publish Date - 2021-04-20T07:25:20+05:30 IST

పారిశుధ్య నిర్వహణలో అలసత్వం వహించే అధికారులను ఉపేక్షించేది లేదని, క్షేత్రస్థాయిలో పర్యటించని వారిపై కఠిన చర్యలు తప్పవని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌కుమార్‌ హెచ్చరించారు.

తనిఖీలు చేయకపోతే కఠిన చర్యలు

రోడ్లపై చెత్త వేస్తే జరిమానా విధించండి

పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌కుమార్‌

హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌ 19 (ఆంధ్రజ్యోతి): పారిశుధ్య నిర్వహణలో అలసత్వం వహించే అధికారులను ఉపేక్షించేది లేదని, క్షేత్రస్థాయిలో పర్యటించని వారిపై కఠిన చర్యలు తప్పవని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌కుమార్‌  హెచ్చరించారు. మరి కొద్ది రోజుల్లో వర్షాలు పడే అవకాశం ఉన్న దృష్ట్యా.. మరింత అప్రమత్తంగా ఉండాలని, చెత్త పేరుకుపోకుండా నిత్యం తొలగించాలన్నారు. సోమవారం జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో జోనల్‌, డిప్యూటీ మునిసిపల్‌ కమిషనర్లు, ఏఎంఓహెచ్‌లతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పారిశుధ్య నిర్వహణ స్పెషల్‌ డ్రైవ్‌, శానిటైజేషన్‌పై పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ సమీక్ష నిర్వహించారన్నారు. సర్కిల్‌ పరిధిలోని ఈఈ, డీఈ, ఏఎంఓహెచ్‌, ఏఎంసీ, ఏసీపీలకు పరిధి నిర్ణయించి వంద శాతం చెత్త తొలగించేలా చూడాల్సిన బాధ్యత అప్పగించాలన్నారు. నిత్యం ఉదయం 6 గంటల్లోపే క్షేత్రస్థాయిలో పర్యటించి పారిశుధ్య నిర్వహణను పర్యవేక్షించాలని డీసీ, ఏఎంఓహెచ్‌లను ఆదేశించారు. పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉండడమంటే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడడమే అన్నారు. రోడ్లపై చెత్త వేసే వారిని గుర్తించి జరిమానా విధించాలని ఆదేశించారు. 

చెత్త తొలగింపునకు ప్రత్యేక చర్యలు

నగరంలోని 310 ప్రాంతాల్లో పెద్ద మొత్తంలో, 700 చోట్ల తక్కువ పరిమాణం గల చెత్త నిల్వ ప్రాంతాలున్నాయని, వీటిలో గార్బెజ్‌ ఎప్పటికప్పుడు తొలగించేందుకు చర్యలు చేపడుతున్నామని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ డీఎస్‌ లోకే్‌షకుమార్‌ తెలిపారు. చెత్త తరలింపునకు వినియోగించే వాహనాలన్నీ.. ఉదయం 5 గంటల్లోపే క్షేత్రస్థాయిలో పని ప్రారంభించేలా తనిఖీలు నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. వీధులను శుభ్రం చేసే కార్మికులకు చెత్త సేకరించి సమీప గార్బెజ్‌ పాయింట్లలో వేసేందుకు ప్రత్యేక బ్యాగ్‌లు ఇస్తున్నట్టు చెప్పారు. ఇప్పటి వరకు 320 కొత్త స్వచ్ఛ ట్రాలీలు వచ్చాయని, దశలవారీగా మరిన్ని రానున్నాయని తెలిపారు. 


Updated Date - 2021-04-20T07:25:20+05:30 IST