శంఖ ఘోష్‌ మూడు కవితలు

ABN , First Publish Date - 2021-04-26T05:59:38+05:30 IST

భగభగలాడే బెంగాలీ కవిత్వంలో బెబ్బులిలాంటి వాడు శంఖ ఘోష్‌. బెంగాలీ సాహిత్యానికి కొత్త దశ, దిశ నిర్దేశించినవాడు. మాట ఎంత మృదువో, పదం అంత పదును...

శంఖ ఘోష్‌ మూడు కవితలు

భగభగలాడే బెంగాలీ కవిత్వంలో బెబ్బులిలాంటి వాడు శంఖ ఘోష్‌. బెంగాలీ సాహిత్యానికి కొత్త దశ, దిశ నిర్దేశించినవాడు. మాట ఎంత మృదువో, పదం అంత పదును. కేవలం రాతలోనే కాదు, చేతలోనూ ఘోష్‌ దేశ ప్రజల గుండె ఘోషకు అండగా నిలిచాడు. సాహిత్య అకాడమీ, జ్ఞాన్‌పీఠ్‌, పద్మభూషణ్‌ వంటి అవార్డులు అందుకున్నప్పటికీ అనేక ప్రభుత్వ ప్రజా వ్యతిరేక సంఘటనలకు నిరసనగా వీధుల్లోకి వచ్చి గొంతు విప్పాడు. పౌరసత్వ సవరణ బిల్లు వంటి జాతీయ సమస్యలు మొదలుకొని నందిగ్రామ్‌, సింగూర్‌ల్లో వామపక్ష పార్టీలు పాల్పడిన అరాచకాల వరకూ ఎన్నిటినో తీవ్రంగా ఖండించాడు. దీర్ఘకాలిక రైతు ఉద్యమానికి మద్దతు ప్రకటించాడు.


ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో వున్న చాంద్‌పూర్‌లో ఫిబ్రవరి 6, 1932లో జన్మించాడు ఘోష్‌. విభజన సందర్భంలో ఆయన కుటుంబం దేశానికి వలస వచ్చింది. ప్రెసిడెన్సీ కాలేజీలో బీఏ, కోల్‌కతా యూనివర్సిటీ నుంచి ఎమ్మే చేసి.. కోల్‌కతా, జాదవ్‌పూర్‌ యూనివర్సిటీల్లో దశాబ్దాలపాటు విద్యా బోధన చేశాడు. తొలి దశలో ఆయన కవిత్వంలో కావ్య భాష ఎక్కువగా ఉండేది. తరువాత చుట్టూ వున్న ప్రపంచాన్ని పరిశీలించి, విస్తృతంగా కవిత్వాన్ని అధ్యయనం చేసి ప్రజల దైనందిన జీవితంలోని భాషలోనే కవిత్వం రాయడం ప్రారంభించాడు. అప్పటి నుంచీ ప్రజల పక్షాన నిలిచాడు. కోవిడ్‌ పాజిటివ్‌ రావడంతో హోమ్‌ ఐసోలేషన్‌లో ఉన్న ఘోష్‌ ఈ నెల బుధవారం 21వ తేదీన కన్నుమూశారు.


శిక్ష

నెమ్మదిగా మాట్లాడినందుకే

అతడికి జీవిత ఖైదు విధించారు

మూడు ఎలుగుబంట్లు

అతడిపై విరుచుకుపడ్డాయి

నిజంగా ఎలుగుబంట్లు కాదు, సెంట్రీలు

వారు ఖచ్చితంగా సెంట్రీలూ కాదు

నిజం చెప్పాలంటే వాళ్లు ప్రభువులు

అతడి వెన్నులోంచి మాంసాన్ని పీకి,

నీకు ధైర్యం లేదు, చుట్టూ చూడు

గొంతు పెగిలినంతసేపు అరువని చెప్పారు


వయసు

అతడిని ఇంకొంచెం తాగనివ్వండి

లేకపోతే అతడీ ప్రపంచాన్ని

అంత తేలిగ్గా తట్టుకోలేడు

భగవాన్‌, అతడింకా కుర్రాడే!

అతడికిప్పుడు కాస్త వయసునివ్వు, 

అప్పుడుగానీ, ఈ ప్రపంచం అతడిని

సులువుగా భరించలేదు


చనిపోయిన స్నేహితుడికి

ఈసారి మన శాంతి సమావేశంలో

నీ కోసం కుర్చీ కేటాయించలేదు

ఈసారి మద్ది లేదా టేకు చెట్టు క్రింద 

కేవలం పురాతన విధ్వంసం మాత్రమే మిగిలింది 

ముఖం చాటేసిన ఆ టెర్రకోట బొమ్మ

ఇలా విరిగిపోతుందని నువ్వు ఊహించలేదు

ఈ రోజు నువ్విక్కడ లేవన్నది అలవాటైపోయింది

అందుకే ఒకప్పుడున్నావన్నది నమ్మశక్యంగా లేదు

రెండు చేతులతో కుండపెంకును తీయడం కూడా

శిలాశాసనంలా ఆకాశాన్ని తలకిందులు చేయగలదు

హృదయం దగ్గర కాలం స్తంభించిపోయింది

నేల మీద జీరాడుతున్న సాయంకాలపు వెలుగు

అప్పటి మన జ్ఞాపకాలను కరిగించుకుపోతోంది

వాటిని నేను, నీకు అందివ్వాలనుకున్నట్టే.

ఈ రోజు నువ్విక్కడ లేవన్నది అలవాటైపోయింది

అందుకే ఒకప్పుడున్నావన్నది నమ్మశక్యంగా లేదు.


బెంగాలీ మూలం: 

శంఖ ఘోష్‌


ఇంగ్లీషు అనువాదం:

అరుణవ సిన్హా


పరిచయం ్క్ష :

తెలుగు అనువాదం:

దేశరాజు

99486 80009


Updated Date - 2021-04-26T05:59:38+05:30 IST