సంగమేశ్వరా.. ఈ రోడ్డు ఇంతేనా..!

ABN , First Publish Date - 2021-02-25T05:27:13+05:30 IST

మండలంలోని మూడు రోడ్ల కూడలి నుంచి సంగమేశ్వర ఆలయానికి వెళ్లే తారు రోడ్డు అధ్వానంగా తయారైంది. దాదాపు 6 కి.మీ మేర గుంతల మయమవడంతో వాహనదారులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు.

సంగమేశ్వరా.. ఈ రోడ్డు ఇంతేనా..!
దెబ్బతిన్న తారురోడ్డు

6 కి.మీ మేర గుంతలమయం

ఇబ్బందులు పడుతోన్న వాహనదారులు


     రోడ్డంతా గుంతలమయం.. వర్షం వచ్చిందంటే నడిచేందుకు కూడా వీలుండదు. ఇక వాహనదారుల పరిస్థితి అంతే. ఆ దారి గుండా ప్రజాప్రతినిధులు, అధికారులు వెళుతుంటారు.. భక్తుల రాకా ఎక్కువే.. కానీ ఆ రోడ్డును బాగు చేద్దామన్న ఆలోచన ఒక్కరికీ రాలేదు.. ఎందుకంటే ? ఎవరి పనుల్లో వారు నిమగ్న మయ్యారు. ఇది ఎక్కడో కాదు మండలంలోని సంగమేశ్వరుడు కొలువై ఉన్న శైవక్షేత్రానికి వెళ్లే దారిదీ దుస్థితి. వివరాల్లోకెళ్తే...


వీరపునాయునిపల్లె, ఫిబ్రవరి 24: మండలంలోని మూడు రోడ్ల కూడలి నుంచి సంగమేశ్వర ఆలయానికి వెళ్లే తారు రోడ్డు అధ్వానంగా తయారైంది. దాదాపు 6 కి.మీ మేర గుంతల మయమవడంతో వాహనదారులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. మొన్న వచ్చిన వర్షానికి గుంతల్లో నీళ్లు నిలబడి ఉండడంతో అక్కడ గుంత ఉందో లేదో తెలియక రోజుకు ఇద్దరు, ముగ్గురైనా కిందపడుతున్న సంఘటనలున్నాయి. ఇక్కడ ప్రధాన శైవక్షేత్రం ఉండడంతో భక్తులు విశేషంగా తరలివస్తుంటారు. వచ్చిన వారు ఇటువంటి ప్రముఖ ఆలయానికి వెళ్లే దారి ఇలా ఉందేంటి అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ రోడ్డు గుండా ప్రజాప్రతినిధులు, అధికారులు వెళుతున్నా రోడ్డును మరమ్మతు చేయాలన్న ఆలోచన ఎవరికీ లేదని స్థానికులు, భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పైగా ఇదే రోడ్డు గుండా ఇసుక క్వారీ నుంచి అనునిత్యం టిప్పర్లు అతివేగంగా వెళ్తుండడంతో రోడ్డు మరింత అధ్వానంగా తయారైందని, ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి రహదారిని బాగుచేయాలని కోరుతున్నారు. 

రూ.27 కోట్లు నిధులు మంజూరు ?

చిన్నచెప్పలి నుంచి కొత్తపల్లె, సంగమేశ్వరం, వీఎన్‌పల్లె మీదుగా సీఆర్‌ఎఫ్‌ నిధుల కింద రూ.27 కోట్లు రోడ్డు నిర్మాణానికి మంజూరైనట్లు విశ్వసనీయ సమాచారం. నిధులు మంజూరైన రోడ్డు పనులు చేపట్టకపోవడం శోచనీయం.


ప్రమాదకరంగా మారిన రహదారి

ఈ రోడ్డు గుంతలుగా మారడంతో ద్విచక్ర వాహనంలో వెళ్లాలంటే బిక్కుబిక్కుమంటూ వెళ్లాల్సిందే. ఎవరు ఎక్కడ కింద పడతారోనని భయంగా ఉంటుంది. ఈ రోడ్డు ప్రమాదకరంగా ఉండడంతో నిత్యం ఎవరో ఒకరు కింద పడుతుంటారు. వెంటనే మరమ్మతులు చేస్తే బాగుంటుంది. 

- గంగయ్య, అనిమెల


మరమ్మతులు చేపట్టాలి

మూడు రోడ్ల కూడలి నుంచి సంగమేశ్వర ఆలయం వరకు ఉన్న రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలి. దీంతో స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. పైగా వాహనదారులు ప్రమాదాల బారిన పడకుండా ఉంటారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలి.

- గోపాల్‌, వీఎన్‌పల్లె

Updated Date - 2021-02-25T05:27:13+05:30 IST