ప్రభుత్వానికి హైకోర్టు తీర్పు చెంపపెట్టు

ABN , First Publish Date - 2021-05-08T05:39:18+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు తీర్పు చెంపపెట్టు వంటిదని సంగం డెయిరీ డైరెక్టర్‌ కంచర్ల శివరామయ్య శుక్రవారం పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు.

ప్రభుత్వానికి హైకోర్టు తీర్పు చెంపపెట్టు

   సంగం డెయిరీ డైరెక్టర్‌ కంచర్ల శివరామయ్య


గుంటూరు(ఆంధ్రజ్యోతి), మే 7: రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు తీర్పు చెంపపెట్టు  వంటిదని సంగం డెయిరీ డైరెక్టర్‌ కంచర్ల శివరామయ్య శుక్రవారం పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంగం డెయిరీపై ప్రభుత్వ దురాక్రమణకు, ప్రభుత్వం ఇచ్చిన జీవోను హైకోర్టు సస్పెండ్‌ చేయడం హర్షణీయమన్నారు. ప్రభుత్వ చర్యలను గతంలో కోర్టులు 65సార్లు తప్పుపట్టినా ప్రభుత్వం నిబద్దత లేకుండా వ్యవహరించడం సిగ్గుచేటని తెలిపారు. సంగం డెయిరీ 1995 సంవత్సరంలో మ్యూచువల్లీ ఎయిడెడ్‌ కోఆపరేటివ్‌ చట్టంలోకి మారినప్పుడే ప్రభుత్వానికి ఉన్న బకాయిలన్నీ చెల్లించడం జరిగింది. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మ్యూచువల్లీ ఎయిడెడ్‌ కో ఆపరేటివ్‌ చట్టపరిధిలో ఉన్న డెయిరీలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి జీవో తీసుకురావడం జరిగింది. ఈ చట్ట పరిధిలో ఉన్న డెయిరీలలో ప్రభుత్వ ఆస్తులు ఏమీ లేవని, వాటిని స్వాధీనం చేసుకోవడానికి వీలు లేదని, ఈ జీవో చెల్లదని కోర్టులు స్పష్టం చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని డెయిరీల ఆస్తులన్నింటినీ కొల్లగొట్టడం గుజరాత్‌ అమూల్‌ డెయిరీతో వ్యాపార ఒప్పందం కుదుర్చుకున్న ఒప్పందంలో భాగమేనన్నారు. కరోనా కట్టడిలో విఫలమైన ప్రభుత్వం ప్రజల దృష్టిని మరల్చడానికే ప్రతిపక్ష నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తుందని  శివరామయ్య పేర్కొన్నారు.  

Updated Date - 2021-05-08T05:39:18+05:30 IST