అమూల్‌ కోసమే సంగం అస్థిరతకు కుట్ర

ABN , First Publish Date - 2021-09-29T05:28:20+05:30 IST

అమూల్‌ కోసమే సహకార రంగంలో ఉన్న సంగం డెయిరీని అస్థిరపరచాలని కుట్రలకు తెరదీశారని సంగం డెయిరీ చైర్మన ధూళిపాళ్ళ నరేంద్రకుమార్‌ ఆరోపించారు.

అమూల్‌ కోసమే సంగం అస్థిరతకు కుట్ర
సమావేశంలో మాట్లాడుతున్న సంగం డెయిరీ చైర్మన్‌ ధూళిపాళ్ళ నరేంద్రకుమార్‌

సంగం డెయిరీ చైర్మన ధూళిపాళ్ళ నరేంద్రకుమార్‌

 చేబ్రోలు, సెప్టెంబరు28: అమూల్‌ కోసమే సహకార రంగంలో ఉన్న సంగం డెయిరీని అస్థిరపరచాలని కుట్రలకు తెరదీశారని సంగం డెయిరీ చైర్మన ధూళిపాళ్ళ నరేంద్రకుమార్‌ ఆరోపించారు. చేబ్రోలు మండలం వడ్లమూడి సంగం డెయిరీ ప్రాంగంణంలో మంగళవారం 8వ సంగం సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ గత ఏడాది రూ.1,100 కోట్ల టర్నోవర్‌ లక్ష్యంగా పెట్టుకోగా రూ.1,098 కోట్ల టర్నోవర్‌ను సాధించామన్నారు. ఇది గత ఏడాదికన్నా 20 శాతం వృద్ధిని సాధించినట్లు చెప్పారు. గత ఏడాది పాల ఉత్పత్తిదారులకు రూ.66 కోట్లు బోనస్‌ను పంపిణీ చేయగా ఈ ఏడాది రూ.74 కోట్లు అందిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.1,250 కోట్ల టర్నోవర్‌ సాధించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు ప్రకటించారు. సంక్షోభం అనేది సంగం డెయిరీకి కొత్తకాదన్నారు. ఏసీబీ అధికారులు నెల రోజులపాటు తమను అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేశారని ఆరోపించారు. కొన్ని శక్తులు సంగంను విచ్ఛిన్నం చేయాలని చూడగా ప్రతి ఒక్కరు సంఘటితంగా ఆ కుట్రలను ఎదుర్కోవడం అభినందనీయమన్నారు. ఎండీ గోపాలకృష్ణన్‌, న్యాయసలహాదారు వేణుగోపాలం వంటి వారిని అరెస్టు చేసిన తీరు బాధాకరమన్నారు. డెయిరీపరంగా పది ఎకరాల భూమి తన తండ్రి ధూళిపాళ్ళ వీరయ్యచౌదరి పేరుతో రైతులే ట్రస్టును స్థాపించి వారి ఆమోదంతో భూమిని బదలాయించారన్నారు. ఆ సమయంలో తాను సంగం సంస్థతో ఎటువంటి సంబంధాలు కలిగి ఉండలేదన్నారు. అలాగే సంగం డెయిరీ కంపెనీగా రూపాంతరం చెందే సమయంలో విధివిధానాలను పాటించినప్పటికీ తమపై కేసు నమోదు చేయడం దారుణమన్నారు. 1997లో మ్యాక్స్‌ చట్టంలోకి మారిన సమయంలోనే ప్రభుత్వ సంబంధిత వివరాలను పొందుపరచి ఆ విలువలు రూ.81 లక్షలుగా లెక్కలు కట్టి ప్రభుత్వానికి చెల్లించనట్లు తెలిపారు. అయినప్పటికీ సంగం డెయిరీలో ప్రభుత్వ ఆస్థులు ఉన్నాయని కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. అలాగే తదనంతర కాలంలో సంగం ఆధునీకరణ కోసం ఎన్‌.డి.,డి.బి హామీతో రుణాలు పొందామన్నారు. అది కూడా నేరం చేసినట్లుగా తమపై అభియోగాలు మోపారన్నారు. ఇప్పటికే దేశంలోని అనేక నాబార్డు వంటి అత్యుత్తమ ఏజెన్సీలు సంగం డెయిరీని సందర్శించి తమ ప్రమాణాలను కొనియాడిన సంగతి గుర్తు చేశారు. సంగం డెయిరీకి యజమానులు పాల రైతులేనని తాము కస్టోడియన్స్‌ మాత్రమేనని పేర్కొన్నారు. తమకు రాజకీయాలు ప్రామాణికం కాదని సంస్థ ప్రయోజనాలే ముఖ్యమన్నారు. పాలకవర్గ సమావేశంలో పలు తీర్మానాలు చేసినట్లు చెప్పారు. గడ్డి పెంపకం కోసం 25 సెంట్లకు రూ.7,500 రైతుకు చెల్లించాలని నిర్ణయించామన్నారు. 25 సెంట్లు దాటితే గరిష్టంగా రూ.12,000 అందించనున్నట్లు చెప్పారు. పశు వైద్యం కోసం మందులను 50 శాతం రాయితీపై రైతులకు అందించాలని పాలకవర్గం తీర్మానించిందన్నారు. అందుబాటులో ఉన్న సాంకేతికతను వినియోగించుకోవడం కోసం సెక్సస్‌ సెమన్‌ను వినియోగించుకుని పెయ్యి దూడలను అభివృద్ధి  చేసేందుకు 50 శాతం రాయితీపై రైతులకు సెమన్‌ను అందించనున్నట్లు చెప్పారు. పశువుల బీమా కోసం ఇప్పటికి రూ.75 వేలకు బీమా చేస్తుండగా ఇక నుంచి రూ.1.20 లక్షలకు బీమా చేయాలని నిర్ణయించామన్నారు. పాలలో వెన్న శాతం పెంచే మందులను, కాల్షియం వంటి మందులను రాయితీపై రైతులకు అందిస్తామన్నారు. అభ్యుదయ రైతులకు డెయిరీ ఫామ్‌లు ఏర్పాటు చేసేందుకు శిక్షణ, సాంకేతిక సహాయం, బ్యాంకుల టైఅప్‌ వంటి సహాయాన్ని చేయనున్నట్లు చెప్పారు. పాలసేకరణ ప్రక్రియ పూర్తిగా ఆధునీకరించేందుకు ఆటోమేటిక్‌ మిల్క్‌ కలెక్షన్‌ యూనిట్లు ఏర్పాటు చేస్తామన్నారు. సంగం డెయిరీ ఈ ఏడాది రూ.9.65 కోట్ల నికర లాభం ఆర్జించినట్లు ప్రకటించారు. రానున్న రోజుల్లో ఉభయ గోదావరి జిల్లాల్లో సంగం పాల సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే కోల్డ్‌ కాఫీ, జ్యూస్‌, బేకరీ ఉత్పత్తులను మార్కెట్‌లోకి తీసుకువస్తున్నట్లు తెలిపారు. తొలుత వార్షిక బడ్జెట్‌ను, వచ్చే ఏడాది ఆదాయ అంచనా వ్యయాలను సభ ముందుంచి ఆమోదం తీసుకున్నారు. ఈ సమావేశంలో ఎండీ. పి.గోపాలకృష్ణన్‌, పాలకవర్గ సభ్యులు, వివిధ విభాగాల అధికారులు, పాల సొసైటీల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.

  

Updated Date - 2021-09-29T05:28:20+05:30 IST