Abn logo
May 6 2021 @ 03:00AM

‘సంగం’..అష్టదిగ్బంధనం!

డెయిరీని దెబ్బతీసేందుకు వ్యూహాలు 

పాలు పోస్తే ప్రభుత్వ పథకాలు రద్దు 

ఉత్పత్తిదారులకు అధికారుల బెదిరింపులు 

ఏసీబీ కేసులతో చైర్మన్‌, ఎండీ జైలుకు 

ప్రజా ప్రయోజనం పేరుతో ఏపీ డెయిరీకి బాధ్యతలు 

దొడ్డిదారిన అమూల్‌కు ధారాదత్తం చేసే ఎత్తుగడ

కరోనా వేళ నరేంద్ర, ఎండీ ప్రాణాలతో చెలగాటం 

ఇది ప్రభుత్వ కుట్రే...పాడి ఉత్పత్తిదారుల ఆగ్రహం


(గుంటూరు-ఆంధ్రజ్యోతి) 

రాష్ట్రంలో మూతపడిన ఫ్యాక్టరీలను తెరిపించేందుకు.. దివాళా దశలో ఉన్న పరిశ్రమలకు చేయూతనందించి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు సహజంగా ఏ ప్రభుత్వమైనా సహాయ, సహకారాలు అందిస్తుంది. అయితే రాష్ట్రంలో మాత్రం ఇందుకు భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయని గుంటూరు జిల్లాలోని పాల ఉత్పత్తిదారుల సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రూ.50కోట్ల నుంచి రూ.1,100కోట్ల టర్నోవర్‌కు ఎదిగిన సంగం డెయిరీకి వైసీపీ ప్రభుత్వం ఏమాత్రం సహకారం అందించకపోగా అధికారంలోకి వచ్చిన నాటినుంచి దానిని దెబ్బ తీసేందుకు వ్యూహాలు పన్నుతోందని మండిపడుతున్నారు.ఈ డెయిరీ కోఆపరేటివ్‌ చట్టం పరిధిలోనే ఉంటే ఇప్పటికే దాన్ని తమ పార్టీ నేతలకు కట్టబెట్టి దివాళా తీయించేవారని ఆగ్రహిస్తున్నారు. అయితే ప్రస్తుతం అది కంపెనీ యాక్ట్‌లో ఉండటంతో ఏసీబీ కేసులు పెట్టి చైర్మన్‌ను, ఎండీని జైలుకు పంపారని ఆరోపిస్తున్నారు. వారిద్దరూ జైలులో ఉన్నందున ప్రజా ప్రయోజనం పేరిట దాని నిర్వహణ కోసం ప్రత్యేకంగా జీవో సిద్ధంచేసి ఏపీ డెయిరీ కిందకు తీసుకొచ్చారు. తెనాలి సబ్‌ కలెక్టర్‌కు సంగం డెయిరీ నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. 


అమూల్‌పై మమకారంతో... 

అంతకుముందు కూడా సంగం డెయిరీని నిర్వీర్యం చేసేందుకు అనేక రకాలుగా ప్రయత్నించారు. గుజరాత్‌కు చెందిన అమూల్‌ సంస్థను దత్తతకు తీసుకొని ప్రభుత్వ సహకారం అందించారు. రైతుల నుంచి సంగం డెయిరీకి వెళ్లే పాలను అమూల్‌కు మళ్లించేందుకు శతవిధాలుగా యత్నించారు. నేరుగా ప్రభుత్వ అధికారులే రంగంలోకి దిగి అమూల్‌కు కాకుండా సంగంకు పాలు పోస్తే ప్రభుత్వ పథకాలు రద్దు అవుతాయని పాల ఉత్పత్తిదారులకు హెచ్చరికలు జారీచేశారు. దీనికి సంబంధించి అధికారుల బెదిరింపుల ఆడియో టేపులు సైతం వెలుగుచూశాయి. ప్రభుత్వానికి చెందిన భవనాలు, స్థలాలను అమూల్‌కు అప్పగించి పాల సేకరణ కోసం వినియోగించుకునే అవకాశం కల్పించారు. ఇంత చేసినా సంగం హవాను గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో అడ్డుకోలేకపోయారు. రైతులకు ఆ సంస్థ కల్పిస్తున్న రాయితీలే ఇందుకు కారణం. పాడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం, ఏటా బోనస్‌ పేరుతో లాభాలు పంచిపెట్టడంతో అమూల్‌ ఆశించినంత పాలు సమీకరించుకోలేకపోయింది. 


దీంతో సంగంపై యుద్ధం చేయడం మానేసి... కుట్రతో ఈ డెయిరీలో ప్రభుత్వం కాలు మోపిందన్న భావన సర్వత్రా వ్యక్తమవుతోంది. ఇప్పుడు సంగంను దెబ్బతీసి అమూల్‌ను పెంచి పోషించేందుకు ఏకంగా జీవోనే జారీ చేశారు. ప్రభుత్వ సంస్థ ఏపీ డెయిరీ పరిధిలో ఉన్న ఆస్తులను అమూల్‌కు ధారాదత్తం చేస్తూ సీఎం జగన్‌ అధ్యక్షతన మంగళవారం జరిగిన కేబినేట్‌ సమావేశంలో తీర్మానించారు. ఈ జీవో ద్వారా రాష్ట్రంలో రూ.వేల కోట్లు విలువైన ప్రభుత్వ ఆస్తులు అమూల్‌కు సంక్రమించనున్నాయి. ఇప్పటికే ఏపీ డెయిరీ ఆధీనంలో ఉన్న ఆస్తులు సైతం అమూల్‌ పరం కానున్నాయి. సంగం డెయిరీ చైర్మన్‌ ధూళిపాళ్ల నరేంద్రతో పాటు ఎండీ గోపాలకృష్ణను అక్రమ కేసులతో జైలుకు పంపిన ప్రభుత్వం ప్రజా ప్రయోజనాలు కాపాడే నెపంతో రాత్రికి రాత్రి ప్రత్యేక జీవో తెచ్చి కంపెనీ యాక్ట్‌లో ఉన్న సంగం డెయిరీని తాత్కాలికంగా ఏపీ డెయిరీ పరిధిలోకి తీసుకొచ్చింది. కోర్టులో నరేంద్రకు అనుకూలంగా తీర్పు రాకపోతే సంగంను ఏపీ డెయిరీ పరిధిలోనే కొనసాగించే అవకాశం ఉంది. మంత్రిమండలి తాజాగా తీసుకున్న నిర్ణయంతో సంగం ఆస్తులు అమూల్‌ పరంచేసే అవకాశం ఏర్పడింది. కొన్ని దశాబ్దాలుగా పాడి రైతుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకొన్న సంగం మనుగడ న్యాయస్థానం ఇచ్చే తీర్పుపై ఆధారపడి ఉంది. 


నరేంద్రపైనే అక్కసుతోనే? 

టీడీపీ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌ రాజకీయంగా కొరుకుడు పడకపోవడమే సంగం డెయిరీపై ప్రభుత్వం అక్కసు పెంచుకోవడానికి ప్రధాన కారణంగా చెబుతున్నారు. పొన్నూరు నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి, దివంగత ధూళిపాళ్ళ వీరయ్యచౌదరి వారసుడిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన నరేంద్ర ... చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1994లో తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. అప్పటినుంచి 2014 వరకు వరుస విజయాలు సాధిస్తూనే ఉన్నారు. వైఎస్‌ హయాంలో 2004 ఎన్నికల్లో ఆనాటి కాంగ్రెస్‌ హవాలో జిల్లాలో ఒక్క పొన్నూరు మినహా మిగతా 18 స్థానాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులే విజయం సాధించారు. అంతటి ఎదురుగాలిలో కూడా టీడీపీ నుంచి నరేంద్ర విజయం సాధించి జిల్లాలో ఒకే ఒక్కడుగా నిలిచారు. జగన్‌ హయాంలో 2019 ఎన్నికల్లో కొన్ని వందల ఓట్ల తేడాతోనే అపజయాన్ని చవిచూశారు. ఆ తరువాత కూడా వైసీపీ ప్రభుత్వంపై రాజీలేని పోరాటం చేస్తుండటంతో ఆగ్రహించిన జగన్‌ కోటరీ నరేంద్రను జైలుపాలు చేసేవరకు నిద్రపోలేదన్న విమర్శలొస్తున్నాయి. ఆయనకు బెయిల్‌ వచ్చే లోపే సంగంను అష్టదిగ్బంధనం చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. కరోనా విలయ తాండవం చేస్తున్న తరుణంలో దాదాపు 25ఏళ్ల పాటు చట్టసభలో కొనసాగిన నేతను జైలుపాలు చేయటమే కాకుండా ఆయన ప్రాణాలతో సైతం చెలగాటం ఆడటంపై పాడి రైతుల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. 

Advertisement
Advertisement
Advertisement