పోలీసుల అదుపులో ఎర్రచందనం స్మగ్లర్లు?

ABN , First Publish Date - 2022-07-02T05:29:56+05:30 IST

జిల్లాలో ఎర్రచందనం స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న ఓ బడా స్మగ్లర్‌తో పాలు మరో నలుగురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం.

పోలీసుల అదుపులో ఎర్రచందనం స్మగ్లర్లు?
మీడియాతో మాట్లాడుతున్న బాధిత మహిళలు

కడప(క్రైం), జూలై 1: జిల్లాలో ఎర్రచందనం స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న ఓ బడా స్మగ్లర్‌తో పాలు మరో నలుగురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం. ఖాజీపేట నుంచి కడపకు కారులో వస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు కడప పరిఽధిలోని టోల్‌గేటు వద్ద స్మగ్లర్లను పట్టుకునే ప్రయత్నం చేసినప్పటికీ కారు అతి వేగంగా వెళ్లడంతో కడప ఆలంఖాన్‌పల్లె సమీపంలో దాడి చేసి పట్టుకున్నారు. వీరిలో బడా స్మగ్లర్‌తో పాటు అతనితో ఉన్న మరో ముగ్గరు, పులివెందుల ప్రాంతానికి చెందిన మరొకరిని అదుపులోకి తీసుకొని... ఎర్రచందనం దుంగలను రికవరీ చేసినట్లు తెలుస్తోంది.  ఎర్రచందనం టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది రెండు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి స్మగ్లర్లు ఇచ్చిన సమాచారం మేరకు మరి కొందరిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. రెండు రోజుల్లో వారిని అరెస్టు చూపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మా భర్తల ఆచూకీ తెలపండి సారూ...


కడప మారుతీనగర్‌, జూలై 1: ప్రొద్దుటూరు నుంచి కడపకు కారులో బయలుదేరిన మా భర్తలు ఫకృద్దీన్‌, యాసిన్‌ ఆచూకీ తెలపాలని చాపాడు మండలం ఖాదర్‌పల్లి వాసులు షాహిన్‌, మాబ్‌చాన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం వారు కడపలో మీడియాతో మాట్లాడుతూ ప్రొద్దుటూరు నుంచి కడపకు బయలుదేరిన ఫకృద్దీన్‌, యాసిన్‌లు తమ కారును పోలీసులు వెంబడిస్తున్నారని, మాకు అపాయం జరిగేలా ఉందని గురు వారం 30వ తేదీ ఉదయం 11-45 నిమిషాలకు ఫోన్‌ చేశారన్నారు. అప్పటి నుంచి ఇంతవరకూ వారి జాడ తెలియరాలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే పోలీసులు కారు ను మార్గమధ్యలో వెంబడించి ఆలంఖాన్‌పల్లి వద్ద పట్టుకున్నట్లు తెలిసిందన్నారు. అప్పటి నుంచి ఇంతవరకూ పోలీసులు వారి ఆచూకీ తెలపడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో వారిపై కేసులున్న మాట వాస్తవమేనని, ఆ మేరకు వారిని పట్టుకున్న సంగతిని గోప్యంగా ఉంచకుండా ఫలానా స్టేషన్‌లో ఉన్నారనే సంగతి బహిర్గతం చేయాలని జిల్లా పోలీసు అధికారులను వేడుకున్నారు. లేని పక్షంలో పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంటామన్నారు. రెండు రోజులుగా మాకు ఎలాంటి సమాచారం లేకపోవడంతో భయాందోళనకు గురౌతున్నామన్నారు.  

Updated Date - 2022-07-02T05:29:56+05:30 IST