తవ్వేయ్‌.. అమ్మేయ్‌!

ABN , First Publish Date - 2021-12-06T05:06:00+05:30 IST

అక్కన్నపేట మండలంలో ఇసుక అక్రమ రవాణా మూడు పువ్వులు.. ఆరు కాయలుగా కొనసాగుతున్నది. గ్రామాల్లో అభివృద్ధి పనుల పేరిట ఇసుకను తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. అధికారుల అండదండలతోనే ఈ దందా జరుగుతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. అక్కన్నపేట, గౌరవెల్లి, జనగామ గ్రామాల పరిధిలో వాగుల నుంచి వందల ట్రాక్టర్ల ఇసుక తరలిపోతున్నది. రాత్రివేళల్లో జేసీబీలతో ఇసుకను తవ్వి ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నారు.

తవ్వేయ్‌.. అమ్మేయ్‌!
అక్కన్నపేట మండలం గౌరవెల్లి వాగులో నుంచి ఇసుకను తరలించేందుకు వచ్చిన ట్రాక్టర్లు

అక్కన్నపేట మండలంలో జోరుగా ఇసుక దందా

వాగులను తవ్వేస్తున్న అక్రమార్కులు

అభివృద్ధి పనుల పేరిట రవాణా

ట్రాక్టర్‌ ఇసుక రూ. 5 వేలకు విక్రయం


అక్కన్నపేట, డిసెంబరు 5: అక్కన్నపేట మండలంలో ఇసుక అక్రమ రవాణా మూడు పువ్వులు.. ఆరు కాయలుగా కొనసాగుతున్నది. గ్రామాల్లో అభివృద్ధి పనుల పేరిట ఇసుకను తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. అధికారుల అండదండలతోనే ఈ దందా జరుగుతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. అక్కన్నపేట, గౌరవెల్లి, జనగామ గ్రామాల పరిధిలో వాగుల నుంచి వందల ట్రాక్టర్ల ఇసుక తరలిపోతున్నది. రాత్రివేళల్లో జేసీబీలతో ఇసుకను తవ్వి ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నారు. ట్రాక్టర్ల యజమానులు సిండికేట్‌గా ఏర్పడి ఒక్కో ట్రిప్‌ ఇసుకకు రూ. 4వేల నుంచి రూ. 5వేల చొప్పున వసూలు చేస్తున్నారు. ఎవరైనా అడ్డుకుంటే గ్రామాల్లో అభివృద్ధి పనుల కోసం ఇసుకను తరలిస్తున్నామని చెప్పి తప్పించుకుంటున్నారు. గట్టిగా నిలదీస్తే అభివృద్ధి పనులను అడ్డుకుంటున్నారని పోలీ్‌సస్టేషన్‌లో కేసులు పెడతామని బెదిరిస్తున్నారు. కొన్ని గ్రామాల్లో కిందిస్థాయి సిబ్బంది అండదండలతో దందా కొనసాగిస్తున్నారు. అడ్డుకోవాల్సిన ఉన్నతాధికారులు మామూళ్ల మత్తులో పరోక్షంగా సహకరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇసుకకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని అక్రమ రవాణాదారులు అందినంత దోచుకుంటున్నారు. అక్రమంగా తరలిస్తూ వాగులను కొల్లగొడుతున్నారు. ఆయా గ్రామాల్లో ప్రజలు, యువజన సంఘాలు ఇసుక అక్రమ రవాణాను అడ్డుకొని సంబంధిత శాఖల అధికారులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోవడం లేదని విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా మైనింగ్‌, రెవెన్యూ, పోలీస్‌ శాఖలు స్పందించాలని వారు కోరుతున్నారు.

Updated Date - 2021-12-06T05:06:00+05:30 IST