యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా

ABN , First Publish Date - 2021-02-27T05:20:06+05:30 IST

కొండపి నియోజకవర్గంలోని పాలేరు, ముసి పరివాహక ప్రాంతం ఇసుక అక్రమార్కులకు అడ్డాగా మారింది. జరుగుమల్లి మండలంలో అధికారిక రీచ్‌లు ఉండగా, మిగిలిన చోట్ల అనధికారికంగా క్వారీయింగ్‌ జరుగుతోంది. రోజుకు టన్నుల కొద్దీ ఇసుక ఇతర ప్రాంతాలకు అక్రమంగా తరలిపోతోంది. కామేపల్లి వద్ద ఉన్న రీచ్‌ నుంచి ఇసుకను నేరుగా ఒంగోలులోని యార్డుకు తరలించాల్సి ఉంది.

యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా
జరుగుమల్లి నుంచి సింగరాయకొండకు తోలుతున్న ఇసుక ట్రాక్టర్లను నిలిపిన స్థానిక నాయకులు

ముసి, పాలేరు తీర గ్రామాల్లో ఇదే వ్యవహారం 

అధికార పార్టీ నాయకులకు కలిసొచ్చిన కొరత

దొంగలు, దొంగలు ఊళ్లు పంచుకున్నట్లు దందా

మామూళ్ల మత్తులో అధికారులు, పోలీసులు 

అనామకుల మీదే ఎస్‌ఈబీ అధికారుల దాడులు 


కొండపి, ఫిబ్రవరి 25 :  ఇసుక బంగారమైంది. అది కొందరు అక్రమ రవాణాదారులకు వరమైంది. సర్కారు ఇసుక పాలసీ కూడా వారికి బాగా కలిసొచ్చింది. ప్రభుత్వ స్టాక్‌పాయింట్‌కు పోయేది ఒక ట్రిప్పు అయితే.. బయట అమ్మేది పది ట్రిప్పుల్లా పరిస్థితి తయారైంది. అధికారపార్టీ నాయకుల నుంచి అధికారుల వరకూ అందరికీ కాసుల వర్షం కురిపిస్తోంది. జిల్లాలో కొండపి మండలంలో ఇసుక రీచ్‌ లేకపోయినా ఇక్కడి నాయకులు వారి స్థాయికి మించి అక్రమంగా తోలుకుంటూ లక్షలు సంపాదిస్తున్నారు. ఈ మండలంలోని ఓ ముసితీర గ్రామంలో గడచిన సంవత్సరం పాతవి, కొత్తవి 10 ట్రాక్టర్లను కొనుగోలు చేశారంటే ఇసుక ప్రభావం ఎంతగా ఆ గ్రామంపై ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. జరుగుమల్లి మండలంలో అధికారిక రీచ్‌లు ఉన్నప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా ఇసుకనును తరలిస్తున్నారు. ఈ దందాను అడ్డుకోవాల్సిన ఎస్‌ఈబీ అధికారులు నామమాత్రపు దాడులతో సరిపెడుతున్నారు. పైగా ఇప్పటిదాకా పంచాయతీ ఎన్నికల్లో వారు బిజీగా ఉండటంతో అక్రమ రవాణాకు అడ్డే లేకుండాపోయింది. ఇపుడు అందరికీ తైలం ఇసుక నుంచే వస్తోంది.


 కొండపి నియోజకవర్గంలోని పాలేరు, ముసి పరివాహక ప్రాంతం ఇసుక అక్రమార్కులకు అడ్డాగా మారింది. జరుగుమల్లి మండలంలో అధికారిక రీచ్‌లు ఉండగా, మిగిలిన చోట్ల అనధికారికంగా క్వారీయింగ్‌ జరుగుతోంది. రోజుకు టన్నుల కొద్దీ ఇసుక ఇతర ప్రాంతాలకు అక్రమంగా తరలిపోతోంది. కామేపల్లి వద్ద ఉన్న రీచ్‌ నుంచి ఇసుకను నేరుగా ఒంగోలులోని యార్డుకు తరలించాల్సి ఉంది. కానీ అనధికారికంగా బయటకు భారీ మొత్తంలో వెళ్తున్నట్లు తెలుస్తోంది. చింతలపాలెంలో-2, బిట్రగుంటలో-2, జరుగుమల్లిలో-2 అధికారిక రీచ్‌లు ఉన్నాయి. వీటిని ఏపీఎండీసీ ద్వారా లీజుకు తీసుకున్న వారు 20 కి.మీ లోపు అమ్ముకోవచ్చు. కానీ అనుమతి పొందిన దానికంటే అధిక మొత్తంలో ఇసుకను తోడేస్తున్నారు. అధిక ధరలకు అమ్ముకొని సుదూర ప్రాంతాలకు కూడా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. వీటితోపాటు జరుగుమల్లి మండలంలోని ఇతర ప్రాంతాల్లో, కొండపి మండలంలోని ముసి, అట్లేరు పరివాహక గ్రామాల్లో అనధికారికంగా నాయకులు తమ పరపతిని వినియోగించి ఇసుకను అక్రమంగా అమ్ముకొంటున్నారు.  


ఎవరి సత్తా వారిదే..

ప్రైవేటు లీజుతో పనిలేకుండా ఎవరి అధికారబలం కొద్దీ వారు ఇసుకను తవ్వుకుని విక్రయించుకుంటున్నారు. అధికారపార్టీ నాయకులందరికీ సమాన బలాలు ఉన్నచోట ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకుని ఒకరి ట్రాక్టర్లను ఒకరు అడ్డుకొంటుండటం పలు గ్రామాల్లో పరిపాటిగా మారింది. తాజాగా జరుగుమల్లి మండలంలో ఇసుక కామేపల్లి స్టాక్‌ పాయింట్‌ మినహా మిగతా రీచ్‌లలో ఎత్తడం ఆగిందని అంటున్నారు. ఈ మండలంలోని రీచ్‌ల నుంచి నిబంధనలకు విరుద్ధంగా సింగరాయకొండలోని భారీ కట్టడాలు, ఫ్యాక్టరీలకు ఇసుక ఎటువంటి అనుమతి లేకుండాపోతోంది. కొందరు వివిధశాఖల కిందిస్థాయి సిబ్బందే ఈ ఇసుక తోలే కాంట్రాక్టులను తీసుకుని విక్రయించుకుంటున్నారని సమాచారం. సింగరాయకొండకు కూడా జరుగుమల్లిలో వ్యాపారం చేసే నాయకులే ఇసుక అమ్ముతుండటంతో అక్కడి నాయకులు గతనెలలో జరుగుమల్లి ట్రాక్టర్లను నిలేశారని తెలిసింది. నాయకులలో ఎక్కువమంది ఇసుక అక్రమదందా పనిలో ఉండటంతో తరచుగా జరుగుమల్లి మండలంలోని నాయకుల మధ్య విబేధాలు తలెత్తడం, అధికారులు కూడా ఒక్కోసారి ఒక్కొక్కరికి వంత పాడుతుండటంతో తరచుగా గొడవలు జరుగుతున్నాయి. పదేపదే ఇసుక ట్రాక్టర్లను నిలిపి వేసుకుంటున్నారు. 


కార్యదర్శి నుంచి సెబ్‌ అధికారుల దాకా...

ఇసుక కావాల్సిన వ్యక్తి గ్రామ పంచాయతీలో డిజిటల్‌ అసిస్టెంట్‌కు ఆధార్‌ కార్డు ఇచ్చి ఇంటి నిర్మాణానికి ఒక ఆధార్‌కు పది ఇసుక ట్రక్కులు అనుమతి పొంది తెచ్చుకోవచ్చు. అయితే ఇసుక విక్రయాలు జరుగుతున్న గ్రామాల వద్ద పంచాయతీకి టన్నుకు నిర్ణయించిన రేటు ప్రకారం ఇసుక అమ్మకందారులు చెల్లిస్తున్నారు. ట్రాక్టర్‌ ట్రక్కుకి రూ.100 అదనంగా ఇసుక అమ్మకందారులు గ్రామకార్యదర్శికి ఇస్తున్నారు. ఇసుకను యంత్రాల సాయంతో ఎత్తకూడదనే నిబంధన ఉన్నా, ప్రస్తుతం ఎక్స్‌కవేటర్ల సాయంతోనే ఎత్తుతున్నారు. దీనికి రూ.500 వసూలు చేస్తున్నారు. మొత్తంగా ట్రాక్టర్‌ ట్రక్కుకు అన్ని ఖర్చులు కలిపి రూ.1000 అవుతుండగా, ఇసుక అవసరమైన వారికి మాత్రం రూ.3వేల నుంచి రూ.4వేల వరకు పడుతోంది.


డిపోకు కాస్తే.. బయటకు టిప్పర్లకొద్దీ..

కామేపల్లిలో ప్రభుత్వ ఇసుక రీచ్‌ ఉంది. ఇక్కడ నుంచి కూడా ఒంగోలు స్టాక్‌పాయింట్‌తోపాటు ప్రైవేటుగా వినియోగదారులకు ఇసుక టిప్పర్లు కొద్దీ తరలిపోతున్నదంటున్నారు. ఎటువంటి బిల్లులు లేకుండా ప్రతిరోజూ ఒంగోలు మార్కాపురం పరిసర ప్రాంతాలకు అనేక టిప్పర్ల ఇసుక వెళ్తోంది. దొంగబిల్లులతో కూడా అనేక లారీల ఇసుక తరలిపోతున్నదని అంటున్నారు. ఇసుక టిప్పర్‌ డిమాండ్‌ను బట్టి రూ.30వేలకుపైగా ఉండటంతో అక్రమ వ్యాపారం ‘మూడు ట్రాక్టర్లు - ఆరు టిప్పర్లు’గా సాగిపోతోంది. 


చిన్న చేపలే బలి

ఇసుక సంపాదనగా ఉందని ట్రాక్టర్‌ తీసుకుని బయలుదేరితే బుక్కయిపోయినట్టే. ఇప్పటికే ఆయా శాఖల అధికారుల వద్ద పరపతి, మామూళ్లు ఇచ్చే ట్రాక్టర్ల నంబర్లు ఉంటున్నాయి. అనుమతితో ఇసుకను తరలిస్తున్నా కొత్త ట్రాక్టర్లను అధికారులు బెదిరిస్తున్నారు. ఎస్‌ఈబీ అధికారుల వైఖరి కూడా ఇంతే. నామమాత్రంగానే ఇసుక వాహనాలపై దాడులు చేస్తున్నారు. ఇపుడు కొత్తగా ఇళ్ల నిర్మాణాల వద్దకు వచ్చి కూడా ఇసుక ఎలా వచ్చిందని అడుగుతుండటం విశేషం. యథేచ్ఛగా ఇసుక అక్రమంగా తరలించే వారిని వదిలేసి, నామమాత్రంగా చెరువుల్లోని, గలుగు, తువ్వ ఇసుక తరలించే వారిపైనే కాకుండా, నిల్వలపైనా కేసులు నమోదు చేస్తున్నారు. దీంతో ఇపుడు అధికారులు పట్టుకున్న ఇసుకే పాడుకునేవారు లేక నిల్వలు పేరుకుంటున్నాయన్న విమర్శలున్నాయి. మొత్తంగా ఇసుకను కూడా ఇంటింటికీ రేషన్‌ సరుకుల మాదిరిగా ప్రభుత్వమే వాహనాలను ఏర్పాటు చేసి, జియోట్యాగింగ్‌ పెట్టి రవాణా చేస్తేనే గాని ఇసుక అక్రమదందా ఆగదని కొన్నిశాఖల అధికారులు అంటున్నారు.


అక్రమాలకు పాల్పడితే చర్యలు  


జరుగుమల్లి మండలంలోని రీచ్‌ల నుంచి పర్మిట్‌లు తీసుకున్నవారు ఆ ప్రకారం నిర్ణీత వేళల్లో తోలుతున్నారా? లేదా? అన్నది తెలుసుకునేందుకు రశీదులు పరిశీలిస్తాం. వాటిలో అవకతవకలు ఉన్నా, అనుమతులు లేకుండా ఇసుక తోలుతున్నా పట్టుకుని స్థానిక పోలీస్‌ స్టేషన్‌కు అప్పగిస్తాం.  ఇళ్ల నిర్మాణాలకు గ్రామ పంచాయతీ కార్యదర్శి అనుమతితో ఇసుక తోలుకోవచ్చు. కొండపి మండలంలో ప్రభుత్వ రీచ్‌లు లేవు.

-లత, ఎస్‌ఈబీ సీఐ, సింగరాయకొండ





Updated Date - 2021-02-27T05:20:06+05:30 IST