జగనన్న కాలనీలో ఇసుక దొంగలు

ABN , First Publish Date - 2022-08-13T06:33:41+05:30 IST

జగనన్న కాలనీలలో దొంగలు పడ్డారు.. ఇసుకను దోచుకుపోతున్నారు... ఇసుక పగలు లబ్ధిదారులకు చేరుతుండగా, రాత్రి సమయంలో అక్రమ మార్గంలో బయట ఇళ్ల నిర్మాణదారులకు చేరు తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

జగనన్న కాలనీలో ఇసుక దొంగలు
కాలనీల్లో డంపు చేసిన ఇసుక

లబ్ధిదారుల కోసం ప్రభుత్వం నుంచి ఇసుక సరఫరా

పక్కదారి పట్టిస్తున్న వైసీపీ నేతలు 

అద్దంకి, ఆగస్టు 12: జగనన్న కాలనీలలో దొంగలు పడ్డారు.. ఇసుకను దోచుకుపోతున్నారు... ఇసుక పగలు లబ్ధిదారులకు చేరుతుండగా, రాత్రి సమయంలో అక్రమ మార్గంలో బయట ఇళ్ల నిర్మాణదారులకు చేరు తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇంటి దొంగలే ఇసుక చోరీకి పాల్పడుతున్నారన్న విమర్శలు  వినిపిస్తు న్నాయి. అమరావతి ప్రాంతం నుంచి తీసుకొచ్చిన ఇసుక అద్దంకిలోని మూడు జగనన్న కాలనీలలో నిల్వ ఉంచారు. ఒక్కో లబ్ధిదారుడికి 20 టన్నుల ఇసుకను టన్ను రూ.175 చొప్పున ప్రభుత్వం అందజేస్తోంది. 20  టన్నులకు సంబంధించి రూ.3500 లబ్ధిదారునికి ఇచ్చే మొత్తం నుండి తగ్గించి మిగిలిన మొత్తాన్ని బ్యాంక్‌ ఖాతాలలో జమ చేస్తున్నారు. దీనిని బట్టి ప్రతి లబ్దిదారునికి ఖచ్చితంగా 20 టన్నుల ఇసుక అందించాల్సి ఉంది. కానీ ఎక్కువ మంది లబ్దిదారులకు మాత్రం 5 నుండి 10 టన్నుల ఇసుక మా త్రమే చేరుతోంది. ట్రాక్టర్‌ ట్రాలీ నిండుగా ఇసుక నింపితేనే 5 టన్నుల బరువు ఉంటుంది. కాని ఇసుక రవాణా చేసే కాంట్రాక్టర్‌ ద్వారా తరలించే ట్రాక్టర్‌ ట్రాలీ లో ఇసుక 2.50 నుండి 3 టన్నులకు మించి ఇసుక ఉండదని పలువురు అభిప్రాయ పడుతున్నారు. దీనికితోడు ఇప్పటికి పలువురు లబ్ధిదారులకు రెండేసి ట్రిప్పుల ఇసుక మాత్రమే  ఇవ్వగా, 20 టన్నుల ఇసుకకు చెల్లించాల్సిన  మొత్తం తగ్గించుకొని జమయ్యాయి.  ఇది చూసిన లబ్ధిదారులు ఆందోళనకు దిగుతున్నారు. దీనిపై ప్రశ్నించిన వారికి మాత్రం అరకొరగా ఇసుక సరఫరా చేస్తున్నారు.  ప్రస్తుతం ఆయా కాలనీల వద్ద డంప్‌ చేసిన ఇసుక నిల్వలు, సరఫరా చేసిన ఇసుక నిల్వల్లో భారీ వ్యత్యాసం ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. బయట మార్కెట్‌లో అమ్మకాలు చేస్తుండడమే దీనికి కారణమని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఇసుక అక్రమ మార్గాలలో తరలిస్తూనే ఇసుకను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించుకుపోయారని ఇసుక రవాణా కాంట్రాక్టర్‌ అధికారులు, ప్రజా ప్రతి నిధుల వద్ద చెప్పడం గమనార్హం. ‘దొంగే దొంగ..... దొంగ’ అని అరిచిన చందంగా ఉందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక ఇది చాలదన్నట్లు కాలనీలో ఇసుక డంపింగ్‌ వద్ద నుంచి లబ్ధిదారుని ఇంటి వద్దకు ఇసుక రవాణా చేసినందుకు కూడా నిబంధనలకు విరుద్దంగా అధిక వసూలు చేస్తున్నా రన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే గురువారం సాయంత్రం వేలమూరిపాడు రోడ్డు జగనన్న కాలనీలో ఓ లబ్ధిదారుని బంధువైన వైసీపీ నాయకుడు, ఇసుక రవాణా కాంట్రాక్టర్‌గా ఉన్న వైసీపీ నాయకుడి మధ్య తీవ్ర స్థాయిలో వాదోపవాదనలు జరగడంతో పాటు ఒకరిపై మరొకరు దాడి చేసుకునే వరకు చేరిందంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి లబ్దిదారులు అందరికీ, అందవలసిన మేర ఇసుక అందించే విధం గా చర్యలు చేపట్టాలని, రవాణా పేరుతో అధిక  వసూలును అరికట్టాలని పలువురు అభిప్రాయ పడుతున్నారు. పూర్తిస్థాయిలో విచారణ జరిపితే ఎంత మేర ఇసుక పక్కదారి పట్టిందో వెలుగు చూసే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.

Updated Date - 2022-08-13T06:33:41+05:30 IST