ఇసుక టెండర్లను రద్దు చేయాలి

ABN , First Publish Date - 2022-01-29T05:27:18+05:30 IST

రైతుల ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా ఉన్న ఇసుక టెండర్లను వెంటనే రద్దు చేయాలని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

ఇసుక టెండర్లను రద్దు చేయాలి
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న విజయరమణారావు

- మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు

సుల్తానాబాద్‌, జనవరి 28: రైతుల ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా ఉన్న  ఇసుక టెండర్లను వెంటనే రద్దు చేయాలని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సుల్తానాబాద్‌లో శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేవలం టీఆర్‌ఎస్‌ నేతల జేబులు నింపుకోవడానికి, ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఖజానాను నింపుకోవడం కోసమే ఈ ఇసుక టెండర్లకు శ్రీకారం చుట్టారని విమర్శించారు. సుల్తానాబాద్‌ మండలంలోని గొల్లపల్లి, గట్టేపల్లి, కదంబాపూర్‌, నీరుకుళ్ల, తొగర్రాయి ఓదెల మండలంలోని గుండ్లపల్లి, కనగర్తి, మడక, పొత్కపల్లి, రూప్‌నారాయణ పేట, ఇందుర్తి, గుంపుల, కాల్వ శ్రీరాంపూర్‌ మండలంలోని మీర్జంపేట, కిష్టంపేట, మొట్లపల్లి, చిన్కన రాతుపల్లి, శ్రీరాంపూర్‌ గ్రామాలతో పాటు పెద్దపల్లి జిల్లాలోని ముత్తారం, మంథని మండలాల్లో కూడా మానేరు పరివాహక ప్రాంతం ఉందని చెప్పారు. వీటితో పాటు హుస్సేనిమియా వాగు పరివాహక ప్రాంత గ్రామాల్లో కూడా ఇసుక విక్రయాలకు టెండర్లను పిలిచారన్నారు. గొల్లపల్లి నుంచి పెద్దపల్లి నియోజకవర్గంలోని చిన్నరాతుపల్లి వరకూ మానేరు వాగులో రైతులు మోటార్లను ఏర్పాటు చేసుకుని తమ పంటలను పండించుకుంటున్నారని తెలిపారు. ఈ టెండర్ల మూలంగా వారి సాగు విధానాలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని చెప్పారు.  రైతుల పొట్టకొట్టే ఇలాంటి టెండర్లను రద్దు చేయడంలో  మంత్రి కొప్పుల, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఎంపీలు చొరవ చూపాలన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా లారీల ద్వారా గ్రామాల నుంచి విచ్చలవిడిగా ఇసుకను తరలించేందుకు టీఆర్‌ఎస్‌ నేతలు చేసిన ప్రయత్నాలను తాము తిప్పకొడతామని హెచ్చరించారు. ఎవరూ కూడా ఈ ఇసుక టెండర్లలో పాల్గొనవద్దని ఆయన కోరారు. సమావేశంలో కాంగ్రెస్‌ నాయకులు అంతటి అన్నయ్య గౌడ్‌, మినుపాల ప్రకాశ్‌రావు. పార్టీ పట్టణ, మండల అధ్యక్షులు  అబ్బయ్య గౌడ్‌, సతీష్‌, పన్నాల రాములు, సాయిరి మహేందర్‌, ప్రదీప్‌, చింతల రాజు, అమిరిశెట్టి రాజలింగం, దున్నపోతుల రాజయ్య, పోచం, మధు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-01-29T05:27:18+05:30 IST