అటవీ ప్రాంతం నుంచి ఇసుక అక్రమ రవాణా

ABN , First Publish Date - 2021-06-23T07:13:18+05:30 IST

చంద్రగిరి మండలం పనపాకం పంచాయతీలో వైసీపీ నాయకుల అండతో ఆ గ్రామానికి చెందిన వ్యక్తి అటవీ ప్రాంతం నుంచి ఇసుకను అక్రమ రవాణా చేస్తున్నాడు.

అటవీ ప్రాంతం నుంచి ఇసుక అక్రమ రవాణా
అధికారులు స్వాధీనం చేసుకున్న ఇసుక ట్రాక్టర్‌

ట్రాక్టర్‌ను సీజ్‌ చేసిన సిబ్బందిపై వైసీపీ నేత దౌర్జన్యం 


చంద్రగిరి, జూన్‌ 22: చంద్రగిరి మండలం పనపాకం పంచాయతీలో వైసీపీ నాయకుల అండతో ఆ గ్రామానికి చెందిన వ్యక్తి అటవీ ప్రాంతం నుంచి ఇసుకను అక్రమ రవాణా చేస్తున్నాడు. మంగళవారం తెల్లవారుజామున అరిగిలవారిపల్లె అటవీ ప్రాంతంలో ఇసుక అక్రమ రవాణా చేస్తున్నట్లు అటవీశాఖ అధికారులకు సమాచారం వచ్చింది. డీఆర్వో ప్రదీప్‌కుమార్‌, బీట్‌ ఆఫీసర్‌ జ్యోతి, సిబ్బందితో అటవీ ప్రాంతంలోకి వెళ్ళి గాలించారు. ఒక ప్రాంతంలో ఇసుకను ట్రాక్టర్‌లో లోడ్‌ చేస్తుండగా అటవీ అధికారులు పట్టుకున్నారు. పనపాకంలోని ఫారెస్ట్‌ బంగ్లాకు ట్రాక్టర్‌ని తీసుకొస్తుండగా, అరిగిలవారిపల్లెకు రాగానే వైసీపీ నాయకులు అటవీ అధికారులను అడ్డగించారు. తమ గ్రామానికి చెందిన ట్రాక్టర్‌ని వదిలిపెట్టాలని, లేదంటే అటవీ సిబ్బందిని ఇక్కడ నుంచి బదిలీ చేయిస్తానంటూ ఓ నాయకుడు దౌర్జన్యానికి దిగాడు. అటవీ సిబ్బంది ఏమీ మాట్లాడకుండా ట్రాక్టర్‌ని పాకాల మండలం గాందంకి వద్దనున్న అటవీ చెక్‌పోస్టుకు తరలించారు. ఇసుకను అక్రమ రవాణా చేస్తున్న ట్రాక్టర్‌ అరిగిలవారిపల్లెకు చెందిన చెంగల్రాయులదిగా గుర్తించారు. వైసీపీ నాయకులు గాదంకి చెక్‌పోస్టుకు వెళ్ళి ట్రాక్టర్‌ని వదిలిపెట్టాలని మంతనాలు జరిపినా ఫలించలేదు. దీనిపై పనపాకం డీఆర్వో ప్రదీప్‌కుమార్‌ మాట్లాడుతూ.. అటవీ ప్రాంతంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌ని స్వాధీనం చేసుకొన్నామన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బుధవారం నిర్ణయం తీసుకొంటామని తెలిపారు. 

Updated Date - 2021-06-23T07:13:18+05:30 IST