ఇసుక దుమారం

ABN , First Publish Date - 2022-01-21T05:34:28+05:30 IST

ఇసుక కొరతపై అధికార పార్టీ జడ్పీటీసీలే గళమెత్తారు.

ఇసుక దుమారం
సమావేశంలో చైర్మర్‌, కలెక్టర్‌ తదితరులు

అధికార పార్టీ జడ్పీటీసీల ఆగ్రహం
కొరత తీవ్రంగా ఉందని మండిపాటు
పనులు ఆగిపోయాయని ఆందోళన
ప్రైవేటు ఆసుపత్రుల్లో దోపిడీ: పాణ్యం ఎమ్మెల్యే
వాడివేడిగా జడ్పీ తొలి సర్వసభ్య సమావేశం


కర్నూలు(న్యూసిటీ) జనవరి 20: ఇసుక కొరతపై అధికార పార్టీ జడ్పీటీసీలే గళమెత్తారు. రీచ్‌లు దూరంగా ఉండడంతో అధిక ధర చెల్లించి కొనాల్సి వస్తోందని నిలదీశారు. నిర్మాణాలు ఎక్కడికక్కడ ఆగిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాల్లో ఇసుక ఉన్నా తీసుకుందామంటే పోలీసులు అడ్డుపడుతున్నారని ఫిర్యాదు చేశారు. జిల్లా పరిషత్‌ మొట్టమొదటి సర్వసభ్య సమావేశం గురువారం వాడివేడిగా సాగింది. జిల్లా పరిషత్‌ సమావేశ భవనంలో చైర్మన్‌ ఎర్రబోతుల పాపిరెడ్డి అధ్యక్షతన ఉదయం 11.20 గంటలకు మొద లైంది. సమావేశానికి కలెక్టర్‌ పి.కోటేశ్వరరావు, జాయింట్‌ కలెక్టర్‌(హౌసింగ్‌) నారపురెడ్డి మౌర్య, జాయింట్‌ కలెక్టర్‌ (రెవెన్యూఅండ్‌ రైతు భరోసా) రామసుందర్‌రెడ్డి, జిల్లా పరిషత్‌ సీఈవో ఎం.వెంకటసుబ్బయ్య, పాణ్యం, బనగానపల్లె, నందికొట్కూరు ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, కాటసాని రామిరెడ్డి, తోగూరు ఆర్థర్‌, ఎమ్మెల్సీ చల్లా భగీరథరెడ్డి హాజరయ్యారు. కొవిడ్‌-19 (డీఎంఅండ్‌హెచ్‌వో), గృహనిర్మాణ శాఖ, గ్రామసచివాలయాల పనితీరుపై చర్చించారు.

ఇసుక కొరతపై వైసీపీ జడ్పీటీసీలు ఏమన్నారంటే..

మండలంలో ఇసుక కొరత తీవ్రంగా ఉందని, బయట నుంచి తెచ్చుకోవాలంటే సుమారు రూ.3 వేలు వెచ్చించాల్సి వస్తోందని దేవనకొండ జడ్పీటీసీ రామక్రిష్ణ అన్నారు. పక్కనే ఉండే వంకలో ఇసుక తీసుకునేందును అనుమతి ఇవ్వాలన్నారు. జగనన్న కాలనీలతో పాటు ప్రైవేటు నిర్మాణాలకు కూడా ఇసుక దొరకడం లేదన్నారు.

తమ మండలంలో ఇసుక బ్లాక్‌ మార్కెట్లో అమ్ముతున్నారని, ట్రాక్టర్‌ రూ.9వేల చొప్పున విక్రయిస్తున్నారని గడివేముల జడ్పీటీసీ ఆర్‌బీ చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. తక్షణమే ఇసుక మాఫియాను అరికట్టాలన్నారు.

తన మండలంలో ఇసుక ఇబ్బందులు తీవ్రంగా ఉన్నాయని మద్దికెర జడ్పీటీసీ మురళీధర్‌రెడ్డి అన్నారు.

ఇసుక రీచ్‌లు లేకపోవడంతో ప్రజలంతా సీఎం జగన్‌మోహన్‌రెడ్డిని తిట్టుకుంటున్నాని చిప్పగిరి జడ్పీటీసీ వీరుపాక్షినాయుడు అన్నారు.

హాలహర్విలో ఇసుక రీచ్‌ లేకపోవడంతో నిర్మాణలు ఆగిపోయాయని, వేదవతి నుంచి ఇసుక తీసుకునేందుకు అనుమతి ఇవ్వాలని జడ్పీటీసీ కోరారు.

కౌతాళం మండలం గుడికంబాల్‌లో ఇసుక ఉందని, అక్కడి నుంచి ఇసుక తీసుకునేందుకు అనుమతి ఇవ్వాలని జడ్పీటీసీ ఇందిరా ప్రియదర్శిని కోరారు.

కోసిగి, మహానంది జడ్పీటీసీలు, హొళగుంద, చిప్పగిరి ఎంపీపీలు మాట్లాడుతూ ఇసుక సమస్యను తక్షణమే తీర్చాలని కోరారు.

త్వరలోనే ఆలూరులో ఇసుక డిపోను ప్రారంభిస్తున్నట్లు హౌసింగ్‌ పీడీ తెలిపారు.

మరిన్ని సమస్యలు

ఇళ్లు కట్టుకున్న వారికి ఐపీలు వేరొకరివి వస్తున్నాయని, దీంతో లబ్ధిదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఓర్వకల్లు జడ్పీటీసీ రంగనాథగౌడు నిలదీశారు.
కొత్తపల్లి మండలంలో గిరిజనులకు ఇళ్లు మంజూరు చేయడం లేదని జడ్పీటీసీ సుధాకర్‌రెడ్డి అన్నారు.
తుగ్గలి మండలంలోని 14 తండాలలో ఒక్కరికి కూడా ఇల్లు మంజూరు కాలేదని జడ్పీటీసీ పులికొండ నాయక్‌ అన్నారు. స్థల సమస్య ఉందని అధికారులు చెప్పడంతో సొంత స్థలం ఇస్తానని జడ్పీటీసీ అన్నారు.
వెల్దుర్తి మండలంలో రామళ్లకోట గ్రామానికి వెళ్లే దారిలో ఎనిమిది లేఅవుట్లు వేశారని, అక్కడికి వెళ్లేందుకు ప్రజలు సుముఖత చూపడం లేదని జడ్పీటీసీ సుంకున్న తెలిపారు. లేఅవుట్లకు వెళ్లేందుకు రోడ్డు సదుపాయం లేదన్నారు.
కల్లూరు మండలం కొంగనపాడులో ఇళ్లు కట్టుకున్న వారికి ఇప్పటి వరకు బిల్లులు రాలేదని జడ్పీటీసీ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు.

ఎమ్మెల్యే కూడా..

జిల్లా వ్యాప్తంగా ఇసుక సమస్య తీవ్రంగా ఉందని బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ధ్వజమెత్తారు. గృహ నిర్మాణాలు వేగవంతంగా సాగడం లేదంటే ముఖ్యకారణం ఇసుక లేకపోవడమేనన్నారు. మూడు గ్రామాలకు కలిపి ఒకే చోట ఇళ్ల స్థలాలు ఇవ్వడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. గ్రామాలకు దూరంగా ఇళ్ల పట్టాలు ఇస్తే ప్రజలు ఎలా ముందుకు వస్తారని నిలదీశారు.

ప్రైవేటు ఆసుపత్రుల్లో దోపిడీ:

ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి

కొవిడ్‌ కేసులు పెరుగుతున్న తరుణంలో ప్రైవేటు ఆసుపత్రుల్లో దోపిడీ సాగుతోందని, దీన్ని అధికారులు అరికట్టాలని పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ధరల పట్టికను ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో ఏర్పాటు చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. కల్లూరు పీహెచ్‌సీలో ఉండే ఒకే ఒక వైద్యుడిని టిడ్కోకు ఎలా డిప్యుటేషన్‌ వేస్తారని ప్రశ్నించారు. 2019లో జడ్పీ ఆవరణలోని చైర్మన్‌ భవనాన్ని ఎందుకు పగలకొట్టారో సీఈవో సమాధానం చెప్పాలన్నారు.

పీహెచ్‌సీలలో వైద్యులు పని చేయడం లేదని, జాయిన్‌ అయిన రెండు వారాలకే డిప్యుటేషన్‌పై పట్టణాలకు వెళ్తున్నారని బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అన్నారు. తక్షణమే డిప్యుటేషన్లు రద్దు చేయాలన్నారు. బనగానపల్లెలో ఆక్సిజన్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేసినా కరెంటు సరఫరా లేదన్నారు.

కొన్ని మండలాల్లో అధికారులు ఇళ్ల పట్టాల కోసం చూపించిన స్థలం అనువైనది కాదని నందికొట్కూరు ఎమ్మెల్యే తోగూరు ఆర్థర్‌ అన్నారు. నందికొట్కూరులో ఇసుక రీచ్‌ ఏర్పాటు చేయాలన్నారు. పాములపాడులో ఉండే హెల్త్‌ఎడ్యుకేటర్‌, ఒక నర్సు నాలుగు సంవత్సరాలుగా డీఎంఅండ్‌హెచ్‌వో కార్యాలయంలో డిప్యుటేషన్‌పై విధులు నిర్వహిస్తున్నారని, తక్షణమే డిప్యుటేషన్‌ రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.

బనగానపల్లె నియోజకవర్గంలో ఇసుక కొరత తీవ్రంగా ఉందని ఎమ్మెల్సీ చల్లా భగీరథరెడ్డి అన్నారు. ఐదు మండలాలను కుడా పరిధిలోకి చేర్చి అవుకును మాత్రం ఎందుకు చేర్చలేదని నిలదీశారు. కొండగుట్టల్లో ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తే ప్రజలు ఎలా వెళ్తారన్నారు.

ముగ్గురు ఎమ్మెల్యేలే..

జిల్లా పరిషత్‌ మొదటి సర్వసభ్య సమావేశానికి ముగ్గురు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ మాత్రమే హాజరయ్యారు. ఇద్దరు ఎంపీలు, ఇద్దరు మంత్రులు, మిగతా ఎమ్మెల్యేలు రాలేదు. 53 మంది జడ్పీటీసీల్లో 39 మంది, ఎంపీపీలు 18 మంది వచ్చారు.

సమావేశంలో జడ్పీ డిప్యూటీ సీఈవో టీవీ భాస్కర్‌నాయుడు, వైస్‌ చైర్మన్లు దిల్షాద్‌నాయక్‌, కురువ బొజ్జమ్మ, కో ఆప్టెడ్‌ సభ్యులు సయ్యద్‌ అస్లాం ఖాద్రి, సయ్యద్‌ సులేమాన్‌, డీసీసీబీ చైర్మన్‌ శిరోమణి, వాల్మీకి కార్పొరేషన్‌ చైర్మన్‌ మధుసూదన్‌  పాల్గొన్నారు.

Updated Date - 2022-01-21T05:34:28+05:30 IST