Abn logo
Jul 31 2021 @ 01:20AM

ఇసుక కొరత

ఆలమూరు స్టాక్‌ యార్డ్‌లో ఇసుక నిల్వలు

  • బ్లాక్‌లో లారీ  రూ.26 వేలు పైనే
  • స్టాక్‌ ఉన్నా అమ్మడం లేదు
  • టన్ను రూ.850 వరకూ అమ్మే వ్యూహం
  • సోమవారం నుంచి ప్రభుత్వ అనుమతి వచ్చే అవకాశం
  • గోదావరి వరదతో జిల్లాలో అన్ని ర్యాంపులు మూత
  • వెలిచేరు తిరిగి ప్రారంభం

(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)

మళ్లీ ఇసుక కొరత ఏర్పడింది. గోదావరి వరదల వల్ల చాలా ర్యాంపులు మూతపడ్డాయి. జిల్లాలో పలు స్టాక్‌ పాయుంట్లలో 10 లక్షల టన్నుల వరకూ ఇసుక ఉంది. కానీ దానిని అమ్మడం లేదు. దీంతో జిల్లాలో ఇసుక కొరత మరింత అధికమైంది. అత్యవసర పనుల కోసం ప్రజలు బ్లాక్‌లో కొనుగోలు చేస్తున్నారు. లారీ ఇసుకను ఏకంగా రూ.26 వేల నుంచి రూ.30 వేల వరకూ కొనుగోలు చేయడం గమనార్హం. దీనికోసం కొందరు రాత్రుల సమయంలో కూడా ఇసుక తవ్వకాలు చేస్తున్నారు. లేదా అక్కడక్కడా దాచిన ఇసుకను అమ్ముకుంటున్నారు. వరద చాలా వరకూ తగ్గుముఖం పట్టడంతో వెలిచేరు ఓపెన్‌ ర్యాంపును శుక్రవారం ప్రారంభించారు. ఇంకా వరద తగ్గితే మిగతా ర్యాంపులు కూడా ఓపెన్‌ అయ్యే అవకాశం ఉంది. మొత్తం ర్యాంపులు ప్రారంభిస్తే ఇసుక సమస్య ఉండదు. కానీ ఇసుక వ్యాపారం దక్కించుకున్న జేపీ  సంస్థ స్టాక్‌ యార్డ్‌లలో ఇసుక అమ్మకపోవడంతో చాలా ఇబ్బంది ఏర్పడింది.

స్టాక్‌ యార్డ్‌లో టన్ను రూ.850?

ఇసుక ధరను మరింత పెంచే ఆలోచనలో ఈ కాంట్రాక్టు సంస్థ ఉంది. స్టాక్‌ యార్డ్‌లలోని ఇసుక టన్ను ధర రూ.850 వరకూ పెట్టాలని ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. అనుమతి కోసం ప్రభుత్వానికి కూడా ప్రతిపాదనలు పంపింది. బహుశా సోమవారం నుంచి అనుమతి రావచ్చని చెబుతున్నారు. ఇక్కడ టన్ను ధర రూ.850 చేస్తే ప్రజలకు తీవ్ర భారం పడుతుంది. ప్రభు త్వం నిర్ణయించిన ధర ప్రకారం ఇసుక టన్ను రూ.475కి అమ్మాలి. జీఎస్‌టీ వేసుకుని ఓపెన్‌ రీచ్‌లలో ఇంతవరకూ అలానే అమ్మారు. వరదల కారణంతో  ఓపెన్‌ రీచ్‌ల నుంచి కూడా ఇసుకను తెచ్చి స్టాక్‌ యార్డ్‌లలో పెట్టారు. అంతేకాక బోట్స్‌మన్‌ సొసైటీలు తీసిన ఇసుకను కూడా ఇక్కడకే తరలించారు. ఈ ఇసుకకు ధర వేరేగా నిర్ణయించారు. బోట్స్‌మన్‌ సొసైటీలు పడవల ద్వారా గోదావరిలోకి వెళ్లి ఇసుక తెస్తారు. అందువల్ల టన్నుకు రూ.218 వరకూ తీసు కుంటారు. ఈ ఖర్చుతోపాటు ప్రభుత్వం నిర్ణయించిన ధర రూ.475 కలిపి కొద్దిరోజులు వసూలు చేశారు. కానీ దీనిని ప్రజలు ప్రశ్నించడంతో బోట్స్‌మన్‌ సొసైటీలను ఆపేశారు. దాంతో బోట్స్‌మన్‌ సొసైటీలు తీసిన ఇసుక గోదావరి ఒడ్డున ఉండిపోయింది. వరదల సమయంలో జేపీ కాంట్రాక్టు సంస్థ ఈ ఇసుకను స్టాక్‌యార్డ్‌కు తరలించింది. ఇలా తరలించిన ఇసుక తక్కువే. కానీ ఇతర ఓపెన్‌ ర్యాంపుల నుంచి తరలించిన ఇసుకే ఎక్కువ. ఓపెన్‌ ర్యాంపుల నుంచి తరలించిన ఇసుక టన్ను ధర రూ.475 ఉండాలి. పోనీ స్టాక్‌ పాయిం ట్‌ వరకూ దానిని తెచ్చినందుకు అదనంగా రవాణా చార్జీలు తీసుకోవాలి. కానీ ఇక్కడ ఈ సంస్థ బోట్స్‌మన్‌ సొసైటీలు తీసిన ఇసుకను బూచిగా చూపి బోట్స్‌మన్‌కు  టన్నుకు రూ.218,  టన్ను ఇసుక ధర రూ.475తోపాటు జీఎస్‌టీ కలిపి టన్ను ధర రూ.675 వరకూ అమ్మేవాళ్లమని, దానిని స్టాక్‌ యార్డ్‌కు తరలించి, అక్కడ నిల్వ చేసి అమ్మాలంటే మరింత ధర పెంచాలని వాదిస్తోంది. ఈ నేపథ్యంలో టన్ను ధర రూ.850 చేయనున్నట్టు సమాచారం. గత ప్రభుత్వంలో ఇసుక ఉచితంగా లభిస్తే, వైసీపీ ప్రభుత్వం వచ్చాక టన్ను ధర రూ.375 చేసింది. ఇసుకను జేపీ సంస్థకు అప్పగించిన తర్వాత టన్ను రూ.475గా నిర్ణయించింది. ఇవాళ స్టాక్‌యార్డ్‌ పేరుతో రూ.850 కానుంది.

విశాఖ తరలించేశారు...

వరదరాక ముందు స్థానిక ప్రజకు అందుబాటులో ఉంచకుండా ఎక్కువ ఇసుకను విశాఖకే తరలించారు. జొన్నాడ, వేమగిరి, కాటవరం తదితర  ర్యాంపుల నుంచి వందలాది లారీల ఇసుక విశాఖకు తరలివెళ్లింది. అదే సమయంలో వరదలను దృష్టిలో ఉంచుకుని ఎక్కడికక్కడ స్టాక్‌యార్డ్‌లలో ఇసుక భద్రపరచి ఇప్పుడు కేవలం కొంత రవాణా చార్జీ కలిపి ఇసుక విక్రయిస్తే ప్రజలు ఉపయోగకరంగా ఉండేది. టన్ను ఇసుకను రూ.475కే నిర్ణయించి రవాణా చార్జీలు తీసుకున్నా ప్రజలకు బాగానే అందుబాటులో ఉండేది. ధర కూడా పెద్ద భారమయ్యేది కాదు. కానీ ఇప్పుడు ఇసుకే లేకుండా పోయింది.