పోలీసు శాఖలో ఇసుక దుమారం

ABN , First Publish Date - 2021-06-18T05:33:42+05:30 IST

జిల్లా పోలీసుశాఖలో ఇసుక దుమారం లేపుతోంది. పోలీసుశాఖలోని కిందిస్థాయి సిబ్బంది, అధికారులు ఇసుక తరలింపులో మామూళ్లు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలతో జిల్లా పోలీసు బాస్‌ సీరియస్‌గా తీసుకున్నారు.

పోలీసు శాఖలో ఇసుక దుమారం
మే 28న ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనం

- ఇసుక రీచ్‌ల వద్ద వసూళ్ల పర్వం
- ఇసుక లారీల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న పలువురు పోలీసు సిబ్బందిపై వేటు
- నలుగురు కానిస్టేబుళ్లను సస్పెండ్‌ చేసిన ఎస్పీ
- గతంలో ఓ సీఐను వీఆర్‌లోకి పంపిన వైనం
- అక్రమ ఇసుక దందా వసూళ్లపై సీరియస్‌గా తీసుకుంటున్న పోలీసుశాఖ
- ఇటీవల కింది స్థాయి సిబ్బంది వసూళ్లపై వెలుగులోకి తెచ్చిన ‘ఆంధ్రజ్యోతి’


కామారెడ్డి, జూన్‌ 17(ఆంధ్రజ్యోతి): జిల్లా పోలీసుశాఖలో ఇసుక దుమారం లేపుతోంది. పోలీసుశాఖలోని కిందిస్థాయి సిబ్బంది, అధికారులు ఇసుక తరలింపులో మామూళ్లు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలతో జిల్లా పోలీసు బాస్‌ సీరియస్‌గా తీసుకున్నారు. ఇదే విషయాన్ని ఇటీవల ‘ఆఽంధ్రజ్యోతి’ సైతం వెలుగులోకి తీసుకువచ్చింది. దీంతో ఇసుక తరలింపులో వసూళ్లకు పాల్పడుతున్న పోలీసుశాఖ క్షేత్రస్థాయి సిబ్బందిపై ఉన్నతాధికారులు నిఘా వర్గాలతో నిఘా పెట్టించి నివేదిక తెప్పించుకున్నారు. అక్రమ ఇసుక తరలింపులో మామూళ్లు వసూలు చేస్తున్న నలుగురు సిబ్బందిపై ఎస్పీ సస్పెన్షన్‌ వేటు వేయడం ఆ శాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అదేవిధంగా మిగతా సిబ్బందిలోనూ ఆందోళన నెలకొంటుంది. గత 3 నెలల కిందట ఇదే ఇసుక వివాదంలో ఓ సీఐని వీఆర్‌లోకి పంపగా తాజాగా మరో నలుగురు కానిస్టేబుళ్లను విధుల నుంచి తొలగించడం పోలీసుశాఖలో ఇసుక దుమారాన్ని రేపుతోంది.
మంజీరాలో కొనసాగుతున్న ఇసుక తవ్వకాలు
గత సంవత్సరన్నర కిందట జిల్లాలోని మంజీరా నదిలో ఇసుక తవ్వకాలకై ప్రభుత్వపరంగా అనుమతులు వచ్చాయి. అయితే బిచ్కుంద, బీర్కూర్‌, బాన్సువాడ మండలాల పరిధిలో మంజీరా నది గుండా టీఎస్‌ఎండీసీ ద్వారా 31.56 లక్షల క్యూబిక్‌ మీటర్ల ఇసుక తవ్వకాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. మొత్తం 6 పాయింట్ల వద్ద ఏడాదిన్నర నుంచి ఇసుక త వ్వకాలు జరుగుతున్నాయి. తవ్వకాలకు కాంట్రాక్ట్‌ తీసుకున్న గుత్తేదారులు ఆయా ప్రాంతాలకు ఇసుకను తరలిస్తున్నారు. అయితే స్థానికంగా ఉండే కాంట్రాక్టర్‌లు అధికలోడ్‌, వేబిల్లులు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న లారీలపై పోలీసుశాఖ నిఘా పెట్టింది. ఈ అక్రమ ఇసుక రవాణాను అరికట్టాల్సింది పోయి ఆ వాహనాల నుంచి స్థానికంగా ఉండే కొందరు పోలీసు సిబ్బంది అక్రమ వసూళ్లకు పాల్పడుతూ వాహనాలను పంపిస్తున్నారని విమర్శలు వస్తూనే ఉన్నాయి.
ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లతో పాటు మరో ఇద్దరిపైౖ వేటు
ఇసుక రవాణా విషయంలో మహిళా కానిస్టేబుళ్లు సైతం బలవంతపు వసూళ్లకు పాల్పడడం పోలీసుశాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇటీవల గాంధారి మండలంలోని మాధవపల్లి ఘటనలో ఓ మహిళా కానిస్టేబుల్‌ వివాహేతర సంబంధం వల్ల భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన మరవకముందే మరో ఇద్దరు కానిస్టేబుళ్లు ఇసుక రవాణాలో అక్రమ వసూళ్లకు పాల్పడడం ఆ శాఖలోని ఉన్నతాధికారులనే విస్మయానికి గురి చేస్తోంది. ఇలా పోలీసుశాఖలోని పలువురు మహిళా సిబ్బంది సైతం దారితప్పడంపై పోలీసుశాఖకు మాయని మచ్చ తెచ్చి పెడుతోంది. బిచ్కుంద మండలంలోని మంజీరా నదిలో ఇసుక తవ్వకాలు ప్రభుత్వపరంగా కొనసాగుతున్నాయి.స్థానికంగా ఉండే పోలీసుస్టేషన్‌ పరిధిలోని పలువురు క్షేత్రస్థాయి సిబ్బంది ఇసుక లారీల నుంచి బలవంతంగా వసూళ్లకు పాల్పడడం పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లాయి. ఇసుక లారీల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న నలుగురు కానిస్టేబుళ్లను గురువారం ఎస్పీ శ్వేతారెడ్డి సస్పెండ్‌ చేశారు. బిచ్కుంద పోలీసుస్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న సంతోష్‌, పరంధామయ్య, భవిత, మైస కళ ఇసుక క్వారీల నుంచి ఇసుకను తరలించే లారీల వద్ద డబ్బుల వసూళ్లకు పాల్పడ్డారు. దీంతో ఎస్పీ శ్వేతారెడ్డి వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటూ సస్పెన్షన్‌ ఉత్తర్వులు జారీ చేశారు.
గతంలోనూ ఓ సీఐ వీఆర్‌లోకి..
బాన్స్‌వాడ పోలీసు డివిజన్‌ పరిధిలోని కొందరు పోలీసు అధికారులు, సిబ్బంది ఇసుక వివాదంతో పాటు స్థానిక ల్యాండ్‌ సెటిల్‌మెంట్‌లోనూ, ఏదో ఒక పంచాయితీలోనూ ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. ప్రధానంగా బాన్సువాడ డివిజన్‌లో ఈ మధ్యకాలంలో ఇసుక వివాదంలోనే పలువురు పోలీసు అధికారులతో పాటు సిబ్బంది తలదూర్చడంపై ఆ శాఖ ఉన్నతాధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. గత సంవత్సరం కిందట మద్నూర్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో అక్రమ ఇసుక రవాణా విషయంలో పలువురు సిబ్బంది ఇసుక కాంట్రాక్టర్‌లతో డబ్బుల డిమాండ్‌ విషయంలో కాల్‌ రికార్డింగ్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. దీంతో ఇద్దరు కానిస్టేబుళ్లను ఇసుక వివాదంలో సస్పెండ్‌ చేశారు. అదే సమయంలో దోమకొండ, భిక్కనూర్‌ మండలంలోను ఇసుక అక్రమ రవాణాకు సహకరిస్తున్నారని పలువురు సిబ్బందిపై వేటు వేశారు. గత మూడు నెలల కిందట  బాన్సువాడ డివిజన్‌ పరిధిలోని ఓ సీఐని ఇసుక వివాదం విషయంలోనే వీఆర్‌లోకి పంపించారు. తాజాగా బిచ్కుంద పోలీసు స్టేషన్‌లో నలుగురు కానిస్టేబుళ్లను ఇసుక రవాణాలో బలవంతపు వసూళ్లకు పాల్పడుతుండడంతో జిల్లా పోలీసు బాసు సస్పెండ్‌ చేశారు. ఇలా తరచూ ఇసుక వివాదంలోనే వరుసగా పోలీసుశాఖ సిబ్బందిపై వేటు పడుతుండడంతో శాఖలోని మిగతా సిబ్బంది అధికారుల్లో భయం నెలకొంది.
అక్రమ వసూళ్లను వెలుగులోకి తెచ్చిన ‘ఆంధ్రజ్యోతి’
బాన్సువాడ డివిజన్‌ పరిధిలోని బిచ్కుంద, బీర్కూర్‌, బాన్సువాడ, నస్రుల్లాబాద్‌, మద్నూర్‌ మండలాల పరిధిలో మంజీరా నది గుండా ఇసుక రవాణా కొనసాగుతోంది. అయితే మంజీరా నదిలో కొన్నిచోట్ల ప్రభుత్వ పరంగా అనుమతులు ఉండగా మరికొన్ని చోట్ల అక్రమంగా ఇసుక తరలిస్తున్నారు. అయితే అనుమతులు ఉన్న ఇసుక క్వారీల నుంచే ఇసుక లోడ్‌లతో వెళ్తున్న, అధిక లోడ్‌లతో, వేబిల్లులు లేకుండా ఇసుక లారీలను తరలిస్తున్న విషయంలో స్థానికంగా ఉండే కొందరు పోలీసు సిబ్బంది బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారంటూ ‘ఆంధ్రజ్యోతి’లో ఇటీవల ‘పైసా వసూల్‌’ అనే శీర్షికతో కథనం ప్రచురితమైంది. దీంతో పోలీసుశాఖతో పాటు రె వెన్యూశాఖపై క్షేత్రస్థాయి సిబ్బందిపై నిఘా వర్గాలు నిఘా పెట్టాయి. ఇసుక లారీల విషయంలో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న వివరాలను నిఘా వర్గాలు ఆరాతీసి వివరాలు సేకరించి పోలీసు బాసుకు నివేదించినట్లు తెలిసింది. దీంతో వసూళ్లకు పాల్పడుతున్న సిబ్బందిపై పోలీసు ఉన్నతాధికారులు సీరియస్‌గా తీసుకొని సస్పెండ్‌ చేశారు.

Updated Date - 2021-06-18T05:33:42+05:30 IST