‘మైండ్’బ్లాక్

ABN , First Publish Date - 2020-05-31T09:41:10+05:30 IST

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక..

‘మైండ్’బ్లాక్

బ్లాక్‌ మార్కెట్‌లో యథేచ్ఛగా ఇసుక విక్రయాలు

జిల్లా మంత్రి కబ్జాలో రొయ్యూరు, నార్త్‌ వల్లూరు రీచ్‌లు

ఈ రీచ్‌ల్లో ఇసుక బుక్‌ చేయడం అసాధ్యం

అంతా బ్లాక్‌ మార్కెట్‌లోనే లభ్యం

ఆన్‌లైన్‌లో బుక్‌చేస్తే గండ్ర ఇసుకే..

నాణ్యమైన ఇసుక కావాలంటే బ్లాక్‌లో కొనాల్సిందే..

లబోదిబోమంటున్న నిర్మాణదారులు


విజయవాడ, ఆంధ్రజ్యోతి: విజయవాడకు చెందిన ఓ భవన నిర్మాణదారు ఇంటి నిర్మాణం కోసం ఇసుక బుక్‌ చేసుకునేందుకు ఆన్‌లైన్‌లో ప్రభుత్వ వెబ్‌సైట్‌ను ఆశ్రయించారు. నాలుగు రోజులు కుస్తీపడితే ఓరోజు విజయం సాధించారు. బుక్‌ చేసిన రెండు రోజులకు ఇసుక డెలివరీ అయింది. 18 టన్నుల ఇసుకను సుబ్బయ్యగూడెం రీచ్‌ నుంచి విజయవాడ చేర్చినందుకు రూ.22,693 చెల్లించారు. తీరా ఆ ఇసుక నిర్మాణ అవసరాలకు పనికిరాదని మేస్త్రి చెప్పడంతో భవన నిర్మాణదారు తెల్లబోయారు. వాగులో నుంచి తెచ్చిన గండ్ర ఇసుక నిండా రాళ్లు ఉన్నాయని, దీంతో ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేమని, పునాదుల్లో పోసుకోవడానికే పనికొస్తుందనడంతో అంత డబ్బు చెల్లించి తెప్పించుకున్న ఇసుకను నిరుపయోగంగా పక్కన పెట్టేశారు. తిరిగి మంచి ఇసుకను బ్లాక్‌లో 18 టన్నులు రూ.30వేలకు కొన్నారు.


విజయవాడకు చెందిన ఓ గృహ నిర్మాణదారు మే 27న శనగపాడు రీచ్‌ నుంచి ఇసుక బుక్‌ చేసుకున్నారు. మే 30 రాత్రి వరకు ఆయనకు ఇసుక డెలివరీ కాలేదు. ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకున్న వారి కన్నా ముందు అధికార పార్టీ నేతలకు బ్లాక్‌లో ఇసుక తరలిపోతుండటం ఆయన్ను విస్మయానికి గురిచేసింది. 


..ఇసుక పాలసీ అంటూ కొత్త సంస్కరణలను తెరపైకి తెచ్చిన వైసీపీ ప్రభుత్వం ఇలా అడుగడుగునా నిర్మాణదారులను దోచేస్తోంది. ఆన్‌లైన్‌ బుకింగ్‌ అంతా ఓ మాయగా మారగా,   బ్లాక్‌ మార్కెట్‌లో దొరికే ఇసుక ఓ మంత్రి కనుసన్నల్లో వైసీపీ నేతలకే అందుతోంది. సామాన్యులైతే అధిక ధరలకు కొనాల్సిన పరిస్థితి ఏర్పడింది. 


వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సంస్కరణల పేరుతో తెచ్చిన ఇసుక పాలసీ సామాన్యుల జేబులు గుల్ల చేస్తోంది. టీడీపీ హయాంలో ఉచిత ఇసుక అమలయ్యే రోజుల్లో తక్కువ ధరకు వచ్చిన ఇసుక ఇప్పుడు మూడు నాలుగు రెట్లు చెల్లించి కొనాల్సి వస్తోందని గృహనిర్మాణదారులు వాపోతున్నారు. 


ఆన్‌లైన్‌ అంతా మాయ

ఇసుక బుక్‌ చేసుకునే దగ్గర నుంచే సామాన్యులకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఆన్‌లైన్‌లో ఇసుక బుక్‌ చేసుకోవడం రానివారు నెట్‌ సెంటర్లను లేదా బ్రోకర్లను ఆశ్రయిస్తున్నారు. అక్కడ ఇసుక బుక్‌ చేసినందుకు రూ.100 వసూలు చేస్తున్నారు. రోజూ ఇసుక వెబ్‌సైట్‌ మధ్యాహ్నం 12 గంటలకు అందుబాటులోకి వస్తుంది. వచ్చిన 5 నిమిషాల్లోనే ఇసుక మొత్తం అయిపోయినట్లు చూపిస్తోంది. అది కూడా కేవలం ఆరు రీచ్‌ల్లోనూ ఇసుక అందుబాటులో ఉన్నట్లు చూపుతున్నారు. తూర్పు కృష్ణాలో కేవలం రొయ్యూరు, నార్త్‌ వల్లూరు రీచ్‌లు మాత్రమే ఉన్నాయి. వీటిలో కూడా కేవలం నార్త్‌ వల్లూరు రీచ్‌ మాత్రమే బుకింగ్‌ చేసుకునేందుకు అందుబాటులో ఉంచారు.


రొయ్యూరులో ఇసుక అంతా జిల్లాకు చెందిన ఓ మంత్రి కనుసన్నల్లో బ్లాక్‌ మార్కెట్‌కు వెళ్తోంది. ఈ రెండు రీచ్‌ల నుంచి బుక్‌ చేసుకుంటే నిర్మాణదారులకు రవాణా చార్జీలు తక్కువ పడతాయి. అదే పశ్చిమ కృష్ణాలో ఉన్న రీచ్‌ల నుంచి అయితే తడిసి మోపెడవుతుంది. 18 టన్నుల ఇసుక రొయ్యూరు నుంచి బుక్‌ చేసుకుంటే రవాణా చార్జీలు సుమారు రూ.3వేలు అవుతుంది. అదే సుబ్బయ్యగూడెం నుంచి బుక్‌ చేసుకుంటే రూ.15,943 చెల్లించాలి. అయితే, రొయ్యూరు, నార్త్‌ వల్లూరు రీచ్‌ల్లో ఇసుక బుక్‌ చేసుకోవడం సామాన్యులకు అయ్యే పనికాదు. ఇక్కడ ఇసుక అంతా జిల్లాకు చెందిన మంత్రి కనుసన్నల్లో బ్లాక్‌ మార్కెట్‌కు తరలిపోతోంది.


దీంతో సామాన్యులు విధి లేక పశ్చిమ కృష్ణాలో ఉన్న రీచ్‌ల నుంచి అధిక రవాణా చార్జీలు చెల్లించి బుక్‌ చేసుకోవాల్సి వస్తోంది. అది కూడా నాసిరకం ఇసుక సరఫరా చేస్తుండటంతో విధిలేక బ్లాక్‌ మార్కెట్‌లో 18 టన్నుల రొయ్యూరు ఇసుకను రూ.30వేలు చెల్లించి కొంటున్నారు. ఆన్‌లైన్‌లో దొరకని ఇసుక బ్లాక్‌ మార్కెట్‌లో ఎలా దొరుకుతుందన్నది సామాన్యుల ప్రశ్న. జిల్లా మంత్రి బ్లాక్‌ మార్కెట్‌ ఇసుక ఆదాయం రోజుకు రూ.20 లక్షలు పైచిలుకేనని సమాచారం. 


72 గంటల్లో డెలివరీ వట్టిమాట

ఆన్‌లైన్‌లో ఇసుక బుక్‌ చేసుకుంటే గరిష్టంగా 72 గంటల్లో డెలివరీ చేయాలి. కానీ అది జరగడం లేదు. నాసిరకం ఇసుక అయితే వెంటనే డెలివరీ చేస్తున్నారు. నాణ్యమైన ఇసుక మాత్రం రోజుల తరబడి వేచి చూస్తే కానీ దక్కని పరిస్థితి.

Updated Date - 2020-05-31T09:41:10+05:30 IST