ఇసుగెత్తించడంతో ర్యాంపుల మూత

ABN , First Publish Date - 2022-09-24T06:55:38+05:30 IST

డీఎస్పీ ఆదేశాలు పట్టించుకోలేదు.. ఎస్‌ఐ సూచనలు వినలేదు.. అంతా మా ఇష్టం అంటూ రోడ్డును ఆక్రమించేశారు.. చివ రకు పోలీసులు థర్డ్‌ డిగ్రీ ప్రయోగించడంతో కిక్కురు మనకుండా ఉండిపోయారు.

ఇసుగెత్తించడంతో ర్యాంపుల మూత
ఔరంగాబాద్‌ ర్యాంపు వద్ద స్తంభించిన ట్రాఫిక్‌

రోడ్డుపైనే ఇసుక లారీల నిలిపివేత
కి.మీ మేర నిలిచిపోతున్న ట్రాఫిక్‌
పోలీసుల సూచించినా పట్టని వైనం
శుక్రవారం భారీగా స్తంభించిన ట్రాఫిక్‌
ఆర్టీసీ బస్‌ల దారి మళ్లింపు
డీఎస్పీ శ్రీనాథ్‌కు సమాచారం
ర్యాంపుల తాత్కాలిక మూసివేత


కొవ్వూరు, సెప్టెంబరు 23 : డీఎస్పీ ఆదేశాలు పట్టించుకోలేదు.. ఎస్‌ఐ సూచనలు వినలేదు.. అంతా మా ఇష్టం అంటూ రోడ్డును ఆక్రమించేశారు.. చివ రకు పోలీసులు థర్డ్‌ డిగ్రీ ప్రయోగించడంతో కిక్కురు మనకుండా ఉండిపోయారు. గత వారం రోజులుగా కొవ్వూరు నిడదవోలు రహదారిలో ఏరినమ్మ ఘాట్‌, ఔరంగాబాద్‌, వాడపల్లి ఇసుకర్యాంపుల వద్ద ఇసుక లారీలు అస్తవస్తంగా నిలుపుదల చేయడంతో గంటల తరబడి వాహనాలు నిలిచిపోయి ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. డీఎస్పీ ఆదేశాల మేరకు గతంలో ఎస్‌ఐ రంగంలోకి దిగి లారీ డ్రైవర్లకు పలు సూచనలు చేశారు.ట్రాఫిక్‌కు ఇబ్బందులు సృష్టించ వద్దని సూచించారు. అయినా వినలేదు.  శుక్రవారం కొవ్వూరు రోడ్‌ కం రైలు బ్రిడ్జి ఏరినమ్మఘాట్‌ నుంచి ఔరంగాబాద్‌ ఇసుకర్యాంపు వరకు ట్రాఫిక్‌ కారణంగా వందలాది వాహనాలు నిలిచిపోయాయి. ఉదయం పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, ఉద్యోగులు ట్రాఫిక్‌లో చిక్కుకుపోయారు. తాడేపల్లిగూడెం, తణుకు బస్సులను ధవళేశ్వరం బ్యారేజ్‌ మీదుగా మళ్లించారు.నిడదవోలు, భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, పాలకొల్లు తదితర ప్రాంతాల నుంచి వచ్చే చిరు వ్యాపారులు, ఉద్యోగులు, వ్యాపారులతో రోడ్డు నిత్యం రద్దీగా ఉంటుంది. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన రహదారిలో ఏటిగట్టు వెంబడి అడుగడుగునా ఇసుకర్యాంపులను ఏర్పాటు చేశారు. ఇసుక కోసం వచ్చిన లారీలను రోడ్డుపై నిలిపి ఉంచ డంతో గంటల తరబడి ట్రాఫిక్‌ నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతు న్నారు.ఇసుక ర్యాంపుల  ట్రాఫిక్‌ నిబంధనలు పాటించకపోవడంతో రోజురోజుకు ట్రాఫిక్‌ సమస్య జటిలమైంది. ఉదయం ఆరు గంటలకు తీయవలసిన ఇసుక ర్యాంపులు 9 గంటల వరకు తెరవకపోవడంతో లారీలు రోడ్డుపై నిలిపివేస్తున్నారు. శుక్రవారం ఉద యం సుమారు ఐదు కిలోమీటర్ల మేర భారీగా ట్రాఫిక్‌ నిలిచిపోయింది.కనీసం నడవడానికి దారి లేకుండా పోయింది.ఈ మేరకు సమాచారం అందుకున్న డిఎస్పీ బి. శ్రీనాథ్‌ సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ నియంత్రణ చర్యలు చేపట్టారు. ఔరంగాబాద్‌, వాడపల్లి ఇసుకర్యాంపులను తాత్కాలికంగా మూయించివేశారు.ఇకనైనా పోలీస్‌, రెవెన్యూ, రవాణా శాఖ అధికారులు స్పందించి ఇసుకర్యాంపుల వద్ద ట్రాఫిక్‌ కష్టాలను పరిష్కరించాలని స్థానికులు, వాహనదారులు కోరుతున్నారు.



Updated Date - 2022-09-24T06:55:38+05:30 IST