ఇసుక నేరుగా కొనుక్కోవచ్చు!

ABN , First Publish Date - 2021-04-17T09:56:14+05:30 IST

నూతన ఇసుక పాలసీలో కీలక సవరణలు చేస్తూ గనుల శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. కొత్తగా ఇసుక తవ్వకాలు, అమ్మకాలు చేపట్టబోతున్న కాంట్రాక్టరు

ఇసుక నేరుగా కొనుక్కోవచ్చు!

ఆన్‌లైన్‌ అగచాట్లకు స్వస్తి.. ఎడ్ల బళ్లకే ఉచితం.. ట్రాక్టర్లకు కాదు

ఇసుక పాలసీకి సవరణలు.. మళ్లీ పాత విధానం అమలు


అమరావతి, ఏప్రిల్‌ 16 (ఆంధ్రజ్యోతి): నూతన ఇసుక పాలసీలో కీలక సవరణలు చేస్తూ గనుల శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. కొత్తగా ఇసుక తవ్వకాలు, అమ్మకాలు చేపట్టబోతున్న కాంట్రాక్టరు ఆఫ్‌లైన్‌లో ఇసుక కొనుగోలుకు చర్యలు తీసుకోవాలని స్పష్టంచేసింది. ఎవరైనా నేరుగా రీచ్‌ లేదా స్టాకు యార్డుకు వెళ్లి.. ఇసుక నాణ్యతను పరిశీలించుకున్న తర్వాత అక్కడే నగదు చెల్లించి ఇసుక తీసుకోవచ్చని తెలిపింది. అయితే సమీపంలోని ప్రజలు ఇప్పటివరకు ఎడ్ల బళ్లతో పాటు ట్రాక్టర్లలో ఉచితంగా తీసుకెళ్లే అవకాశం ఉండేది. ఇప్పుడు ట్రాక్టర్లను తొలగించింది. కేవలం ఎడ్ల బళ్లలో మాత్రమే సొంత అవసరాలకు ఇసుక తీసుకెళ్లాలని స్పష్టంచేసింది. ‘ప్రభుత్వం నిర్ణయించిన ధరల ప్రకారమే కాంట్రాక్టరు ఇసుక విక్రయించాలి. కొనుగోలుదారులు సొంత వాహనాల్లో గానీ.. లేదా కాంట్రాక్టరు వద్ద ఉన్న వాహనాలతో గానీ ఇసుక తీసుకెళ్లవచ్చు.


ప్రభుత్వ బలహీన వర్గాల ఇళ్ల నిర్మాణం, ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ పనులకు ఉచితంగా ఇసుక సరఫరా చేయాలి. దీనికి కూపన్ల విధానం అమలుచేయాలి. కాంట్రాక్టరు ప్రతి రీచ్‌కు సరిహద్దులు కచ్చితంగా ఏర్పాటుచేసుకోవాలి. రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ముందుగానే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న స్టాక్‌ యార్డుల్లో ఇసుక అందుబాటులో ఉంచాలి. ప్రతి కొనుగోలుదారుకు అమ్మకం బిల్లులు, వాహనం నంబరుతో సహా ఇవ్వాలి. ఏడాది మొత్తం ఇసుక అందుబాటులో ఉండేలా చూడాలి. తవ్వకం విషయంలో గనుల శాఖ నిబంధనలు కచ్చితంగా పాటించాలి. దీనిపై అధికారులతో సమన్వయం చేసుకోవాలి. కాంట్రాక్టరు రాష్ట్రంలో ఇసుకను ఎక్కడికైనా అమ్ముకోవచ్చు’ అని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇసుక అక్రమాలపై జిల్లా కలెక్టరు ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటుచేయాలని ఆదేశించింది.

Updated Date - 2021-04-17T09:56:14+05:30 IST