తొగూరుపేట గ్రామంలో పంట భూముల్లో ఇసుక మేటలు
అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోయి పంటపొలాల్లో ఇసుక మేటలు
తొలగించేందుకు జేపీ సంస్థకు అప్పగించిన అధికారులు
ఇసుక రేటుపై తెగని పంచాయితీ
రక్షణ గోడపై స్పష్టత ఇవ్వాలంటున్న రైతులు
ఇసుక తొలగించక ఆందోళనలో అన్నదాతలు
అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోయి చెయ్యేరు తీర గ్రామాల్లో వరద విధ్వంసం సృష్టించింది. పచ్చని పంట పొలాలను ఛిద్రం చేసింది. వందల హెక్టార్లలో ఇసుక మేటలు వేసింది. వ్యవసాయా నికి పనికిరాకుండా కోతకు గురయ్యాయి. పొలాల్లో మేటలు వేసిన ఇసుకను తీసుకెళ్లేందుకు జేపీ సంస్థకు జిల్లా మైనింగ్ అధికారులు అప్పగించారు. రైతుకు టన్నుకు రూ.60 ఇస్తామని జేపీ సంస్థ చెబితే.. రూ.200 ఇవ్వాలని, రక్షణ గోడ నిర్మాణంపై స్పష్టమైన హామీ ఇవ్వాలని రైతులు విన్నవించారు. దీంతో ఈ ప్రక్రియ ఆగింది. ఇసుక మేటల తొలగింపు మొదలు కాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
(కడప-ఆంధ్రజ్యోతి): జిల్లాలో గత నవంబరులో అతిభారీ వర్షాలు కురిశాయి. అదే నెల 19న అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోవడంతో రాజంపేట మండలం పులపత్తూరు, మందపల్లి, పాపరాజుపల్లె, గుండ్లూరు, తొగూరుపేట, రామచంద్రాపురం, హేమాద్రివారిపల్లె గ్రామాల్లో పచ్చని పంట పొలాలు దెబ్బతిన్నాయి. జిల్లా అంతటా 220.07 హెక్టార్లలో ఇసుక మేటలు వస్తే.. 270.77 హెక్టార్లు పంటచేలు కోతకు గురయ్యాయని అధికారులు గుర్తించారు. అందులో ముప్పాతిక శాతం అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోవడంతో దెబ్బతిన్నవే ఉన్నాయని రైతులు అంటున్నారు. సీఎం జగన ఆ గ్రామాల్లో పర్యటించినప్పుడు ఇసుక మేటల తొలగింపునకు హెక్టారుకు రూ.12,500 ఇస్తామని ప్రకటించారు. ఈ మేరకు రైతు పొలాల్లో మేటలు వేసిన ఇసుకను తొలగించే బాధ్యతను జేపీ సంస్థకు అప్పగించారు. రైతుకు టన్నుకు రూ.60 ఇచ్చి పొలాల్లో ఇసుకను తీసుకెళ్తామని మైనింగ్ అధికారులు, జేపీ సంస్థ ప్రతినిధులు సూచించారు. ఇసుక కాంట్రాక్టరు టన్ను రూ.475లకు విక్రయిస్తున్నారు. అందులో కనీసం రూ.200-250 తమకు ఇవ్వాలని రైతులు డిమాండ్ చేశారు. మళ్లీ వరదొచ్చినా పంట పొలాలు ముంపునకు గురికాకుండా రక్షణ గోడల నిర్మాణంపై స్పష్టమైన హామీ ఇచ్చాకే ఇసుక రతలించాలని అన్నారు. దీంతో పొలాల్లోని ఇసుక మేటలు తొలగించే ప్రక్రియ ఆగిపోయింది. నది ఇసుకతో పోలిస్తే మేటలు వేసిన ఇసుక నాణ్యత తక్కువేనని మైనింగ్ అధికారులు అంటున్నారు. తాజాగా జిల్లాలోని అన్ని నదుల్లో వరద తగ్గడం, ఇసుక రీచులు తెరుచుకోవడం వల్ల జేపీ సంస్థ పొలాల్లోని ఇసుకను తీసుకెళ్లడానికి ఆసక్తి చూపడం లేదని సమాచారం. ప్రజా ప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారులు కూడా పట్టించుకోకపోవడంతో రైతులకు ఇసుక కష్టాలు తప్పడం లేదు. పొలాల్లో ఇసుక తొలగించి సాగు యోగ్యంలోకి తీసుకురండి...! అని రైతులు విన్నవిస్తున్నా పట్టించుకునేవారే కరువయ్యారు. దీంతో వచ్చే ఖరీఫ్‌లో ఇక్కడి పొలాల్లో పంటల పాగు ప్రశ్నార్థకంగా మారింది.
అన్నదాత విన్నపాలు ఇవీ
ఇసుక మేటలు తొలగించేందుకు ప్రభుత్వం హెక్టారుకు రూ.12,500 ఇస్తామంది. వరదకు సర్వం కోల్పోయి రూ.లక్షలు, కోట్లు నష్టపోయాం. ఆ రూ.12,500తో కష్టాలు తీరవు. ప్రభుత్వమే ఇసుక మేటలు పూర్తిగా తొలగించి.. సాగు భూములను పూర్వస్థితికి తీసుకురావాలి.
వరద ఉధృతికి అడ్డదిడ్డంగా కోతకు గురైన పంట పొలాల్లో గుంతలను ప్రభుత్వమే పూడ్చి చదును చేయించాలి. సాగు యోగ్యంగా మార్చాలి. ఈ పనులు వచ్చే ఖరీఫ్‌లోగా పూర్తి చేయాలి.
చెయ్యేరుకు మళ్లీ వరదొచ్చి పంట పొలాలు, గ్రామాలు ముంపునకు గురికాకుండా రానున్న వర్షాకాలం నాటికి సిమెంట్‌తో రక్షణ గోడలు నిర్మించాలి.
నదితీరంలో బోరుబావులు, విద్యుత మోటార్లు, కేబుల్స్, డ్రిప్ పరికరాలు కొట్టుకుపోయాయి. వాటిని తిరిగి ఏర్పాటు చేసుకోవాలంటే ఎంత తక్కువ కాదన్నా రూ.2.50-3 లక్షలకు పైగా ఖర్చు వస్తుంది. రైతులకు అది మోయలేని భారమే. ప్రభుత్వమే వైఎస్ఆర్ జలసిరి పథకం ద్వారా బోరుబావులు తవ్వించాలి. విద్యుత మోటార్లు, ట్రాన్సఫార్మర్లు, విద్యుత లైన ఏర్పాటుతో పాటు ఏపీ మైక్రో ఇరిగేషన ప్రాజెక్టు కింద డ్రిప్ వంద శాతం సబ్సిడీతో ఇవ్వాలి.
మొదట్లో రైతులు ఆసక్తి చూపలేదు
- రవిప్రసాద్, మైనింగ్ ఏడీ, కడప
కలెక్టరు ఆదేశాల మేరకు పులపత్తూరు, మందపల్లి, తొగూరుపేట గ్రామాల్లో పొలాల్లో ఇసుక మేటలు తొలగిం చేందుకు జేపీ సంస్థను ఒప్పించాం. డ్రోజర్లు, ఎక్స్కవేటర్లను గ్రామాలకు తీసుకెళ్లాం. మొదట్లో రైతులు ముందుకు రాలేదు. 15 రోజుల పాటు వారిని ఒప్పించే ప్రయత్నం చేశాం. ప్రస్తుతం రైతులే ఇసుక మేటలు తొలగించాలని కోరుతున్నారు. ఇసుక రీచులు ఓపెన కావడంతో యంత్రాల సమస్య వల్ల జేపీ సంస్థ ముందుకు రావడం లేదు. నది ఇసుకతో పోలిస్తే.. పొలాల్లో మేటలు వేసిన ఇసుక నాణ్యత తక్కువ. రైతుల విన్నపాలను జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లి తగు చర్యలు తీసుకుంటాం.