అడవిలో ఇసుక వేట

ABN , First Publish Date - 2020-12-03T05:45:17+05:30 IST

ఇసుక కోసం అటవీ భూములను అడ్డంగా తవ్వేస్తున్నారు.

అడవిలో ఇసుక వేట
అటవీ ప్రాంతంలో ఇసుక అక్రమ తవ్వకాలు

  1. అడ్డంగా తవ్వేస్తున్న అక్రమార్కులు
  2. కుప్పగల్‌ ప్రాంతంలో గుట్టుగా తతంగం
  3. యంత్రాలతో తవ్వకాలు.. ట్రాక్టర్లలో తరలింపు


ఎమ్మిగనూరు,  డిసెంబరు 2: ఇసుక కోసం అటవీ భూములను అడ్డంగా తవ్వేస్తున్నారు. అటవీ ప్రాంతంలో ఇసుక పేరుకుపోయిన ప్రాంతాలను గుర్తించి గుట్టు చప్పుడు కాకుండా యంత్రాలతో పైమట్టిని తొలగించి అడుగు భాగంలో ఉన్న ఇసుకను తీసి ట్రాక్టర్ల ద్వారా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. కౌతాళం మండలంలోని ఏరిగేరి, ఆదోని మండల పరిధిలోని పెద్దతుంబళం గ్రామాల పరిధిలో ఈ తతంగం సాగుతోంది. ఈ రెండు ప్రాంతాల మధ్య ఉన్న కుప్పగల్‌ అటవీ ప్రాంతంలో కొన్ని రోజులుగా ఇసుక తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. ఎరిగేరి ప్రాంతానికి చెందిన కొంతమంది అధికార పార్టీ నాయకులు అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇసుక కొరత ఉండటం, ఇసుకకు మంచి డిమాండ్‌ ఉండటంతో ఇసుక కోసం అటవీ ప్రాంతాన్ని ఎంచుకు న్నారు. ముందుగా ఎక్స్‌కవేటర్లతో తవ్వి ఇసుకను సిద్ధం చేస్తున్నారు. ఆ తరువాత ట్రాక్టర్ల ద్వారా ఏరిగేరి గ్రామానికి తరలించి.. అక్కడి నుంచి టిప్పర్లలో ఇతర ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకునే వారు. అయితే గత నాలుగు రోజులుగా అడవి నుంచి తెచ్చిన ఇసుకను గ్రామసమీపం లోని పుల్లగట్టయ్య ఆంజనేయ స్వామి గుడి వద్ద నిల్వ చేస్తున్నారు. అక్కడి నుంచి టిప్పర్ల ద్వారా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. 


అడవికి దెబ్బ

ఇసుక కోసం అడ్డంగా తవ్వేస్తుండటంతో అటవీ ప్రాంతంలో మొక్కలు దెబ్బతింటున్నాయి. ఈత చెట్ల కింద ఉన్న చిన్న చిన్న మొక్కల అడుగు భాగంలో ఇసుక కోసం తవ్వుతున్నారు. దీంతో వృక్షాల వేర్లు బయటకు తేలుతున్నాయి. అక్రమ తవ్వకాలు కొనసాగితే వృక్ష సంపద అంతరించి పోతుందని పర్యావరణ ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు నెలరోజులుగా ఈ వ్యవహారం సాగుతున్నా అటవీ శాఖ అధికారులు పట్టించుకోకపోవటం అనుమానాలకు తావిస్తోంది


నెలరోజులుగా..

ఎరిగేరి గ్రామానికి చెందిన ఓ అధికార పార్టీ నాయకుడు రెండు ట్రాక్టర్లను ఏర్పాటు చేసుకొని నెల రోజులుగా ఇసుక తవ్వకాలు జరిపిస్తున్నట్లు తెలిసింది. రోజుకు ఆరు నుంచి ఏడు ట్రిప్పుల ఇసుకను అటవీ ప్రాంతం నుంచి గ్రామానికి చేరుస్తున్నారని, అక్కడి నుంచి టిప్పర్‌ ద్వారా రాత్రికి రాత్రే ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు తెలిసింది. ట్రాక్టర్‌లో ఒక ట్రిప్పు ఇసుకను స్థానికంగా రూ.3,500కు విక్రయిస్తున్నట్లు తెలిసింది. టిప్పర్‌ ఇసుక రూ.15 వేలకు పైగా పలుకుతోంది.  

Updated Date - 2020-12-03T05:45:17+05:30 IST