గేట్ల వద్ద ఇసుక జామ్‌!’

ABN , First Publish Date - 2022-08-05T09:33:32+05:30 IST

కాళేశ్వరం పరిధిలోని మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలను ఇసుక టెన్షన్‌ పెడుతోంది.

గేట్ల వద్ద ఇసుక జామ్‌!’

  • మేడిగడ్డ, అన్నారంలో ఇసుక మేటలు
  • బ్యారేజీల గేట్లు మూయలేనంతగా కుప్పలు
  • రేప్పొద్దున వరద తగ్గితే పరిస్థితి ఏమిటి? 
  • అన్నారంలోకి మానేరు రీచ్‌ల నుంచే రాక
  • ఇక్కడ 10లక్షల క్యూబిక్‌మీటర్ల మేర  ఇసుక
  • వరద నెమ్మదించడంతో తోడేందుకు చర్యలు
  • సర్కారుకు అధికారుల ప్రతిపాదనలు


భూపాలపల్లి, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం పరిధిలోని మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలను ఇసుక టెన్షన్‌ పెడుతోంది. భారీ వరదలతో లోపలివైపు బ్యారేజీల గేట్ల పరిసరాల్లో, గేట్ల కింద భారీగా ఇసుక మేటలు వేశాయి. తెరిచిన గేట్లను పూర్తిస్థాయిలో మూసివేయాలంటే సాధ్యపడని పరిస్థితి నెలకొంది. అంటే, ఏ స్థాయిలో ఇసుక మేటలు వేసిందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైతే ఎగువ నుంచి ప్రవాహం వస్తుండడంతో వచ్చిన నీటిని వచ్చినట్లుగా దిగువకు వదులుతున్నారు. ప్రవాహం పూర్తిగా తగ్గిపోయినప్పుడు గేట్లను మూసివేయాలంటే పరిస్థితి ఏమిటి? అని అధికారులు హైరానా పడుతున్నారు. అదేసమయంలో ఈ బ్యారేజీల గేట్ల వద్ద ఇసుకను తోడేసేందుకు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నారు.  10.87 టీఎంసీల సామర్థ్యంతో ఉన్న అన్నారం బ్యారేజీలోకి ఎగువన సుందిళ్ల బ్యారేజీ నుంచి గోదావరి నీళ్లు.. ఉపనది మానేరు నీళ్లు కలిపి పెద్ద ఎత్తున వరద వస్తోంది. గత మూడు నెలలుగా మానేరు ఎగువన టీఎస్‌ఎండీసీ ద్వారా ఇసుక విక్రయాలు చేస్తున్నారు. వానాకాలం కావటంతో మానేరు నుంచి ఇసుక తీసి పక్కన రీచ్‌లలో నిల్వ చేశారు. కొన్ని చోట్ల మానేరు ఒడ్డునే నిల్వ చేశారు.ఇటీవల వర్షాలు భారీగా పడటంతో మానేరుకు వరద తాకిడి పెరిగి, నిల్వ చేసిన ఇసుక మొత్తం వరదతో పాటు అన్నారం బ్యారేజీలోకి కొట్టుకొచ్చింది. దీంతో పాటు చాలా ఏళ్లుగా మానేరులో ఇసుక పూడిక తీయకపోవడంతో ఆ ఇసుక కూడా వరదతో పాటు బ్యారేజీలోకి చేరి గేట్ల వరద్ద పేరుకుపోయింది. 


వరద తగ్గడంతో  బ్యారేజీలో ఉన్న నీటిని నిల్వ చేసేందుకు 66 గేట్లు మూసివేయాల్సి ఉంది. అయితే గేట్లను దించినా ప్రయోజనం ఉండదని అధికారులు భావిస్తున్నారు. ఈ బ్యారేజీలో కిలో మీటరున్నర వరకు ఇసుక మేటలు ఉండటంతో పూర్తి సామర్థ్యం (10.87టీఎంసీలు) మేర నీరు నిల్వ సాధ్యపడదు. మేడిగడ్డ విషయానికొస్తే..  ప్రాణహిత, ఇతర వాగుల నుంచి ఈ బ్యారేజీలోకి ఇసుక వచ్చి పేరుకుపోయింది. ప్రవాహం ఎక్కువగా ఉండటంతో 85 గేట్ల ద్వారా నీటిని దిగువకు వదులుతున్నారు. ఈ బ్యారేజీలో బ్లాక్‌-1లోని తొమ్మిది గేట్లతో పాటు చివరలో ఉన్న మరో 10గేట్లలో కూడా ఇసుక మేటలు వేసినట్లు అధికారులు గుర్తించారు. ఫలితంగా గేట్లు మూసివేసే సమయంలో ఇక్కడ కూడా సమస్య రావచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  ఇసుకను పూర్తిస్థాయిలో తోడేస్తేనే రెండు బ్యారేజీల వద్ద నీటి నిల్వ సామర్థ్యం పెరగటంతో పాటు గేట్లను సురక్షితంగా మూసి వేసేందుకు వీలుంటుందని పేర్కొన్నారు. కాగా ప్రభుత్వ ఆదేశాలతో అన్నారం బ్యారేజీ ఎస్‌ఈ కరుణాకర్‌, డిప్యూటీ ఎస్‌ఈ సత్యనారాయణ, టీఎ్‌సఎండీసీ పీవో తారక్‌తో పాటు నీటిపారుదల శాఖ ఇంజనీర్లు, అధికారులు బ్యారేజీలోని ఇసుక మేటలను పరిశీలించారు. బ్యారేజీలో ఎన్ని క్యూబిక్‌ మీటర్ల ఇసుక నిల్వ ఉంది.. ఎన్ని రీచ్‌లు ఏర్పాటు చేసి ఇసుకను తోడెయొచ్చు? అని అధికారులు లెక్కలు వేశారు. పూర్తి నివేదికను తయారు చేసి వెంటనే ప్రభుత్వానికి పంపనున్నట్లు సమాచారం. 


సర్కారుకు రాబడి

 కాళేశ్వరం బ్యారేజీల్లో పేరుకపోయిన ఇసుకతో పాటు మానేరులో భూపాలపల్లి జిల్లా వైపు ఉన్న ఇసుకను కూడా టీఎ్‌సఎండీసీ ద్వారా తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అన్నారం బ్యారేజీ వద్ద వరద తగ్గడంతో ఇసుక మేటలు కనిపిస్తున్నాయని, మేడిగడ్డలోకి వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో ఇసుక మేటలు బయటకు కనిపించడం లేదని అధికారులు చెబుతున్నారు. ఈ మేరకు మేడిగడ్డ వద్ద ఇప్పటికప్పుడు ఇసుక తొలగించడం కష్టం అనే నిర్ధారణకు  వచ్చారు. అన్నారం వద్ద మాత్రం పూడికను తొలగించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ బ్యారేజీలో సుమారు 10 లక్షల క్యూబిక్‌ మీటర్లకు పైగా ఇసుక ఉంటుందని   ప్రాథమికంగా అంచనా వేశారు. యుద్ధప్రాతిపాదికన టెండర్లు నిర్వహించి బ్యారేజీ నుంచి ఇసుకను తోడేయాలని నిర్ణయించారు. ఇక మానేరుకు ఒకవైపు పెద్దపల్లి జిల్లా.. మరోవైపు భూపాలపల్లి జిల్లాల సరిహద్దులు ఉన్నాయి. ఇప్పటికే పెద్దపల్లి జిల్లాలో మానేరులో ఇసుక టెండర్లు నిర్వహించి విక్రయాలు చేస్తున్నారు. భూపాలపల్లి జిల్లాలో మానేరు ప్రవాహ టేకుమట్ల, చిట్యాల, మల్హర్‌ మండలాల్లో సుమారు 25లక్షల క్యూబిక్‌ మీటర్ల ఇసుక ఉన్నట్టు అధికారులు గుర్తించి ఎనిమిది చోట్ల ఇసుక రీచ్‌లకు టెండర్లు పిలిచారు. వీటితో పాటు అన్నారం బ్యారేజీలోని ఇసుకతో కలిపి సుమారు 35 లక్షల క్యూబిక్‌ మీటర్లకు పైగా ఇసుక లభ్యమయ్యే అవకాశం ఉంది. దీంతో మొదట బ్యారేజీల్లో పేరుకుపోయిన ఇసుకను తోడేసేందుకు అధికారులు దృష్టిపెట్టారు. వరదతో చేరిన ఇసుకతో కూడా సర్కారుకు భారీగా ఆదాయం రానుంది. 

Updated Date - 2022-08-05T09:33:32+05:30 IST