ప్రభుత్వ గృహ నిర్మాణాలకు ఇసుక ఉచితం

ABN , First Publish Date - 2020-08-13T07:39:31+05:30 IST

బలహీనవర్గాల పేదలు గృహ నిర్మాణ పథకం కింద నిర్మించుకునే ఇళ్ళకు ఉచితంగా ఇసుక తీసుకెళ్ళేందుకు అనుమతించాలని ప్ర

ప్రభుత్వ గృహ నిర్మాణాలకు ఇసుక ఉచితం

  స్వల్ప చార్జీలతో సరఫరాకు ప్రభుత్వ ఆదేశాలు


కలికిరి, ఆగస్టు 12: బలహీనవర్గాల పేదలు గృహ నిర్మాణ పథకం కింద నిర్మించుకునే ఇళ్ళకు ఉచితంగా ఇసుక తీసుకెళ్ళేందుకు అనుమతించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఇసుక సరఫరాను పర్యవేక్షిస్తున్న ఏపీఎండీసీ నిర్వహణ చార్జీలను వసూలు చేసుకునేందుకు మాత్రం అనుమతించింది.


దీనికనుగణంగా గతంలో వున్న పలు వుత్తర్వులకు సవరణలు చేస్తూ ప్రభుత్వం  నోటిఫికేషన్‌ జారీ చేసింది. కలెక్టరుగానీ ఆయన అనుమతి పొందిన అధికారి గానీ ధ్రువీకరించే గృహ నిర్మాణ పథకాలు, ప్రభుత్వం ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ కింద నిర్మించే ఇళ్ళకు ఈ మినహాయింపులు వర్తిస్తాయని వుత్తర్వుల్లో పేర్కొన్నారు. అన్ని రకాల చెరువులు, కాలువలు, వంకలు, ఏర్లు, ఇతర ఇసుక తవ్వకాలు జరిగే ప్రాంతాలు, పట్టా భూముల్లో తవ్వే ఇసుకకు ధరల మినహాయింపు వర్తిస్తుంది.


గృహ నిర్మాణ పథకాలన్నింటికీ ఉచితంగా ఇసుకు తీసుకెళ్ళేందుకు అనుమతిస్తూ ఏపీఎండీసీకి మాత్రం స్వల్ప నిర్వహణ చార్జీలు మాత్రం చెల్లిస్తే సరిపోతుందని వివరించారు. గతంలో ఇసుక ఉచితంగా తీసుకెళ్ళేందుకు వివిధ సందర్భాల్లో ప్రభుత్వం అవకాశం కల్పిస్తూ పలురకాల ఆదేశాలు జారీ చేసింది. వాటన్నిటినీ సవరిస్తూ కొత్త నోటిఫికేషన్‌ జారీ చేశారు. గతంలో స్థానికంగా వుండే వంకలు, కాలువలు, చెరువుల్లో స్థానికులు ఎద్దుల బళ్ళతోనూ, ట్రాక్టర్లతోనూ జిల్లా పరిధిలో ఉచితంగా ఇసుక తీసుకెళ్ళేందుకు అనుమతించారు. ఆ తరువాత ఎద్దుల బళ్ళతో ఏర్లు, నదుల నుంచి కూడా ఉచితంగా తీసుకెళ్ళొచ్చని మరో వుత్తర్వు జారీ చేశారు.


అనంతరం ప్రభుత్వం ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ కింద నిర్మించే గృహనిర్మాణ పథకాలకు కేవలం స్థానిక వంకలు, వాగులు, చెరువుల నుంచి మాత్రం పూర్తి ఉచితంగా సరఫరాకు ఉత్తర్వులు జారీ చేశారు. వీటన్నిటినీ పక్కన పెట్టి ఇప్పుడు తాజాగా ఇసుక తవ్వకాలు జరిగే అన్ని రకాల ప్రాంతాల నుంచి పేదల ఇళ్ళ నిర్మాణాలకు స్వల్ప చార్జీలతో ఇసుక తీసుకెళ్ళేందుకు అనుమతిస్తూ పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఉత్తర్వులు జారీ చేశారు. 

Updated Date - 2020-08-13T07:39:31+05:30 IST