ఇసుకలో కాంట్రాక్టర్ల మస్కా

ABN , First Publish Date - 2020-02-16T08:51:52+05:30 IST

రాష్ట్రంలో ఇసుక బంగారమే అయింది. కొందామంటే వెంటనే దొరకడం లేదు. రీచ్‌లను చేతిలో పెట్టుకొన్న మాఫియాకు మాత్రం లాభాలు కురిపిస్తోంది. తవ్వకం నుంచి రవాణా వరకూ ప్రభుత్వంలోని కొంతమంది పెద్దలు, వారి

ఇసుకలో కాంట్రాక్టర్ల మస్కా

ఏటా 1800 కోట్లు జేబులోకి

కొందరు ప్రభుత్వపెద్దల అండతో

చీకట్లో చెలరేగిపోతున్న వైనం

కలిసొస్తున్న గుడ్డి సీసీ కెమెరాలు

సంఖ్యపెంచి ఏజెన్సీల చేతివాటం

పర్మినెంట్‌ పేరిట 3లక్షలు వసూల్‌

పై నుంచి కిందిదాకా మాయేటన్నుకు 65 నష్టానికి చేసినా

ఎక్కడా తగ్గని సిరుల నిల్వలు

అమరావతి, ఫిబ్రవరి 15 (ఆంధ్ర జ్యోతి): రాష్ట్రంలో ఇసుక బంగారమే అయింది. కొందామంటే వెంటనే దొరకడం లేదు. రీచ్‌లను చేతిలో పెట్టుకొన్న మాఫియాకు మాత్రం లాభాలు కురిపిస్తోంది. తవ్వకం నుంచి రవాణా వరకూ ప్రభుత్వంలోని కొంతమంది పెద్దలు, వారి అనుయాయులు అందినకాడికి దోచుకుంటుంటే, ఏజెన్సీలు, ఏజెంట్లు, వాహనాల సరఫరాల కాంట్రాక్టర్లు క్షేత్రస్థాయిలో చెలరేగిపోతున్నారు. ఏజెన్సీకి అనుబంధంగా కొంతమంది ఏజెంట్లు ఉంటారు. భవిష్యత్తులో పర్మనెంట్‌ అవుతాయంటూ ఒక్కొక్కరి నుంచి రూ.లక్ష నుంచి రూ.3 లక్షల వరకూ వసూలుచేసినట్టు తెలుస్తోంది.


లారీ కాంట్రాక్టర్లు జీపీఎస్‌ అమర్చిన వాహనాలను వినియోగించాలనే నిబంధనను కాలదన్నుతున్నారు. ఇసుక పాలసీ కొనుగోలుదారులకు భారంగా మారినప్పటికీ కాంట్రాక్టర్లకు కాసుల వర్షం కురిపిస్తున్నదన్న మాట వినిపిస్తోంది. ‘ఇంటింటికి ఇసుక’ పథకం చివరకు కొంతమందికి ‘ఇంటి’ పథకంగా మారిపోయిందన్న అభిప్రాయం బలపడుతోంది. 


ఇదీ పద్ధతి..

రీచ్‌లో ఒక ట్రాక్టర్‌ మాత్రమే పెట్టి ఇసుకను మనుషులతోనే తవ్వించి లోడ్‌ చేయాలి. లోడ్‌ చేసిన ట్రాక్టర్‌ను సమీపంలోని ఇసుకయార్డు వద్దకు తీసుకువెళ్లి అక్కడ తూనిక యంత్రం మీద పెట్టి అన్‌లోడ్‌ చేయాలి. యార్డు నుంచి ఇసుక పాయింట్లకు తరలించే సమయంలో మళ్లీ అదే కాంట్రాక్టర్‌ లారీల్లోకి లోడ్‌ చేయాలి. ఎవరైనా ఇసుక కావాలని ఆన్‌లైన్‌లో ఆర్డరు పెడితే వారివద్ద...ఇసుక పాయింట్‌ నుంచి నిర్ణయించిన మొత్తాన్ని వసూలు చేయాలి. రీచ్‌లలోనూ, యార్డు వద్ద మార్గమధ్యంలోనూ చెక్‌పోస్టులు ఏర్పాటుచేయాలి. సీసీ కెమెరాలు అమర్చాలి. ఇవన్నీ కాంట్రాక్టర్‌కు పెట్టిన నిబంధనలు. వీటిని జిల్లా కేంద్రంలోని జిల్లా ఇసుక సరఫరా అధికారి లేదా ఖనిజాభివృద్ధి శాఖ అధికారులతోపాటు అమరావతిలోని ఆ శాఖ ఉన్నతాధికారుల కార్యాలయాలకు అనుసంధానించడంతో ఎక్కడైనా అక్రమాలు జరిగితే సకాలంలో గుర్తించి చర్యలు తీసుకునేందుకు వీలుంటుంది. ఈ ప్రక్రియనంతా జీవో 151లో స్పష్టంగా పొందుపరిచారు. 


జరుగుతున్నది ఇదీ..

తవ్వకం నుంచి రవాణా ఉండే ప్రక్రియలో ముఖ్య పాత్ర పోషించే కాంట్రాక్టర్లు ఒక్కో రీచ్‌లో బాధ్యతలు దక్కించుకున్నారు. 3టన్నుల సామర్థ్యం కలిగిన ట్రాక్టర్‌కు లోడ్‌ చేసేందుకు కూలీలు ఎంతలేదన్నా రూ.120వసూలు చేస్తారు. రీచ్‌నుంచి యార్డుకు రవాణా కోసం ఇంధనం, వాహనం నిర్వహణ, డ్రైవర్‌ వేతనం కలిపి కనీసం రూ.45ఖర్చు (టన్నుకు) అవుతుంది. రీచ్‌లోకి వాహనాలు వెళ్లి వచ్చేందుకు వీలుగా రోడ్డు ఏర్పాటు చేసి.. దానికి నిత్యం దానిని కొబ్బరిమట్టలు, రాళ్లు, మట్టి వేసి నిర్వహించాల్సి ఉంటుంది. కాబట్టి ట్రిప్పుకి రూ.75వరకూ పడుతుంది.


ఇవన్నీ కలుపుకుంటే 3టన్నుల ట్రాక్టరు రీచ్‌ నుంచి యార్డు కు రావడానికి కనీసం రూ.240 వరకూ అవుతుంది. అంటే  ఒక టన్నుకు రూ.80 అవుతుందన్నమాట. అయితే రాష్ట్రంలోని కొన్నిచోట్ల ఒక టన్ను ఇసుకను రీచ్‌ నుంచి యార్డుకు చేరవేయడానికి రూ.15కే కాంట్రాక్టర్లు టెండరు వేసి దక్కించుకోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. టన్నుకు రూ.65 నష్టానికి కాంట్రాక్టర్లు ఎలా చేరవేస్తున్నారనే విషయం ఖనిజాభివృద్ధి శాఖ అధికారులకు సైతం అంతుబట్టడం లేదు. అనేక కారణాలతో రాత్రిపూట ఇసుక రవాణాపై నియంత్రణ కొరవడింది. ఇదే అదునుగా చీకటిమాటున కాంట్రాక్టర్లు తమ పని కానిచ్చేస్తున్నారు. అలాగే, రిటర్న్‌ మార్కెట్‌ లారీలతో యార్డులకు ఇసుకను తరలిస్తూ మరింత లాభపడుతున్నారు. 


ఉదాహరణకు రీచ్‌ నుంచి ఇసుక చేరవేయాల్సిన ప్రాంతం 200 కిలోమీటర్లు దూరంలో ఉందనుకుందాం. 30 టన్నుల ఇసుక రవాణాకు ప్రభుత్వం సుమారు రూ.30 వేలు చెల్లిస్తుండగా, రిటర్న్‌ లారీలకు కాంట్రాక్టర్లు రూ.11 వేల నుంచి రూ.12 వేలు మాత్రమే చెల్లిస్తున్నారు. అంటే ట్రిప్పుకు రూ.18 వేల వరకూ కాంట్రాక్టర్‌కు మిగులుతున్నాయి. ఈ వ్యవహారంలో స్థానిక లారీ సరఫరా బ్రోకర్లనుంచి లారీల యజమానుల దాకా లాభపడుతున్నారు.

 

రాష్ట్రంలో ఏడాదికి సగటున 1.8 లక్షల టన్నుల ఇసుక రవాణా అవుతున్నందున సగం మొత్తానికే రిటర్న్‌ లారీలతో ఇసుకను తరలించడం వల్ల కాంట్రాక్టర్లకు ఏడాదికి రూ.1800 కోట్లు వరకూ మిగులుతోందంటున్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారించినట్టయితే ఆ మొత్తం రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు చేరుతుంది. ప్రజలపై ఆ మేరకు భారం తగ్గించేందుకు ఉపయోగపడుతుందని పలువురు సూచిస్తున్నారు. 

Updated Date - 2020-02-16T08:51:52+05:30 IST