‘ఇసుక’కు కోటరీయే అడ్డం

ABN , First Publish Date - 2020-06-07T08:38:22+05:30 IST

క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న ఇసుక సమస్యను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి దృష్టికి కోటరీ తీసుకు వెళ్లనీయడం లేదని నరసాపురం వైసీపీ ఎంపీ కనుమూరి రఘురామకృష్ణంరాజు అన్నారు. ‘‘విజయవాడ

‘ఇసుక’కు కోటరీయే అడ్డం

  • ఏదీ సీఎం వరకు పోనీయడం లేదు
  • ‘5 గంటల ఆఫ్‌లైన్‌’మంచి నిర్ణయం
  • అమలుకోసం నా వంతుగా కృషి చేస్తా
  • ఎంపీ రఘురామకృష్ణంరాజు వెల్లడి

అమరావతి, జూన్‌ 6 (ఆంధ్రజ్యోతి): క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న ఇసుక సమస్యను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి దృష్టికి కోటరీ తీసుకు వెళ్లనీయడం లేదని నరసాపురం వైసీపీ ఎంపీ కనుమూరి రఘురామకృష్ణంరాజు అన్నారు. ‘‘విజయవాడ సెంట్రలైజ్డ్‌ సిస్టమ్‌లో ఇసుక బుకింగ్స్‌ సజావుగా సాగడం లేదు. ఈ సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి నేను తీసుకెళ్లగానే, ఆయన సమీక్షించి కార్యాచరణను సిద్ధం చేశారు’’ అని తెలిపారు. ఆయనిక్కడ శనివారం మీడియాతో మాట్లాడారు. ‘‘ప్రతి గ్రామంలోని వార్డు సచివాలయంలో బుకింగ్స్‌ ఆఫ్‌లైన్‌లో కనీసం ఐదుగంటల పాటు నమోదు చేసుకునేలా విధానం తీసుకువస్తూ సీఎం తీసుకున్న నిర్ణయంతో ఇసుక సమస్యకు పరిష్కారం దొరికినట్టే. ఎద్దులబండ్లమీద ఇసుకను ఉచితంగా తీసుకువెళ్లడానికీ ఆయన అనుమతించారు. ఇసుక సమస్యపై నాతోసహా.. ఎమ్మెల్యేలు జగ్గిరెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, ధర్మాన, మహేందర్‌రెడ్డి, బ్రహ్మ నాయుడు తదితరులు సీఎం దృష్టికి తీసుకువచ్చిన వెంటనే వారంలో ధరలు తగ్గించాలని ఆదేశించారు. ఇలా మంచి నిర్ణయాలు తీసుకున్నప్పుడు స్వాగతించాలి. సీఎం లక్ష్యసాధన కోసం నేను నా వంతుగా కృషి చేస్తాను’’ అని పేర్కొన్నారు.  వర్షాలు వస్తే ఇసుక తీయడం ఇబ్బందికరంగా మారొచ్చునన్నారు. ‘‘ఆన్‌లైన్‌లోకి తీసుకురావడంద్వారా పారదర్శకమైన ఇసుక పాలసీని అమలుచేయొచ్చునని జగన్‌ నమ్మారు. కానీ దురదృష్టవశాత్తూ, ఎంపీఎండీసీ నిర్వాకం కారణంగాగానీ, ఇతర అంశాల వల్లగానీ ఇసుక సమస్య తలెత్తింది. సప్లయి విషయంలో తప్పు జరిగింది. బల్క్‌ బుకింగ్‌లో ఘోరంగా విఫలమయ్యాం’’ అని రఘురామకృష్ణంరాజు అంగీకరించారు. ఈ అంశంపై సీఎం పర్యవేక్షణ చేయాలని, లేకపోతే ఇసుక తుఫాను వచ్చే అవకాశం లేకపోలేదన్నారు. ఒక్కోసారి ఐన్‌స్టీన్‌లాంటి గొప్ప శాస్త్రవేత్తలకు సైతం చిన్నచిన్న ఆలోచనలు తట్టవని, ఇసుకే కదా అని అనుకున్నారని, కానీ అది ఇంత పెద్దసమస్య సృష్టిస్తుందని సీఎం ఊహించలేదన్నారు. ఈ సమస్య సీఎం దృష్టికి వెళ్లలేదనేది వాస్తవమని, కోటరీలో ఒకరిద్దరిని తప్పించి పాలనలో మార్పులు తీసుకువస్తే, తప్పులు జరిగేందుకు ఆస్కారం ఉండదన్నారు.

Updated Date - 2020-06-07T08:38:22+05:30 IST