కొండాపురంలో ఇసుక దోపిడీ

ABN , First Publish Date - 2021-05-18T05:20:52+05:30 IST

కొండాపురం మండలంలోని యనమలచింతల, పొట్టిపాడు గ్రామాల్లోని పెన్నానదిలో కొందరు వైసీపీ నాయకులు ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని ఎమ్మెల్సీ బీటెక్‌ రవి తెలిపారు.

కొండాపురంలో ఇసుక దోపిడీ
విలేకరులతో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ బీటెక్‌ రవి

ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డికి మామూళ్లు ఇస్తున్నట్లు వైసీపీ నాయకుల ఆరోపణలు

అరికట్టకపోతే నేనే స్వయంగా టెంట్‌ వేస్తా

ఎమ్మెల్సీ బీటెక్‌ రవి

జమ్మలమడుగు రూరల్‌, మే 17: కొండాపురం మండలంలోని యనమలచింతల, పొట్టిపాడు గ్రామాల్లోని పెన్నానదిలో కొందరు వైసీపీ నాయకులు ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని ఎమ్మెల్సీ బీటెక్‌ రవి తెలిపారు. సోమవారం జమ్మలమడుగు టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన  మాట్లాడుతూ ఇసుక తరలింపులో ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డికి మామూళ్లు ఇస్తున్నట్లు అక్కడి వైసీపీ నాయకులే ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. గ్రామాల్లో రూ.9 వేల నుంచి రూ.9500కు నేరుగా లోడింగ్‌ చేసి రూ.12 వేలకు ఇసుక విక్రయిస్తున్నారన్నారు. అదే పులివెందులకు అయితే రూ.15 వేలు విక్రయిస్తున్నారని ఆయన తెలిపారు. పులివెందుల, సింహాద్రిపురం, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడ చూసినా వందల టిప్పర్లతో ఇసుక డంప్‌లు నిలువ పెట్టారన్నారు. ఇంత జరుగుతున్నా జిల్లా అధికారులు కానీ, స్థానిక అధికారులు కానీ ఎవరూ ఇసుక అక్రమాలను, దోపిడీని అరికట్టడం లేదని విమర్శించారు. నిబంధనలను తుంగలో తొక్కి 35 క్యూబిక్‌ మీటర్లు ఇసుక తవ్వాల్సి ఉండగా రెండు లక్షల క్యూబిక్‌ మీటర్లు ఇసుక తీసి విక్రయిస్తున్నారన్నారు. నేను పై ప్రాంతాలను సందర్శించినప్పుడు ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డికి, పోలీసులకు మామూళ్లు ఇస్తున్నట్లు అక్కడ వైసీపీ నాయకులే చెప్పారన్నారు. నిజాయితీని నిరూపించుకోవాలంటే ఎమ్మెల్యే పర్యవేక్షించి ఇసుక దోపిడీని అరికట్టాలన్నారు.  ఇసుక దోపిడీని అరికట్టకపోతే నెల రోజుల్లో అక్కడే టెంట్‌ వేసి అడ్డుకట్టకు కృషి చేస్తానని, సమస్యను జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. కొండాపురం మండలంలో మునక గ్రామాలకు రావాల్సిన రూ.3.25 లక్షలు ఇంతవరకు ఇవ్వలేదన్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు బాధ్యులతో కలిసి జిల్లా అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్తానన్నారు. జమ్మలమడుగులో స్టీల్‌ప్లాంట్‌ నిర్మాణంలో ముఖ్యమంత్రి ఎందుకు జాప్యం చేస్తున్నారని ప్రశ్నించారు. జమ్మలమడుగు ప్రభుత్వ ఆస్పత్రిలో కొవిడ్‌కు 15 బెడ్లు ఏర్పాటు చేసి 60 ఆక్సిజన సిలిండర్లు మాయం చేశారన్నారు. అక్కడ పనిచేసే సూపరింటెండెంట్‌ ఆక్సిజనను అమ్ముకున్నట్లు ఆరోపణలు ఉన్నాయన్నారు. కొవిడ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయడంలోనే ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి విఫలమయ్యారన్నారు. సమావేశంలో టీడీపీ నాయకులు విజయ్‌కుమార్‌రెడ్డి, గొరిగెనూరు సుధీర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.



Updated Date - 2021-05-18T05:20:52+05:30 IST