Abn logo
Sep 13 2021 @ 22:59PM

వరదొచ్చే.. ఇసుకకు కొరతొచ్చే

నాగావళి తీరంలో ఒక ర్యాంపు వద్ద నీట మునిగిన ఇసుక నిల్వలు

- నాగావళి, వంశధార నదుల్లో నిలిచిన తవ్వకాలు

- బ్లాక్‌ మార్కెట్లో అమాంతం పెరిగిన ధరలు

- నీటి ప్రవాహం తగ్గితేనే ర్యాంపులు ప్రారంభం

- నిలిచిన ప్రభుత్వ, ప్రైవేట్‌ పనులు

(శ్రీకాకుళం-ఆంధ్రజ్యోతి)

జిల్లాలో మళ్లీ ఇసుక కొరత ఏర్పడింది. గత వారం రోజులుగా ఒడిశా ఎగువ ప్రాంతంతో పాటు జిల్లాలో కురుస్తున్న వర్షాలకు నాగావళి, వంశధార నదులు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో ఇసుక తవ్వకాలు నిలిచిపోయాయి. కొత్త పాలసీ ప్రకారం ప్రభుత్వం ఇసుక తవ్వకాలు, విక్రయాలను జేపీ వెంచర్స్‌ సంస్థకు అప్పగించిన సంగతి తెలిసిందే. ఆ సంస్థ ఇప్పటికే నాగావళి పరిధిలో 5 రీచ్‌లు, వంశధార పరిధిలో 12 రీచ్‌లను ప్రారంభించి ఇసుకను తవ్వుతోంది. వర్షాలకు కర్లాం, అంధవరం, చోడవరం, కళ్లేపల్లి, కిల్లిపాలెం, మాకివలస రీచ్‌లు జలమయమయ్యాయి. మిగతా రీచ్‌ల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో వారం రోజులుగా ఇసుక తవ్వకాలను నిలిపేశారు. స్థానికులతో ఏర్పడిన వివాదాల కారణంగా తునివాడ, కండిస ర్యాంపులను గతంలోనే ఆపేశారు. ఫలితంగా జిల్లాలో తీవ్ర ఇసుక కొరత ఏర్పడింది. జేపీ వెంచర్స్‌ నిర్వాహకులు.. అధికారుల ముందస్తు ఆదేశాలతో దూసి, పురుషోత్తపురం, తునివాడ, అంగూరు, ఆకులతంపర, లింగంనాయుడుపేట, గార, సిద్ధిపేట స్టాక్‌ పాయింట్ల వద్ద సుమారు 1.50 లక్షల క్యూబిక్‌ మీటర్ల ఇసుక నిల్వలు సిద్ధంగా ఉంచారు. అయినా కొరత తీరడం లేదు. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు పనులకు సంబంధించి ప్రతిరోజూ సుమారు 5 వేల మెట్రిక్‌ టన్నుల ఇసుక అవసరం. విశాఖకు 1,600, విజయనగరానికి 2 వేల మెట్రిక్‌ టన్నుల ఇసుకను బుచ్చిపేట, పర్లాం, మడపాం, పురుషోత్తపురం ర్యాంపుల నుంచి తరలిస్తున్నారు. ప్రస్తుతం ఈ ర్యాంపుల్లోనూ తవ్వకాలు నిలిచిపోయాయి. నాగావళి, వంశధార నదుల్లో వరద తగ్గుముఖం పడితేనే ర్యాంపులను తిరిగి ప్రారంభించే అవకాశం ఉందని గనుల శాఖ అధికారులు చెబుతున్నారు. 


పెరిగిన డిమాండ్‌..

వరదల కారణంగా తవ్వకాలు నిలిచిపోవడంతో ఇసుకకు విపరీతమైన డిమాండ్‌ పెరిగింది. జేపీ వెంచర్స్‌ స్టాక్‌ పాయింట్లలో నిల్వ ఉన్న ఇసుకను ప్రభుత్వ నిర్మాణాలు, పేదల ఇళ్లకు మాత్రమే విక్రయించాలని అధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దీంతో దళారులు కాసులు దండుకునే పనిలో పడ్డారు. నరసన్నపేట మండలం బుచ్చిపేట, ఊటపేట, మడపాం, చేనులవలస ర్యాంపుల వద్ద ఒక్కో లారీకి రూ.2వేల నుంచి రూ.4 వేలు వసూలు చేసి.. లోడింగ్‌కు పంపుతున్నారు. కొత్తూరు మండలం ఆకులతంపర, అంగూరు ర్యాంపులు నిలిచిపోవడంతో స్టాక్‌ పాయింట్ల వద్ద కేవలంలారీలకు మాత్రమే ఇసుక లోడింగ్‌ చేస్తున్నారు. స్థానిక అవసరాలు, పేదల ఇళ్ల నిర్మాణాలకు అనుమతి ఇవ్వడంలేదు. దీంతో ఇసుక పర్మిట్‌ల కోసం చాలామంది గ్రామ సచివాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సి వస్తోంది. వీఆర్వోలు ప్రస్తుతం పర్మిట్లను నిలిపేశారు. పాలకొండ, ఆమదాలవలస, శ్రీకాకుళం, నరసన్నపేట నియోజకవర్గాల పరిధిలో టైరు బండ్ల ద్వారా  పేదల ఇళ్ల నిర్మాణాలకు ఇసుకను తరలిస్తున్నారు. గతంలో బండి ఇసుక రూ.వెయ్యి ఉంటే.. ఇప్పుడు రూ.2వేలు తీసుకుంటున్నారు. ఇదే అదునుగా కొందరు స్థానిక చోటా నాయకులు, ట్రాన్స్‌ఫోర్టు యాజమానులు ముందస్తు వ్యూహంతో.. టైరు బండ్లపై  ఇసుకను రహస్య ప్రదేశాల్లో డంప్‌ చేసి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. గతంలో లారీలు, వ్యాన్‌ల్లో ఇసుక తరలిస్తే.. రూ.7వేల నుంచి రూ.10 వేలు మాత్రమే అయ్యేది. ప్రస్తుతం ర్యాంపులు నిలిచిపోవడంతో బ్లాక్‌ మార్కెట్‌లో లారీ ఇసుక రూ.25 వేల నుంచి రూ.35 వేల వరకు పలుకుతోంది. 


 

ఇసుకలో పోసినట్టేనా?

- ప్రభుత్వ ఖాతాల్లో వినియోగదారుల నగదు

- నిధుల విడుదలలో ఏపీఎండీసీ జాప్యం

- అర్జీలు పెట్టుకున్నా.. పట్టించుకోని వైనం 

- ఇతర ఖాతాలకు మళ్లాయనే అనుమానం

(శ్రీకాకుళం-ఆంధ్రజ్యోతి)

ఇసుక కోసం ఆన్‌లైన్‌ విధానంలో వినియోగదారులు చెల్లించిన సొమ్ము పక్కదారి పడుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీ మైన్స్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీఎండీసీ)కి ఇసుక కోసం ఆన్‌లైన్‌ చలానాల ద్వారా చెల్లించిన లక్షలాది రూపాయలు ప్రభుత్వ ఖజానాలో ఉండిపోయాయి. దీంతో వినియోగదారులు లబోదిబోమంటున్నారు. ప్రస్తుతం ఇసుక సరఫరా నిలిచిపోగా.. తాము చెల్లించిన డబ్బులు తిరిగి ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నారు. జిల్లాలో ఇసుక కావాలంటే వినియోగదారులు ఆన్‌లైన్‌ విధానంలో ఏపీఎండీసీ వెబ్‌సైట్‌లో చలానాలు చెల్లించి.. బుకింగ్‌ చేసుకునేవారు. జేపీ ఇన్‌ఫ్రా సంస్థకు ఇసుక పంపిణీ బాధ్యతలు అప్పగించిన తర్వాత.. ఏపీఎండీసీ వెబ్‌సైట్‌ పూర్తిగా నిలిచిపోయింది. జేపీ సంస్థ నాగావళి పరిధిలో ఐదు రీచ్‌లు, వంశధార పరిధిలో 12 రీచ్‌లలో ఇసుక తవ్వకాలు చేపడుతోంది.  ప్రస్తుతం వరదల కారణంగా నీటిప్రవాహం ఎక్కువగా ఉండడంతో ఇసుక తవ్వకాలు నిలిపివేసింది. జూలై మొదటి వారం వరకు జిల్లాలో వేలాది మంది వినియోగదారులు ఇసుక కోసం ఏపీఎండీసీకి ఆన్‌లైన్‌లో చలానాలు చెల్లించారు. ప్రభుత్వం నిర్ణయించిన ధర ప్రకారం టన్నుకు రూ.475 వంతున.. చాలామంది డబ్బులు చెల్లించారు. విశాఖలో నిర్మాణాలకు కూడా ఇక్కడి ఇసుకే వినియోగిస్తుండడంతో.. ఆ ప్రాంతం నుంచి పెద్దసంఖ్యలో ఒక్కొక్కరు సుమారు రూ.15వేల వరకు చలానాలు తీశారు. జిల్లాలో సుమారు 6,850 మంది వినియోగదారులు.. దాదాపు రూ.48.50 లక్షలు చెల్లించారు. ఇవన్నీ ప్రభుత్వ ఖాతాలో ఉండిపోయాయి. జేపీ సంస్థకు బాధ్యతలు అప్పగించిన తర్వాత.. ఆన్‌లైన్‌లో ఇసుక కోసం చలానాలు తీసిన  మొత్తాన్ని వినియోగదారులకు చెల్లించలేదు. ఇసుక పంపిణీ చేయడం లేదు. కనీసం తాము చలానా తీసిన మొత్తాన్ని తిరిగి చెల్లించాలని గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి వినియోగదారులు అడుగుతున్నా.. స్పందించడం లేదు. ఈ నిధులు ఇతరత్రా పథకాలకు దారి మళ్లించారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇసుక పంపిణీ పర్యవేక్షణ కోసం కలెక్టరేట్‌లో ఏపీఎండీడీ అధికారులు ప్రత్యేకంగా ఒక విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఈ విభాగానికి నిత్యం వందల సంఖ్యలో వినియోగదారులు తాము ఆన్‌లైన్‌లో చెల్లించిన మొత్తాన్ని తిరిగి ఇవ్వాలని వేడుకుంటూ అర్జీలు పెట్టుకుంటున్నా, పట్టించుకునేవారు కరువయ్యారు. మీసేవ కేంద్రాల నిర్వాహకులు మాత్రం మీ బ్యాంకు ఖాతాల్లో రెండు మూడు రోజులుల్లో కట్టిన డబ్బు జమవుతుందని చెబుతున్నారు. ఈ చెల్లింపుల విషయంపై ఏపీఎండీసీ అధికారులు సరైన సమాధానం చెప్పకపోవడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. ఈ మొత్తం తమ చేతికి మళ్లీ ఎప్పుడు అందుతుందోనని ఆశగా ఎదురుచూస్తున్నారు.