నెరవేరనున్న గొందిగూడెం వాసుల కల

ABN , First Publish Date - 2020-10-30T11:36:41+05:30 IST

మండలంలోని మారుమూల ప్రాంతమైన గొందిగూడెం ఇసుకవాగుపై వంతెన నిర్మాణానికి ఎట్టకేలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది.

నెరవేరనున్న గొందిగూడెం వాసుల కల

ఇసుక వాగుపై వంతెన నిర్మాణానికి రూ. 1.20 కోట్లు మంజూరు


అశ్వాపురం అక్టోబరు 29: మండలంలోని మారుమూల ప్రాంతమైన గొందిగూడెం ఇసుకవాగుపై వంతెన నిర్మాణానికి ఎట్టకేలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. వంతెన నిర్మాణానికి ప్రభుత్వం రూ. 1.20 కోట్లు మంజూరు చేసినట్లు పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు సోషల్‌ మీడియా ద్వారా తెలిపారు. కాగా ఇసుకవాగుపై వంతెన నిర్మించాలని మూడు దశాభ్ధాలుగా స్థానికులు కోరుతున్నారు. ప్రభుత్వాలు మారినా ఇన్నేళ్లు వారి కల సాకారం కాలేదు. వర్షం కాలం వచ్చిందంటే ఇసుక వాగు ఉప్పొంగటంతో ఉమ్మడి గొందిగూడెం పంచాయతీ లోని పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించటమే కాకుండా బాహ్య ప్రపంచంతో ఆయా గ్రామాలకు సంబంధాలు తెగిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యేవారు. ఈ నేపథ్యంలో 2018 ఎన్నికల్లో ప్రస్తుత శాసనసభ్యుడు రేగా కాంతారావు ఇసుక వాగు పై బ్రిడ్జి నిర్మాణానికి ప్రజలకు ఆయన హామీ ఇచ్చారు. ఈనేపథ్యంలో వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు చేయించటంతో ఎంపీపీ ముత్తినేని సుజాత, గొందిగూడెం సర్పంచ్‌ పాయం భద్రమ్మ హర్షం వ్యక్తం చేశారు.

Updated Date - 2020-10-30T11:36:41+05:30 IST