ఇసుక అక్రమ రవాణా

ABN , First Publish Date - 2022-08-15T06:20:29+05:30 IST

ఇసుక అక్రమ రవాణా

ఇసుక అక్రమ రవాణా
బుడమేరులోని ఇసుకను ట్రాక్టర్‌కు లోడ్‌ చేస్తూ..

మైలవరం కేంద్రంగా బుడమేరును తోడేస్తున్న తోడేళ్లు

అధికార పార్టీ నేతల అండతో అధిక ధరలకు విక్రయాలు


జి.కొండూరు, ఆగస్టు 14 : మైలవరంలో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. బుడమేరు పరివాహక ప్రాంతమైన జి.కొండూరు మండలం చిన్ననందిగామ, కుంటముక్కల గ్రామాల వద్ద ఇసుక ర్యాంప్‌పై అక్రమార్కుల కళ్లు పడ్డాయి. ఇంకేముంది పెద్ద ఎత్తున ఇసుక అక్రమ రవాణాకు తెరలేపారు. గత కొన్నేళ్లుగా గుట్టుచప్పుడు కాకుండా ఈ తంతు జరుగుతున్నా అధికార పార్టీ నేతల ఒత్తిడి కారణంగా అధికారులెవరూ అడ్డుకోలేదు. దీన్ని ఆసరా చేసుకుని అక్రమార్కులు మరింత తెగబడుతున్నారు. ట్రాక్టర్‌ ఇసుక రూ.4 వేలకు, డిమాండ్‌ను బట్టి రూ.5 వేలకు అమ్ముకుంటున్నారు. ఎవరైనా అధికారి పట్టుకుని కేసు పెడితే, రూ.10 వేలు జరిమానా కట్టి, మళ్లీ బయటకొచ్చి ఇసుక తవ్వుతున్నారు. 

ప్రైవేట్‌ పాఠశాల నిర్మాణానికి భారీగా..

మైలవరంలో ఓ ప్రైవేట్‌ పాఠశాల నిర్మాణానికి 100 ట్రాక్టర్ల ఇసుకను డంప్‌ చేశారు. మూడంతస్తుల భవన నిర్మాణానికి కుంటముక్కల సమీపంలోని బుడమేరు ఇసుకనే వాడారంటే ఏ స్థాయిలో ఇక్కడ ఇసుక అక్రమ రవాణా జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. బుడమేరు పక్కనే ఉన్న తన సొంత పొలం నుంచి బుడమేరులోకి దారి ఏర్పాటుచేసి మరీ ఇసుకను దోచేస్తున్నారు. అధికార పార్టీ నేతల అండదండలు ఉండటంతో అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. పట్టణంలో పెద్దల పేర్లు వాడటంతో పాటు కొందరు అధికారులకు ముడుపులు అందుతున్నాయి. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని పలువురు కోరుతున్నారు. 

చర్యలు తీసుకుంటాం : వీఆర్వో

ఈ విషయంపై వీఆర్వో శ్రీనివాసరావు స్పందిస్తూ ఇటీవలే బదిలీపై చిన్ననందిగామ గ్రామానికి వీఆర్వోగా వచ్చానని, బుడమేరు నుంచి ఇసుక అక్రమ రవాణా విషయం తెలుసుకుంటానని, అలా ఏదైనా జరిగి ఉంటే తప్పక చర్యలు తీసుకుంటానన్నారు. 

Updated Date - 2022-08-15T06:20:29+05:30 IST